హైదరాబాద్ లో ఆ ఫ్లాట్లకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 8 రెట్లు పెరిగిపోయింది.
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వేగంగా అభివృద్ధి చెందుతుంది. ధరలు ఎలా ఉన్నా, ఎంత ఉన్నా గానీ కొనుగోలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మరింత ఎక్కువగా ఫ్లాట్ల అమ్మకాలు జరిగాయి. అవి కూడా విలాసవంతమైన ఫ్లాట్లే. అవును హైదరాబాద్ లోని ఎక్కువగా లగ్జరీ ఫ్లాట్లే అమ్ముడవుతున్నాయి. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో ఎక్కువగా లగ్జరీ ఫ్లాట్లు అమ్ముడవుతున్నాయి. కోటి రూపాయలు, అంతకంటే ఎక్కువ విలువ కలిగిన విలాసవంతమైన ఫ్లాట్ల విక్రయాలు జనవరి-మార్చి 2023 త్రైమాసికంలో ఏకంగా రెండున్నర రెట్లు పెరిగినట్లు సీబీఆర్ఈ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది.
జనవరి నుంచి మార్చి వరకూ మూడు నెలల వ్యవధిలో 4 వేల లగ్జరీ ఫ్లాట్లు అమ్ముడయ్యాయని రిపోర్ట్ పేర్కొంది. గత ఏడాది ఇదే సమయంలో కేవలం 1600 యూనిట్లు మాత్రమే లగ్జరీ ఫ్లాట్లు అమ్ముడయ్యాయని తెలిపింది. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో విలాసవంతమైన ఫ్లాట్స్ అమ్మకాలు మూడు రెట్లు పెరిగాయి. దీంతో 1900 యూనిట్లు సేల్స్ జరిగాయని సీబీఆర్ఈ రీసెర్చ్ రిపోర్ట్ వెల్లడించింది. గత ఏడాది త్రైమాసికంలో ఢిల్లీ-ఎన్సీఆర్ లో 600 విలాసవంతమైన ఫ్లాట్లు అమ్ముడయ్యాయి. ఇక ముంబైలో 1150, చెన్నైలో 250, పుణెలో 150, కోల్కతాలో 100, బెంగళూరులో 50 లగ్జరీ ఫ్లాట్ల అమ్మకాలు జరిగాయని పేర్కొంది.
గత ఏడాది ముంబైలో 800, కోల్కతాలో 50, చెన్నైలో 50, పుణెలో 10 విలాసవంతమైన ఫ్లాట్ల అమ్మకాలు జరిగాయని.. ఈ ఏడాది త్రైమాసికంలో భారీగా పెరిగాయని సీబీఆర్ఈ వెల్లడించింది. హైదరాబాద్ లో అయితే రూ. 4 కోట్ల పైన విలువ కలిగిన విలాసవంతమైన ఫ్లాట్ల అమ్మకాలు ఏకంగా 8 రెట్లు పెరిగిందని తెలిపింది. గత ఏడాది జనవరి-మార్చి వ్యవధిలో కేవలం 50 యూనిట్లు మాత్రమే ఈ లగ్జరీ ఫ్లాట్స్ సేల్స్ జరిగాయని.. ఈ ఏడాది జనవరి-మార్చి మూడు నెలల వ్యవధిలో అమ్మకాలు 450 యూనిట్లకు చేరుకున్నాయని తెలిపింది. కరోనా తర్వాత విలాసవంతమైన ఫ్లాట్లపై జనం ఇష్టం పెంచుకున్నారని, ఈ కారణంగా ఈ లగ్జరీ ఫ్లాట్ విక్రయాలు జోరందుకున్నాయని వివరించింది.