ఇప్పుడొస్తున్న చాలా ఎలక్ట్రిక్ వాహనాలు రేంజ్ విషయంలో చాలా మందిని నిరుత్సాహపరుస్తున్నాయి. కంపెనీలు చెప్పే రేంజ్ ఒకటి.. రియాలిటీలో అది ఇచ్చే రేంజ్ ఒకటి. కంపెనీ వాళ్ళు మెలిక పెడతారు. సర్టిఫైడ్ రేంజ్ 150, ట్రూ రేంజ్ వంద అని అంటారు. చాలా మంది 150 అనుకుని పొరబడతారు. పోనీ టాప్ స్పీడ్ ఏమైనా 100 దాటుతుందా అంటే కష్టమే. అలా దాటే వాహనం ఉందంటే ఫైర్ అయిపోతున్నాయన్న వార్తల్లో ఉంటాయి. మంచి కంపెనీ వాహనాలు కొందామంటే ధర చుక్కలు చూపిస్తున్నాయి. ఇవన్నీ కాకుండా మంచి రేంజ్, అలానే టాప్ స్పీడ్ మినిమమ్ వంద దాటి ఉండేలా, ధర భరించగలిగేలా ఏదైనా బండి ఉంటే చెప్పు గురూ అని అనుకునేవారి కోసమే ఈ వన్ సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ వెహికల్.
వన్ సింపుల్ ఎనర్జీ కంపెనీ యొక్క సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఇప్పుడు మీరు తెలుసుకోబోతున్నారు. సింపుల్ వన్ అంటే పేరుకి తగ్గట్టే సింపుల్ గా ఉంటుంది అని అనుకోకండి. ధర ఒక్కటే సింపుల్ గా ఉంటుంది. కానీ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ చూస్తే మాత్రం హెవీగానే ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 236 కి.మీ. రేంజ్ ఇస్తుంది. 2.77 సెకండ్స్ లో 0 నుంచి 40 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 105 కి.మీ. గా ఉంది. 236 కి.మీ. రేంజ్ కోసం దీనిలో రెండు బ్యాటరీలు అమర్చారు. ఒకటి ఫిక్స్డ్ గా ఉంటుంది. మరొకటి రిమూవబుల్ బ్యాటరీ. ఫిక్స్డ్ బ్యాటరీ 3.3 కిలోవాట్ ఉండగా, రిమూవబుల్ బ్యాటరీ 1.5 కిలోవాట్ తో వస్తోంది. రెండు బ్యాటరీలు కలిపి 4.8 కిలోవాట్ సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
ఫిక్స్డ్ బ్యాటరీ బండి అడుగు భాగంలో ఉంటే, మరొకటి సీటు కింద ఉంటుంది. బూట్ స్పేస్ 30 లీటర్లు కలిగి ఉంది. టార్క్ స్పీడ్ 72 ఎన్ఎం ఉండగా.. నామినల్ పవర్ 4.5 కిలోవాట్ ఉంది. దీని బరువు 115 కిలోలు ఉంటుంది. ఫీచర్స్ విషయానికొస్తే.. రిమోట్ యాక్సెస్, సెక్యూరిటీ కోసం జీఈవో ఫెన్సింగ్, ఓటీఏ అప్ డేట్స్, రూట్స్ ని సేవ్ చేసుకుని ఫార్వార్డ్ చేసుకునే ఫీచర్, రైడ్ స్టాటిస్టిక్స్, రిమోట్ లాకింగ్ ఫీచర్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్లకు యాప్ ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. దీని డ్యాష్ బోర్డు విషయానికొస్తే.. వెహికల్ స్టేటస్, కస్టమైజ్, బ్లూటూత్ కనెక్టివిటీ వంటి ఫీచర్స్ ఉన్నాయి. టచ్ స్క్రీన్ డిస్ప్లే అమర్చారు. జర్నీలో ఉండగా ఫోన్ కాల్స్ వస్తే.. కాల్స్ యాక్సెప్ట్ చేయవచ్చు. ముందుగానే మ్యాప్స్ ని సెట్ చేసుకుని.. జర్నీ చేయవచ్చు.
తెలియని రూట్స్ లో వెళ్ళేటప్పుడు ప్రత్యేకించి ఫోన్ తీసి ఆపరేట్ చేయాల్సిన పని లేదు. జస్ట్ సింపుల్ వన్ బండి మీద ఉన్న డిస్ప్లే స్క్రీన్ ని ఆపరేట్ చేస్తే చాలు. ఇది నాలుగు రంగుల్లో వస్తుంది. బ్రెజెన్ బ్లాక్, నమ్మ రెడ్, యజుర్ బ్లూ, గ్రేస్ వైట్ రంగుల్లో వస్తుంది. ఇది రెండు వేరియంట్లలో రానుంది. ఒకటి స్టాండర్డ్ వేరియంట్, మరొకటి ఎక్స్ట్రా రేంజ్. ఎక్స్ట్రా రేంజ్ అంటే 300+ కిలోమీటర్లు రేంజ్ తో వస్తుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. అంటే 4.8 కిలోవాట్ బ్యాటరీ, అదనంగా 1.6 కిలోవాట్ బ్యాటరీ వస్తుందని చెబుతున్నారు. స్టాండర్డ్ వేరియంట్ ఎక్స్ షోరూం ధర రూ. 1,09,999 ఉండగా.. ఎక్స్ట్రా రేంజ్ ఎక్స్ షోరూం ధర రూ. 1,44,999 ఉంటుందని అంచనా వేస్తున్నారు.
లక్షా 10 వేలకి 236 కిలోమీటర్ల రేంజ్ ఎలక్ట్రిక్ వెహికల్ అంటే మంచి ధరే అని చెప్పవచ్చు. ఇంకా ఎక్కువ దూరాలు వెళ్ళేవాళ్ళు ఎక్స్ట్రా రేంజ్ వెహికల్ తీసుకుంటే ఆ లక్ష 50 వేలు మంచి ధరే అని చెప్పవచ్చు. ఆల్రెడీ సింపుల్ వన్ కంపెనీ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ స్టార్ట్ చేసింది. ఈ ఏడాదిలోనే రిలీజ్ చేయాలని భావిస్తుంది. ఈ వాహనం ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. దీన్ని కొనాలనుకుంటే 1947 రూపాయలతో ఆన్ లైన్ లో ప్రీ బుక్ చేసుకోవాలి. 1947 నంబర్ చూస్తేనే అర్థమవుతుంది.. ఇది పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ అని. ఇది ఇండియా వాళ్ళ కోసం తయారు చేయబడింది. మరి సింపుల్ వన్ ఎలక్ట్రిక్ వెహికల్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.