బంగారం అంటే ఇష్టపడని భారతీయులు చాలా అరుదు. జీవితంలో ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయాలని ఆశ పడతారు. కానీ ఇప్పుడేమో బంగారం ధర చుక్కలను తాకుతుంది. మరి ఏం చేయాలి.. బంగారం కొనాలంటే ఎలా.. దీనికి సమాధానంగా మంత్లీ గోల్డ్ స్కీమ్స్ వచ్చాయి. మరి వీటిల్లో చేరి బంగారం కొనడం వల్ల లాభమా.. నష్టమా.. ఆ వివరాలు..
బంగారం.. ఈ లోహం మీద మనకు ఎంత అభిమానమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆభరణంగా మాత్రమే కాక.. అవసరానికి అక్కరకు వచ్చే నిధిగా భావిస్తారు. అత్యవసర వేళ చేతిలో రూపాయి లేకపోయినా సరే.. ఇంట్లో కాస్త బంగారం ఉంటే చాలు.. ఎలాగోలా ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. బంగారం మీద మన మోజుతో పాటు.. దాని ధర కూడా అలానే పెరుగుతోంది. ఐదేళ్ల కాలంలో బంగారం ధర రెట్టింపు అయ్యింది. ఈ పరిస్థితి గమనించే చాలా మంది బంగారాన్ని భద్రత కలిగిన పెట్టుబడిగా భావిస్తున్నారు. ఇక వివాహాలు, పండుగలు, శుభకార్యాల వేళ బంగారం కొనుగోలు చేయడం తప్పనిసరి. అయితే పసిడి ధర చుక్కలను తాకుతోంది. తులం ధర ఏకంగా 60 వేల రూపాయలకు పైగా పెరిగింది. ధనవంతులు, ఎగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు అయితే.. ఎప్పుడు కావాలంటే అప్పుడు బంగారం కొనుగోలు చేస్తారు. ధరల గురించి వారికి పెద్దగా పట్టింపు ఉండదు.
మరి మిగతా వారి పరిస్థితి.. పేద, మధ్య తరగతి వారి దగ్గర ఏడాది మొత్తం మీద ఓ యాభై వేల రూపాయల పొదుపు ఉంటే అదే గగనం. ఒకే సారి వారి చేతిలో అంత భారీ మొత్తం ఉంటుందా అంటే లేదు. మరి వారు బంగారం కొనుగోలు చేయాలంటే.. అప్పు చేయాల్సిందే. మొబైల్స్, వాహనాలు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు లభించినట్లు.. బంగారం కూడా ఈఎంఐలలో లభిస్తే.. మన దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే వాటి జాబితాలో బంగారం ప్రథమ స్థానంలో ఉంటుంది. కానీ ఎంత పెద్ద పేరు మోసిన జ్యువెలరీ స్టోర్ కూడా అంత సాహసం చేయదు. కస్టర్లను నమ్మి.. ముందుగానే బంగారం ఇచ్చి.. తర్వాత డబ్బులు కట్టించుకోవడం అంటే నిజంగానే సాహసమే.
మరి పేద, మధ్య తరగతి వారు బంగారం కొనాలంటే.. ఏం చేయాలి.. ఇందుకు జ్యువెలరీ స్టోర్స్ ఒక సమాధానం కనుక్కున్నాయి. జనాలకు ముందుగానే బంగారం అమ్మి.. డబ్బులు కట్టించుకోవడం అంటే రిస్క్.. దానికి రివర్స్‌లో అంటే.. ముందుగా జనాల దగ్గర నుంచి నెల నెల కొంత డబ్బులు తీసుకుని.. ఆఖర్లో వారు చెల్లించిన మొత్తానికి బంగారం అమ్మితే సరి. కస్టమర్ నష్టపోడు.. షాపు వాళ్లు బాగుంటారు. ఈ ఆలోచనను ఆచరణలో పెడుతూ.. మంత్లీ గోల్డ్ స్కీమ్‌ను తీసుకువచ్చాయి జ్యువెలరీ స్టోర్‌లు.
