గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం ధర మళ్ళీ పుంజుకుంది. భారీగా పెరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో బంగారం కొంటే లాభమా? నష్టమా? మార్కెట్ నిపుణులు ఏం చెబుతున్నారు?
ప్రస్తుతం బంగారం, వెండి ధరలు చుక్కలు తాకేలా ఉన్నాయి. రెండు రోజులు కాస్త తగ్గి మళ్ళీ అమాంతం పెరిగిపోయాయి. గురు, శుక్రవారం రోజుల్లో మళ్ళీ ధరలు పెరిగాయి. గత కొన్ని రోజులతో పోలిస్తే బంగారం ఆల్ టైమ్ అత్యధిక ధరను పలికింది. బంగారం ధర రూ. 60 వేలకు చేరుకోవడంతో ఈ ధర మరి కొన్ని నెలల పాటు కొనసాగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 2006 మే 5న పది గ్రాముల బంగారం ధర రూ. 10 వేలు ఉంటే, 2010 నవంబర్ 6న రూ. 20 వేలు అయ్యింది. 2012 జూన్ 1న అదే బంగారం ధర రూ. 30 వేలు అయ్యింది. 2020 జనవరి 3న రూ. 40 వేలు పలికితే.. 2020 జూలై 22న రూ. 50 వేలు పలికింది. 2020 మార్చి 20న రూ. 60 వేలు అయ్యింది.
ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 60 వేలు ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం అయితే రూ. 55 వేలు ఉంది. నిన్న 24 క్యారెట్ల బంగారం మీద నిన్న రూ. 650 పెరగగా ఇవాళ రూ. 200 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం అయితే నిన్న రూ. 600 పెరగగా ఇవాళ రూ. 200 పెరిగింది. వెండి ధరలు కూడా అలానే ఉన్నాయి. నిన్న ఒక్కరోజే కిలో వెండి ధర రూ. 1400 పెరగగా.. ఇవాళ మళ్ళీ రూ. 300 పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 75,700 ఉంది. అయితే మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో ఏప్రిల్ ఫ్యూచర్స్.. బంగారం 10 గ్రాములకు రూ. 225 లేదా 0.38 శాతం తగ్గి రూ. 59,340 వద్ద ఉంటుందని అంచనా వేసింది. అలానే వెండి మే నెలలో కిలో రూ. 7 తగ్గి రూ. 70,205 వద్దకు చేరుతుందని అంచనా వేసింది.
మరోవైపు అంతర్జాతీయంగా పసిడి ధరలు మళ్ళీ పెరిగాయి. ప్రస్తుతం 5.30 గంటలకు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ ధర రూ. 1995 డాలర్లు ఉంది. 3.99 శాతం పెరిగింది. వెండి ధర ఔన్సు రూ. 23.17 డాలర్లు ఉంది. 0.12 శాతం పెరిగింది. ఇవాళ బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. బంగారం కొనాలనుకునేవారు లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ కింద పరిగణించాలని చెబుతున్నారు. కొని వెంటనే అమ్మడం వల్ల లాభం ఉండదని.. కొనడానికి, అమ్మడానికి మధ్య 6 నెలల గ్యాప్ ఉంటే మంచిదని సూచిస్తున్నారు. ఏడాది చివర్లో బంగారం ధరలో పెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే బంగారం ధరల్లో భారీ మార్పులు ఉండవని అంటున్నారు. ఏప్రిల్ నెలలో యావరేజ్ గా రూ. 60,700 ఉంటే రూ. 61,295 సమీపంలో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
మే నెలలో యావరేజ్ గా రూ. 60,153 ఉంటే రూ. 59,456 సమీపంలో బంగారం ధర ఉంటుందని అంటున్నారు. అయితే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పది గ్రాముల బంగారం ధర యావరేజ్ గా, క్లోజ్ గా రూ. 64 వేల పై చిలుకు ఉంది. నవంబర్ లో యావరేజ్ ధర రూ. 63 వేలు, క్లోజ్ ధర రూ. 62 వేలు.. డిసెంబర్ లో యావరేజ్ ధర, క్లోజ్ ధర రూ. 61 వేలు గా ఉంది. ప్రస్తుతం అయితే పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 60 వేలు ఉంది. ఇప్పుడు కొని పెట్టుకుంటే.. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో పది గ్రాముల వద్ద అదనంగా 4 వేలకు పైనే పెరుగుతుంది. కాబట్టి బంగారం కొనడానికి ఇదే తగిన సమయమా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ప్రస్తుతం బంగారం కొనాలా? లేక ఎదురుచూడాలా? అంటే కొనచ్చు. అమ్మాలి అనుకుంటే మాత్రం కొన్ని నెలలు ఎదురుచూడాలని చెబుతున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.