కొత్త ఏడాది వస్తోందంటే చాలు.. మనలో చాలామంది ఏవేవో తీర్మానాలు చేసేస్తుంటాం. జనవరి మొదలు ఇది చేసేద్దాం.. అది చేసేద్దాం అని ఎన్నో కలలు, దృఢ నిర్ణయాలు తీసుకుంటాం. అయితే వాటిల్లో 80 శాతానికిపైగా నిర్ణయాలు మొదటి నెల ముగిసేలోగానే అటకెక్కేస్తాయి. ఈ ఏడాదైనా అలాకానివ్వకండి. రాను.. రాను.. డబ్బుకు విలువ పెరుగుతోంది. చేతిలో రూపాయి లేకుంటే మనిషికి విలువ కూడా ఉండట్లేదు. ప్రపంచం అంతా డబ్బు చుట్టే తిరుగుతోంది. అందులోనూ ఆర్థిక కష్టాలు మనకు చెప్పిరావు. ఈ వాస్తవాలను ఒకసారి ఆలోచించండి.
డబ్బు సంపాదించాలని.. ధనవంతులుగా మారాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలా అని రాత్రికి రాత్రే ఎవరూ కూడా ధనవంతులు కాలేరు. ఒకవేళ అయినా వాళ్ల అదృష్టం బాగుండి ఏదో లాటరీ తగలడమో/ విలువైన సంపద దొరకడమో తప్ప మాములుగా అవ్వలేరు. కావున అత్యాశ కోరికలు, అంకెల గారడీలు మానుకొని.. ఆర్థిక ప్రణాళికలు అలవరుచుకోండి. దీని వల్ల అంబానీ, అదానీ అంత కాకపోయినా అవసరమైన మేరకు వెనుకేసుకోవచ్చు. అదెలా అన్నది ఇప్పుడు చూద్దాం..
ఏది పాటించిన పాటించకపోయినా ఇది మాత్రం అందరూ పాటించాల్సిందే. ‘నాకొచ్చే నాలుగు రాళ్లు .. నాకు, నా కుటుంబ అవసరాలకే సరిపోవట్లేదు అనుకోకుండా.. వచ్చేది నాలుగు రాళ్ళైనా అందులో ఒకటో.. అరో సేవ్ చేయాలి. అలా చేయడం వల్ల ఒకటికి.. మరొకటి తోడవుతూ పది రోజుల్లో పదికి చేరుతుంది. అత్యవసరం ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో చెప్పలేం. ఆ రోజు మీకు సహాయపడేది.. సేవింగ్స్ మాత్రమే.
మదుపు చేయాలంటే ప్రారంభంలోనే పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టాలని కాదు. రూ.500 లాంటి చిన్న మొత్తంతో పెట్టుబడులు ప్రారంభించినా ఒక క్రమ పద్ధతిలో అలవాటుగా చేస్తూపోతే మంచి రాబడి సాధించవచ్చు. మనం పొదుపు చేసే రూ.500 లాంటి చిన్న మొత్తాలే దీర్ఘకాలంలో లక్షల రూపాయలను.. కోట్ల రూపాయలను మనకు రాబడిగా అందిస్తాయి. మనకు వయసు పెరిగాక.. ఆర్థిక అవసరాలు పెరిగినపుడు మనకు దారిచూపేది.. పెట్టుబడులు మాత్రమే.
‘అప్పు..’ ముఖ్యంగా చేయకూడని పని ఏదైనా ఉందా అంటే అది ఇదే. మన సంపాదనకు తగ్గట్టుగా మన ఖర్చులుండాలి. అలాకాకుండా.. సంపాదన 4, ఖర్చు 14 అంటే అప్పులు బాధలు తప్పవు. గొప్పలకు పోయి అప్పులు చేసి తిప్పలు తెచ్చుకోవద్దు. ఒకదాని మీద మరొకటి అప్పులు ఎడాపెడా చేస్తే గొడవలే వస్తాయి. ఈ విషయాలు గమనించుకుని జాగ్తత్తలు తీసుకుంటే సరి.
ప్రతి కుటుంబంలో నిత్యావసర ఖర్చులు తప్పనిసరి. అంటే అద్దె, రవాణా, పిల్లల స్కూల్ ఫీజులు, విద్యుత్ బిల్లు, ఆహార ఖర్చులు వంటివి ప్రతి నెలా ఉంటాయి. వీటి నుంచి తప్పించుకునేందుకు వీలుండదు. కాకుంటే.. ఇందులో కూడా కొంతవరకు ఖర్చులు తగ్గించుకునే ఉపాయం ఉంది. చిన్న అపార్ట్‌మెంట్‌కి, తక్కువ అద్దె ఉన్న ఇంటికి మారడం వల్ల ఇంటి అద్దె తగ్గించుకోవచ్చు. అలాగే.. అవసరం లేని.. ఫ్యాన్, లైట్లు స్విచ్ ఆఫ్ చేయడం, బయట చిరుతిళ్లు తగ్గించడం వంటి మార్గాల ద్వారా కొంత ఖర్చును తగ్గించుకోవచ్చు.
అందరూ చేసే తప్పు ఇదే. అవసరానికి మించి ఖర్చు పెడుతుంటారు. ఉదాహరణకు.. షాపింగ్ అనుకోండి. అవసరానికి మించి కొంటుంటారు. అవి పనికొస్తాయో లేదో కూడా ఆలోచించరు. మీ ఖర్చు మీకు సంతృప్తినివ్వాలి కానీ ఎదుటివాళ్లకి ఆశ్చర్యాన్ని కలిగించకూడదు. అలా చేస్తే ఇబ్బందులు పడేది మీరే. కొందరు ఉంటారు. వచ్చే సంపాదనను చూసుకోకుండా ఖర్చులు పెట్టేస్తారు. తర్వాత జీతం వచ్చేవరకూ ఇబ్బంది పడుతూనే ఉంటారు. అందుకే ఎంత వస్తోంది.. ఎంత ఖర్చవుతోంది.. లెక్కలు రాసుకోండి. దాన్ని బట్టి ఆచితూచి ఖర్చు చేసుకుంటే ఏ సమస్యా ఉండదు.
ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ ఖర్చులను తగ్గించుకుంటే.. తప్పకుండా పొదుపు, పెట్టుబడులు చేయగలం. అలాకాకుండా ఈ ఆర్థిక ఇబ్బందులకు కారణం పేదరికమే అని తిట్టుకుంటూ పోతే ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడం తప్ప ఇంకేమీ ఒరగదు. కాబట్టి.. పై ఆర్థిక సూత్రాలను పాటించి సమస్యల నుంచి బయటపడే మార్గాలను అన్వేషించండి. ఇవి చదివాక అయినా.. మీ అలవాట్లు మార్చుకోవాలి.