డబ్బు చాలా విచిత్రమైనది. కొందరని చేతుల్లోకి రాకుండా ఏడిపిస్తే.., మరి కొందరని చేతుల్లో నిలవక ఏడిపిస్తుంది. జేబులో డబ్బు ఉంటే మహారాజుల్లా ఖర్చు పెట్టేసే వారు సమాజంలో చాలామందే ఉన్నారు. అలాంటి వారు తమ దగ్గర క్యాష్ ఉంచుకోవడం అంత మంచిది కాదు. ఆ డబ్బును ఇన్వెస్ట్మెంట్స్ వైపు మరల్చాలి. దీని అవరసం ఇప్పుడు తెలియకపోవచ్చు.. అనారోగ్య సమస్యలు ధరిచేరినప్పుడో.. వయసు పైబడి ఆదాయ మార్గాలు కనిపించనప్పుడో.. దీని అవసరం గుర్తొస్తుంది. అలాంటి రోజు రాకుండా ఉండాలంటే.. పొదుపు చేయడం ఉత్తమం. అందులోనూ.. ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్ అందించే పొదుపు పథకాలు మంచి రాబడినిస్తాయి.
పోస్టాఫీస్ అందిస్తోన్న అనేక పొదుపు పథకాల్లో ‘కిసాన్ వికాస్ పత్ర‘ ఒకటి. ఇందులో మనం ఎంత డబ్బైతే పెట్టుబడిగా పెడుతామో.., దానికి డబుల్ అమౌంట్ ని రిటర్న్ గా పొందవచ్చు. ఉదాహరణకు.. కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే.., రూ. రెండు లక్షలు రిటర్న్ పొందవచ్చు. అదే రూ. 2 లక్షలు పెట్టుబడి పెడితే రూ. 4 లక్షలు రిటర్న్ అవుతాయి. కాస్త ఎక్కువ సమయం అయినా పర్లేదు.. నేను ఎదురు చూడగలను అనుకుంటే మాత్రం ఇది మీకు చక్కని ఆప్షన్ గా చెప్పొచ్చు.
ఈ పథకం జీవితకాలం 124 నెలలు.. అంటే 10 సంవత్సరాల 4 నెలల కాలం పడుతుంది. ఇటీవలే ఈ స్కీమ్ వడ్డీరేటుని కూడా పెంచారు. గతంలో 6.9 శాతంగా ఉన్న వడ్డీని 7శాతానికి పెంచారు. ఇలాంటి పథకాలకు ప్రభుత్వం ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షిస్తూ ఉంటుంది. కొన్నిసార్లు వడ్డీని అలాగే ఉంచొచ్చు. కొన్నిసార్లు మాత్రం వడ్డీ రేటుని పెంచుతూ ఉంటాయి. ఈ పథకంలో చాలా వెసులుబాట్లు ఉంటాయి. అందులో ముఖ్యమైనది.. గరిష్ట పరిమితి లేదు. ఎంతైనా పొదుపు చేయవచ్చు. కానీ కనీస పెట్టుబడి రూ.1000 ఉండాలి. అంటే మీరు ఎంత డబ్బునైనా 1000 రూపాయల గుణిజాల్లో పెట్టుబడి పెట్టవచ్చు. వెయ్యి.. రెండు వేలు.. మూడు వేలు.. నాలుగు వేలు ఇలా అన్నమాట. ఎంత మొత్తంలో పెట్టుబడి పెట్టినా.. 124 నెలల్లో (10 సంవత్సరాల 4 నెలలు) రెట్టింపు అవుతుంది. బయట వాళ్ళకి అప్పులు ఇచ్చి, అధిక వడ్డీల కోసం ఆశపడి, అసలుకే ఎసరు తెచ్చుకోవడం కన్నా ఇది చాలా మంచి పథకం. మీ ఆర్ధిక పరిస్థితిని ఆలోచించుకుని వెంటనే ఈ స్కీమ్ లో జాయిన్ అవ్వండి.