బాలికలకు ఆర్థిక భరోసా ఇచ్చేలా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఓ వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది. అద్భుతమైన బెనిఫిట్స్ తో పాలసీని రూపొందించింది. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆ పాలసీని తీసుకుని లబ్ధిపొందొచ్చు.
ఆడపిల్లలు తల్లిదండ్రులకు భారం కాకూడదని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ రకాల పథకాలను ప్రవేశపెట్టి ఆర్థికంగా ఆదుకుంటున్నాయి. ఆడపిల్లల చదువుకోసం స్కాలర్ షిప్స్ అందించడం, ఎడ్యుకేషన్ లోన్లు, వివాహానికి కూడా కొన్నిరాష్ట్ర ప్రభుత్వాలు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాయి. ఈ క్రమంలో ఆడపిల్లలున్న తల్లిదండ్రులకు శుభవార్త అందించింది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా. ఆడపిల్ల చదువుకు, ఎదిగిన తరువాత వివాహ ఖర్చులకు ఆర్థికంగా ఉపయోగపడేలా ఎల్ఐసీలో ఓ పాలసీ అందుబాటులో ఉంది. ఆ పాలసీలో చేరి ఎల్ఐసీ అందించే లాభాలను పొందవచ్చును. ఆ పథకం వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కోట్లాది మంది పాలసీహోల్డర్లతో ఎల్ఐసీ అతిపెద్ద ఇన్సూరెన్స్ సంస్థగా పేరుగాంచిన విషయం తెలిసిందే. కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు నూతన పథకాలను ప్రవేశపెట్టి ఆకర్షిస్తూ ఉంటుంది. దీనిలో భాగంగా ఆడపిల్లలకోసం అద్భుతమైన పథకాన్ని తీసుకొచ్చింది. ఆ పథకమే ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ. ఈ పాలసీలో సేవింగ్ చేయడం ద్వారా బాలిక యొక్క చదువుకు, పెళ్లి ఖర్చులకు ఆర్థికంగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. ఈ పథకంలో తల్లిదండ్రులు ఆడపిల్లల పేరుతో పాలసీ తీసుకోవచ్చు. ఈ పాలసీలో రోజుకు రూ. 75 చెల్లించి 25 సంవత్సరాల తర్వాత రూ. 14 లక్షలు పొందవచ్చును.
అర్హతలు
ఈ పాలసీలో చేరేందుకు బాలిక వయసు ఏడాదిపైబడి ఉండాలి. ఆ బాలిక తల్లిదండ్రుల వయసు 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్నవారు ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీలో చేరొచ్చు. పాలసీని 13 నుంచి 25 ఏళ్ల మెచ్యూరిటీ వ్యవధి వరకు కొనసాగించవచ్చు.
ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ బెనిఫిట్స్
* ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీలో చేరిన పాలసీహోల్డర్స్ నెలకొకసారి, లేదా మూడు నెలలు, లేదా ఆరు నెలలు, లేదా ఏదాదికి ఒకసారి ప్రీమియం చెల్లించే వెసులుబాటు కల్పించింది. ఎల్ఐసీ.
* రోజువారిగా రూ. 75 పెట్టుబడి పెట్టి 25 ఏళ్ల తర్వాత రూ. 14 లక్షలు పొందొచ్చు.
* పాలసీదారుడు సహజంగా మరణిస్తే ఆ కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారాన్ని ఎల్ఐసీ అందిస్తుంది.
* పాలసీదారుడు ఏదైన ప్రమాదం కారణంగా మరణిస్తే రూ. 10 లక్షల పరిహారం వస్తుంది.
* దురదృష్టవశాత్తు పాలసీహోల్డర్ చనిపోతే ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు.
* వరుసగా మూడు సంవత్సరాలు ప్రీమియం చెల్లించి పాలసీ క్రియాశీలకంగా ఉన్నట్లైతే అత్యవసర సమయంలో లోన్ కూడా పొందవచ్చు.
* పాలసీ మెచ్యూరిటీ తరువాత వచ్చే మొత్తంపై ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు.
* ఈ ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ గురించి పూర్తి సమాచారం కోసం దగ్గర్లోని ఎల్ఐసీ ఆపీసుల్లో గాని, ఏజెంట్లను గాని, ఎల్ఐసీ అధికారిక వైబ్ సైట్ ను సంప్రదించి మీకు కావాల్సిన సమాచారం పొందవచ్చును.