ఇల్లు కట్టాలంటే ఎంత కాదన్నా కనీసం రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షలు అవుతుంది. అంత డబ్బు పేదల దగ్గర ఉంటుందా అంటే ఉండదు. ఏ బ్యాంకులోనో లోన్ తీసుకోవాలి. 20, 30 ఏళ్ళ పాటు లోన్ కడుతూనే ఉండాలి. అప్పుడు తీసుకున్న దానికి మూడు రెట్లు అవుతుంది కట్టే వడ్డీ. ఇలాంటి సమస్యలతో బాధపడే పేదల కోసం ఓ యువకుడు కేవలం రూ. 7.5 లక్షలకే ఇల్లు కట్టి ఇస్తున్నాడు. ముందు కొంత డబ్బు కడితే చాలు. ఆ తర్వాత నెలకు 2500 చొప్పున కట్టుకుంటూ వెళ్ళాలి. వాయిదా డబ్బుకు వడ్డీ కూడా ఉండదు. బ్యాంకు వాళ్ళని బతిమలాడే పని లేదు.
మహా నగరంలో సామాన్యుడి జీవితం ఇసుక రేణువు లాంటిది. ఇక జీతమైతే కంటికి కనిపించని సూక్ష్మజీవి వంటిది. ఎందుకంటే జీతం వచ్చిన రోజే అకౌంట్ లోంచి వెళ్ళిపోతుంది కాబట్టి. ఇంటి అద్దె, గ్యాస్ బిల్లు, ఫోన్ బిల్లు, కరెంటు బిల్లు, పిల్లల స్కూల్ ఫీజులు, నిత్యావసర సరుకులు, పెట్రోల్, ఇతర ఖర్చులు ఇలా అనేక ఖర్చులు పోగా జీతంలో మిగిలేది సున్నా. కొంతమంది అయితే లోటు బడ్జెట్ లో ఉంటారు. దేశంలో ఇలా ఆర్థిక చట్రం కింద పడి నలిగిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. ఇంత దయనీయ స్థితిలో ఉన్న వారికి సొంతిల్లు కట్టుకోవాలన్న కల వస్తుందంటారా? కల మాట పక్కన పెడితే.. ముందు అసలు నిద్ర పడుతుందంటారా? సుఖంగా నిద్రపోయి ఎన్ని రోజులు అయి ఉంటుందో పేద, మధ్యతరగతి వారికి.
అయితే సొంతిల్లు కావాలని కోరుకునేవారి కోసం 7.5 లక్షల రూపాయలకే ఇల్లు అందిస్తున్నాడో యువకుడు. అతని పేరు మిహిర్ మెండా. బెంగళూరు వాసి. చిన్నతనంలో ఆడుకోడానికి వాచ్ మేన్ ఇంటికి వెళ్ళినప్పుడు.. అతని ఇరుకైన ఇంటిని చూసి మిహిర్ చాలా బాధపడ్డాడు. అప్పుడే అలాంటి పేదవారి కోసం ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు. తండ్రి వ్యాపారవేత్త. మిహిర్ అమెరికాలో చదువుకుని వచ్చాడు. చిన్నతనంలో అనుకున్న ఆశయానికి అర్బన్ అప్ స్టార్టప్ రూపంలో పునాది వేశాడు. ఇదొక సామాజిక వ్యాపార సంస్థ. పేదలకు ఇల్లు కట్టుకోవడం కష్టం కాబట్టి ఆ డబ్బును దాతల నుంచి తీసుకుంటారు. అతి తక్కువ ధరకే నాణ్యమైన ఇళ్లను నిర్మిస్తున్నారు.
ఈ ఇళ్ల నిర్మాణంలో నిర్మాణ వ్యర్థాలు, పాత ఇటుకలను ఉపయోగిస్తున్నారు. ఇప్పటికే బెంగళూరులో ఏడు వందల మంది సొంతింటి కల నిజమైంది. ప్రతి ఇల్లు 400 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడుతుంది. దీని ఖరీదు ఏడున్నర లక్షలు అయితే లబ్ధిదారుని కుటుంబం డౌన్ పేమెంట్ కింద రూ. 2 లక్షలు చెల్లించాలి. మిగతా డబ్బు సులభ వాయిదా పద్ధతిలో చెల్లించాల్సి ఉంటుంది. ఈ వాయిదా సొమ్ము ఆ కుటుంబ ఆదాయంలో 10 శాతం ఉంటుంది. ఉదాహరణకు లబ్ధిదారుని జీతం నెలకు రూ. 15 వేల నుంచి రూ. 25 వేలు ఉంటే కనుక నెలకు రూ. 1500 నుంచి రూ. 2500 ఉంటుంది. ఈ వాయిదా సొమ్ముని 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ళు చెల్లించాల్సి ఉంటుంది. వడ్డీ ఉండదు. కేవలం దాతల ద్వారా వచ్చిన డబ్బుతో, 7 లక్షలకే సొంతింటిని పేదవారికి అందిస్తున్నాడు మిహిర్.
అయితే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చాలా కఠినంగా ఉంటుంది. ఎవరికి పడితే వారికి ఇవ్వరు. తగిన అర్హతలు ఉన్నవారికే బ్యాక్ గ్రౌండ్ చెక్ చేసి ఇస్తారు. ఒంటరి మహిళలకు, వికలాంగులకు, వృద్ధులకు ప్రాధాన్యత ఇస్తారు. ఆ తర్వాత మిగతా పేదలకు ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం బెంగళూరులో ఉన్న ఈ ప్రాజెక్ట్ ని త్వరలో హైదరాబాద్ లో కూడా విస్తరించే ఆలోచనలో ఉన్నట్టు మిహిర్ వెల్లడించాడు. ఏది ఏమైనా గానీ ఈ యువకుడు చేస్తున్న మంచి పని వల్ల చాలా మంది పేదలకు అద్దె గోల తప్పుతుంది. 7 లక్షల్లో అందమైన ఇల్లు దొరుకుతుంది.