Interest Rates On Small Saving Schemes: మధ్య తరగతి ప్రజలు అధికంగా ఉండే మనదేశంలో పొదుపు పథకాలలో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య అధికం. సుకన్య సమృద్ధి యోజన, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్.. వంటి పథకాల్లో పొదుపు చేసేవారెందరో. వీటిపై వడ్డీ రేట్లు పెరిగాయా? వారింట పండుగ వాతావరణమే. అలాంటి శుభవార్తను కేంద్ర ప్రభుత్వం వినిపించనుంది. సుకన్య, పీపీఎఫ్, పోస్టాఫీస్ స్కీములుగా పిలిచే చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్లు పెంచనుందని సమాచారం. వచ్చే నెల నుంచి సవరించిన వడ్డీ రేట్లు అమల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. పొదుపు పథకాల వడ్డీ రేట్ల పెంపునకు బలమైన కారణమే ఉంది. 2022, ఏప్రిల్ నుంచి పదేళ్ల బెంచ్‌మార్క్ బాండ్ యీల్డులు నిలకడగా 7 శాతానికి పైగా ఉంటున్నాయి. జూన్, జులై, ఆగస్టు.. ఈ మూడు నెలల సగటు తీసుకుంటే.. 7.31 శాతంగా ఉంది. ఇదే వడ్డీ రేట్ల పెంపునకు బలమైన కారణం.
0.5% పెరగనున్న పీపీఎఫ్:
2016, మార్చి 18న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం పీపీఎఫ్ వడ్డీరేటు వచ్చే త్రైమాసికంలో 7.56 శాతానికి పెరగొచ్చని అంచనా వేసింది. పీపీఎఫ్ వడ్డీరేటు పెంపుకు ఇదే ఒక కారణమని చెప్పొచ్చు. ప్రస్తుతం పీపీఎఫ్ వడ్డీరేటు 7.1 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే.
సుకన్య.. మళ్లీ 8 శాతానికి చేరుకుంటుందా?:
ఆడ పిల్లల కోసం తీసుకొచ్చిన సుకన్య సమృద్ధి యోజన పథకం వడ్డీరేటు ప్రస్తుతం 7.6 శాతంగా ఉంది. ఇది అతి త్వరలోనే 8.3 శాతానికి పెరగనున్నట్లు తెలుస్తోంది. మూడు నెలల ప్రభుత్వ సెక్యూరిటీల యీల్డు + 75 బేసిస్ పాయింట్లను అనుసరించి ఈ పెంపు ఉంటుంది. అలాగే చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్లనూ ఈ నెలాఖర్లో సమీక్షించనున్నారని సమాచారం.
చివరిసారి 2020లో వడ్డీరేట్ల సవరణ:
చివరి సారిగా 2020 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్లను సవరించారు.ఆనాటి నుంచి ఇప్పటివరకు వీటిలో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం ప్రభుత్వ సెక్యూరిటీల యీల్డు ఎక్కువగా పెరగడంతో వడ్డీరేట్లు పెంచనున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి.
అక్టోబర్ నుంచే అమలు:
సెప్టెంబర్ 30న చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీరేట్లపై సమీక్ష జరగనుంది. ఇందులో తీసుకున్న నిర్ణయం ఆధారంగానే 2022-23 ఆర్థిక ఏడాదిలో వడ్డీ రేట్ల అమలు ఉంటుంది. ఒకవేళ ఎలాంటి పెంపు లేకపోతే పాత వడ్డీరేట్లే అమల్లో ఉంటాయి. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియయజేయండి.