డబ్బు.. డబ్బు.. డబ్బు.. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి నోటా ఈ మంత్రమే. జాబ్ చేసినా, వ్యాపారం చేసినా డబ్బు సంపాదించడమే ప్రధాన లక్షణం. మానవతా విలువలు, ప్రేమానురాగాల కంటే డబ్బులకు ప్రాధాన్యత ఎక్కువైపోయింది. అందుకే ‘ధనం మూలం ఇదం జగత్’ అనే నానుడి వచ్చిందేమో అనిపిస్తోంది. ఇలాంటి రోజుల్లో ఏదేని అనుకోని ఆపద ఎదురైతే ఆదుకునే వారు కరువు. అందులోనూ.. వయస్సు మళ్లాక ఆర్థికసాయం కావాలంటే.. అది జరగని పనే అని చెప్పుకోవాలి. అలాంటి పరిస్థితులలో మీకు ఆసరాగా నిలిచేవి.. పొదుపు పథకాలు, పెన్షన్ పథకాలు మాత్రమే.
వృద్ధాప్యంలో ఏ పని చేయలేరు కావున.. నెల నెల కొంత మొత్తంలో రాబడి ఉందంటే.. జీవితాంతం సుఖంగా జీవించొచ్చు. దేశంలోనే అతిపెద్ద భీమా రంగ సంస్థ ఎల్ఐసీ అందిస్తోన్న ‘న్యూ జీవన్ శాంతి’ పాలసీ అలాంటి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తోంది. ఇందులో ఒక్కసారి పెట్టుబడి పెడితే..జీవితాంతం పెన్షన్ అందుకునే అవకాశముంది. వృద్ధాప్యంలో ఖర్చుల కోసం ఆలోచిస్తుంటే..ఈ పాలసీ మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. మీ వృద్ధాప్యాన్ని సెక్యూర్ చేసేందుకు మంచి పథకమిది.
ఈ పాలసీ ఎల్ఐసీలో ఇంతకుముందున్న జీవన్ పాలసీ వంటిదే. న్యూ జీవన్ శాంతి పాలసీలో రెండు ఆప్షన్లు ఉంటాయి. మొదటిది తక్షణ ఎన్యుటీ కాగా, రెండోది డిఫర్డ్ ఎన్యుటీ. ఇదొక సింగిల్ ప్రీమియం ప్లాన్. తక్షణ ఎన్యుటీలో పాలసీ తీసుకున్న వెంటనే పెన్షన్ సౌలభ్యం ఉంటుంది. ఇక రెండవ డిఫర్డ్ ఎన్యుటీలో పాలసీ తీసుకున్న తరువాత అంటే.. 5,10,15 లేదా 20 ఏళ్ల తరువాత పెన్షన్ సౌలభ్యం ఉంటుంది. 30 ఏళ్ల నుంచి 79 ఏళ్లలోపు వయసు కలిగిన వారు ఈ పాలసీ తీసుకోవచ్చు.
కనీసం రూ.1.5 లక్షలు మొత్తానికి పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. పెట్టుబడి, వయస్సు, డిఫర్మెంట్ పీరియడ్ ప్రకారం పెన్షన్ ఎంతనేది వర్తిస్తుంది. కనీసం నెలకు రూ.1000 పెన్షన్ వస్తుంది. అంతేకాకుండా జీవన్ శాంతి పాలసీలో రుణ సౌకర్యం ఉంటుంది. అలాగే, మధ్యలో వైదొలగాలి అనుకుంటే.. పెన్షన్ ప్రారంభమైన ఒక ఏడాది తరువాత దీన్ని సరెండర్ చేయవచ్చు. అయితే ఒకసారి ఎంచుకున్న ఆప్షన్‌ను తిరిగి మార్చే వీలుండదు. ఈ పాలసీని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కూడా తీసుకునే సౌలభ్యం ఉంది. ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులకు ఇది మంచి పథకమని చెప్పాలి. ఈ పాలసీ గురించి మరిన్ని వివరాలకు.. ఇక్కడ క్లిక్ చేయండి.