టెలికం రంగంలో జియో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఒకరకంగా దేశంలో ఇంటర్నెట్ విప్లవానికి జియో కారణమని నిపుణులు అంటుంటారు. అలాంటి జియో నుంచి ఇప్పుడు ఒక కొత్త ప్రాడక్ట్ రాబోతోంది.
టెలికం, బ్రాడ్ బ్యాండ్ సర్వీసుల్లో జియ్ సంస్థ దూసుకెళ్తోంది. ఈ రంగంలో చివరగా ఎంట్రీ ఇచ్చి అత్యంత వేగంగా అగ్రస్థానానికి చేరుకుంది జియో. దేశవ్యాప్తంగా 5జీ సేవల్ని వాయువేగంతో విస్తరిస్తోందీ కంపెనీ. ఈ సంవత్సరం దీపావళి పండుగ నాటికి దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకూ 5జీ ఇంటర్నెట్ సేవల్ని అందిస్తామని సంస్థ అధినేత ముకేష్ అంబానీ ప్రకటించిన విషయం విదితమే. ఇకపోతే, జియో త్వరలో ఒక కొత్త సర్వీస్‌ను వినియోగదారులకు పరిచయం చేయనుంది. జియో ఎయిర్ ఫైబర్ పేరుతో సరికొత్త వైఫై సర్వీస్‌ను జియో కంపెనీ తీసుకొస్తోంది. గతేడాది జరిగిన రిలయన్స్ ఏజీఎం మీటింగ్‌లో ఈ సేవల గురించి చెప్పినప్పటికీ.. ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారనేది చెప్పలేదు.
తాజాగా ఈ సేవలపై ఆర్ఐఎల్ ప్రెసిడెంట్ కిరణ్ థామస్ కీలక వ్యాఖ్యలు చేశారు. జియో ఎయిర్ ఫైబర్ సేవలను మరికొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తామని కిరణ్ థామస్ తెలిపారు. ఇకపోతే, మామూలుగా బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులను ఫైబర్ ఆప్టికల్ కేబుల్ ద్వారా అందిస్తారు. ఈ సేవలను పొందాలంటే వైర్‌తో పాటు మోడెమ్‌ను కూడా వినియోగించాలి. జియో అందిస్తున్న గిగా ఫైబర్ సేవలు కూడా అచ్చం ఇదే తరహాలో పనిచేస్తున్నాయి. అయితే జియో ఎయిర్ ఫైబర్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం దీనికి కేబుల్స్‌తో పనిలేదు. ఇది ఒక సింగిల్ డివైజ్. సమీపంలోని జియో టవర్స్ నుంచి వీటికి సిగ్నల్స్ అందుతాయి.
సాధారణ బ్రాండ్‌బ్యాండ్ తరహాలోనే దీని ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్ సేవల్ని పొందొచ్చు. డివైజ్ ఉన్న చోటు నుంచి వెయ్యి చదరపు అడుగుల దూరం వరకు యూజర్లు వైఫై సేవల్ని పొందొచ్చు. ఈ డివైజ్‌ను ఇళ్లతో పాటు ఆఫీసుల్లో ఇంకా ఎక్కడికైనా తీసుకెళ్లి వాడుకోవచ్చు. మరో విషయం ఏంటంటే.. సాధారణ రౌటర్ ఏర్పాటుకు అవసరమైనట్లుగా ఎయిర్ ఫైబర్ ఇన్స్టాలేషన్ కోసం టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అవసరం ఉండదు. ఇది ప్లగ్ అండ్ ప్లే తరహాలో పనిచేస్తుంది. జియో ఎయిర్ ఫైబర్ ద్వారా క్రికెట్ మ్యాచ్‌లకు మల్టిపుల్ వీడియో స్ట్రీమ్స్‌ను పొందొచ్చు. ఒకేసారి పలు కెమెరా యాంగిల్స్‌లో అల్ట్రా హై డెఫినిషన్తో లైవ్ క్రికెట్ చూడొచ్చని జియో సంస్థ చెబుతోంది.