దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీకి చెందిన ఏదేని పాలసీ తీసుకోవాలనుకుంటున్నారా..? అయితే ఈ పాలసీపై ఓ లుక్కేయండి. ఈ ఏడాది ఆరంభంలో దీన్ని తీసుకొచ్చారు. పొదుపు+బీమా దీని స్పెషాలిటీ.! కేవలం 10-15 రోజుల్లో దాదాపు 50,000 పాలసీలు అమ్ముడయ్యాయంటే అర్థం చేసుకోవచ్చు ఈ పాలసీని ప్రజలు ఎంతలా విశ్వసిస్తున్నారో.. దీని ప్రయోజనాలు తెలుసుకొని నచ్చితే మీరూ చేరిపోండి..
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఈ ఏడాది ప్రారంభంలో జీవన్ ఆజాద్ పేరుతో సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ వ్యక్తిగతంగాను సేవింగ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌తోపాటు తీసుకోవచ్చును. పొదుపుతో పాటు జీవిత బీమా పొందాలని భావించే వాళ్లకు ఈ పాలసీ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ పాలసీని ప్రజలు విశ్వసించడానికి ముఖ్య కారణం.. ఇది పాలసీదారు కుటుంబానికి రెండు రకాలుగా ప్రయోజనం చేకూర్చడమే.
పాలసీ కాలవ్యవధిలో అకస్మాత్తుగా పాలసీదారుడు మరణిస్తే ఇది వారి కుటుంబానికి ఆర్థికభరోసానిస్తుంది. అలాగే పాలసీ కాలపరిమితి ముగిసిన తర్వాత గ్యారెంటీ లాభం కింద హామీ మొత్తాన్ని చెల్లిస్తుంది. అంటే.. పాలసీదారు కుటుంబానికి ఆర్థిక భద్రత, పొదుపు ప్రయోజనం రెండూ అందుతాయి. కనిష్టంగా 90 రోజుల నుంచి గరిష్టంగా 50 సంవత్సరాల వరకు ఉన్నవారు ఈ పాలసీ తీసుకోవడానికి అర్హులు. అంటే, మూడు నెలల వయస్సున్న పిల్లల పేరు మీద కూడా ఈ పాలసీ తీసుకోవచ్చు.
ఈ పాలసీ కనిష్ట కాల వ్యవధి 15 సంవత్సరాలు, గరిష్ట కాల వ్యవధి 20 సంవత్సరాలు. కనీసం 2 లక్షల రూపాయల నుంచి గరిష్టంగా 5 లక్షల రూపాయల వరకు ఈ పాలసీ ద్వారా హామీ మొత్తాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. మెచ్యూరిటీతో పోలిస్తే 8 సంవత్సరాలు తక్కువగా ఈ మొత్తాన్ని చెలించాల్సిఉంటుంది. అంటే ఉదాహరణకు మీరు 20 ఏళ్ల కాల వ్యవధి ఆప్షన్‌ను ఎంచుకుంటే (20-8), 12 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. మిగిలిన 8 సంవత్సరాలకు కూడా మీరు పాలసీ కవరేజ్‌లో ఉంటారు. ఇక ప్రీమియం విషయానికొస్తే.. పాలసీదారు వెసులుబాటును బట్టి నెలకోసారి లేదా 3 నెలలకు, 6 నెలలకు, ఏడాదికోసారి ప్రీమియం చెల్లించవచ్చు. ఈ పథకం కింద రుణ సౌలభ్యం కూడా ఉంది.
బీమా తీసుకున్న వ్యక్తి పాలసీ మెచ్యూరిటీ తేదీ కంటే ముందే మరణిస్తే, ఈ పథకం కింద డెత్ బెనిఫిట్ లభిస్తుంది. వార్షిక ప్రీమియంతో పోలిస్తే ఏడు రెట్లు సమానంగా ఈ మొత్తం ఉంటుంది. లేదా పాలసీదారు మరణించిన తేదీ వరకు చెల్లించిన మొత్తం ప్రీమియంలో ఇది 105% కంటే తక్కువ కాకుండా ఉంటుంది.
గమనిక: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. సంప్రదాయ బీమా పాలసీల్లో వచ్చే రాబడి కొద్దిగా తక్కువగా కూడా ఉండవచ్చు. కావున ఏదేని పాలసీని కొనే ముందు ఆ పాలసీ డాక్యుమెంట్ పూర్తిగా చదవడం లేదా ఎల్‌ఐసీ సిబ్బంది నుంచి పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది.