మీరు ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఖాతాదారులా..? అయితే మీకో గుడ్ న్యూస్. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్.. డొమెస్టిక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. దీంతో డబ్బులు దాచుకునే వారికి అధిక ప్రయోజనం కలగనుంది.
ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ తమ ఖాతాదారుకు శుభవార్త చెప్పింది. పబ్లిక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. సవరించిన వడ్డీ రేట్లు 7.25 నుంచి 7.75 శాతం మధ్య ఉన్నాయి. దీంతో డబ్బులు దాచుకునే వారికి అధిక ప్రయోజనం కలగనుంది. సంవత్సరం/ 18 నెలలు/ 2 సంవత్సరాలు/ 3 సంవత్సరాలు/ 5 సంవత్సరాల కాలవ్యవధితో డబ్బులు డిపాజిట్ చేయొచ్చు. రూ.20 కోట్ల వరకు లేదా అంతకుమించి కూడా డబ్బులు డిపాజిట్ చేయచ్చు.
ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ క్యుములేటివ్ పబ్లిక్ డిపాజిట్ ఎఫ్‌డీ స్కీంలలో కనీసం రూ.20 వేల వరకు డిపాజిట్ చేయాలి. రూ.20 కోట్ల లోపు నగదు ఉంటే ఒకే రకమైన ఎఫ్‌డీ రేటు ఉంటుంది. ఏడాది కాలవ్యవధి ఉన్న డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీ అందిస్తుండగా, 18 నెలల కాలవ్యవధి ఉన్న డిపాజిట్లపై 7.35 శాతం, రెండు సంవత్సరాల కాలవ్యవధి ఉన్న డిపాజిట్లపై 7.6 శాతం, మూడేళ్ల కాలవ్యవధి ఉన్న డిపాజిట్లపై 7.75 శాతం, ఐదు సంవత్సరాల కాలవ్యవధి ఉన్న డిపాజిట్లపై కూడా 7.75 శాతం వడ్డీ అందిస్తున్నారు. ఇందులో వడ్డీ డబ్బులు ఏటా మీ ఎఫ్‌డీ ఖాతాలో జమ అవుతుంటాయి. మెచ్యూరిటీ గడువు ముగిశాక ఒకేసారి మొత్తం మీ చేతికి అందుతుంది.
నాన్ క్యుములేటివ్ ఆప్షన్ ఎంచుకుంటే.. నెలవారీగా కూడా వడ్డీ మొత్తం పొందొచ్చు. ఈ ఎఫ్‌డీలలో ఏడాది కాలవ్యవధి ఉన్న డిపాజిట్లపై 7 శాతం వడ్డీ అందిస్తుండగా, 18 నెలల కాలవ్యవధి ఉన్నడిపాజిట్లపై 7.1 శాతం, రెండేళ్ల కాలవ్యవధి ఉన్న డిపాజిట్లపై 7.35 శాతం, మూడేళ్ల కాలవ్యవధి ఉన్న డిపాజిట్లపై 7.75 శాతం, ఐదేళ్ల టెన్యూర్ ఉన్న డిపాజిట్లపై 7.5 శాతం వడ్డీ లభిస్తుంది. అయితే ఏడాది పేమెంట్ ఆప్షన్ ఎంచుకుంటే వడ్డీ రేటు మారుతుంది.. గమనించగలరు. ఈ గణాంకాలను బట్టి ప్రభుత్వ లేదా ప్రయివేట్ దిగ్గజ బ్యాంకులైన ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్ సీ, ఐసీఐసీఐ బ్యాంకులతో పోలిస్త్ ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ వస్తుందని చెప్పొచ్చు.