ప్రసుత్తం ప్రముఖ జ్యువెలరీ స్టోర్స్ అన్ని ఈ మంత్లీ గోల్డ్ చిట్ స్కీమ్‌ను అందుబాటులోకి తెచ్చాయి. జనాలకు కూడా ఈ స్కీమ్ బాగానే నచ్చింది. చేతిలో డబ్బు ఉంటే ఊరికే ఖర్చవుతుంది. దాని బదులు ప్రతి నెల ఎంతో కొంత మొత్తం పొదుపు చేసి.. ఆఖర్లో బంగారం కొనుగోలు చేయడం ఉత్తమం అని భావిస్తున్నారు. పైగా ఈ స్కీమ్ ద్వారా బంగారం కొంటే వేస్టేజ్, మేకింగ్ ఛార్జీలు, తరుగు వంటివి ఏం ఉండవని.. చెబుతున్నారు. దాంతో చాలా మంది.. ఈ స్కీమ్‌లో చేరి.. ఏడాది పాటు డబ్బులు చెల్లించి చివర్లో తాము పొదుపు చేసిన మొత్తానికి సరిపడా బంగారం కొనుగోలు చేస్తున్నారు. మరి ఈ స్కీమ్‌తో నిజంగానే జనాలకు లాభం ఉందా.. ఇందులో ఏదైనా మోసం ఉందా.. మరి ఈ స్కీమ్‌ల గురించి నిపుణులు ఏం చేబుతున్నారు అంటే..
నిజానికి బంగారం షాపులు వాళ్లు ఇలా నెలా నెలా డబ్బు కలెక్ట్ చేయడం అనేది చట్టరీత్యా నేరం అంటున్నారు నిపుణులు. ఇలా నెల నెలా డబ్బులు కలెక్ట్ చేయడానికి జ్యువెలరీ స్టోర్స్‌కు చట్టపరంగా ఎలాంటి అనుమతి లేదు. ఈ పథకంలోచేరితే.. మీరు చెల్లించే డబ్బుపై వడ్డీ ఇవ్వరు. సుమారు 12 నెలల పాటు డబ్బులు చెల్లిస్తే.. ఆఖర్లో మీరు బంగారం కొనాలనుకున్న రోజున ఎంత ధర ఉంటే.. ఆ ధరకే మీకు బంగారం అమ్ముతారు. ఫలితంగా మీకు పెద్దగా లాభం లేదని చెప్పవచ్చు. మరి బంగారం కొనాలంటే ఏం చేయాలి..
మీరు ఇలా మంత్లీ స్కీమ్‌లో చేరి.. నెల నెలా డబ్బులు పొదుపు చేసి.. బంగారం కొనే బదులు.. ఆ మొత్తాన్ని రికరింగ్ డిపాజిట్లలో పొదుపు చేస్తే.. మీరు బ్యాంక్ నుంచి వడ్డీని కూడా పొందవచ్చు. అలా ఏడాది చివర్లో వడ్డీతో కలిపి వచ్చే నగదు ద్వారా బంగారం కొంటే మేలు అంటున్నారు నిపుణులు. పైగా ఇలాంటి స్కీమ్‌లకు సంబంధించి అన్ని నగల దుకాణాలను నమ్మలేం. వీటికి చట్టరీత్యా అనుమతి లేదు కనుక.. మోసపోతే.. డబ్బు వెనక్కి వచ్చే అవకాశం లేదు. కనుక ఇలాంటి చిట్స్‌లో చేరి బంగారం కొనాలకునే వారు ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అంటున్నారు మార్కెట్ నిపుణులు. మరి ఈ మంత్లీ గోల్డ్ స్కీమ్‌తో ప్రయోజనాలు ఉన్నాయని మీరు భావిస్తున్నారా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.