ఆరేళ్ల క్రితం నవంబర్ 8, 2016న ప్రధాని నరేంద్ర మోదీ.. దేశంలో రూ. 500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయంతో.. ఆ రోజు అర్ధరాత్రి నుంచి అప్పటివరకు చలామణిలో ఉన్న 84.5 శాతం కరెన్సీ రద్దయింది. ఈ నిర్ణయం వల్ల దేశంలో రూ. 3 నుంచి 4 లక్షల కోట్ల నల్లధనం మాయమైపోగలదని విశ్వసించిన మోదీ ప్రభుత్వం, ప్రజాభిప్రాయ సేకరణ లేకుండానే నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంది. అయితే నల్లధనం వ్యవస్థనుంచి ఏ మాత్రం తొలగిపోలేదు సరికదా దీని కారణంగా దేశంలో తీవ్ర ఆర్థిక సంక్షోభం ఏర్పడింది. సామాన్య ప్రజలు నోట్ల మార్పిడి కోసం నానా తిప్పలు పడ్డారు.
మోదీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. మరుసటి రోజే.. ప్రజలు తమ వద్ద ఉన్న రూ. 500, రూ.1000 నోట్లను మార్చుకోవాలంటూ బ్యాంకులు సూచించాయి. అయితే ఆ సమయంలో చాలా మంది నోట్లను మార్చుకున్నప్పటికీ.. మరి కొంత మంది వద్ద మాత్రం అవి మిగిలిపోయాయి. అప్పట్లో ఈ నోట్ల రద్దు నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో అనేక వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఇప్పటికీ దీనిపై విచారణ జరుగుతోంది. తాజాగా శుక్రవారం, పాత నోట్లను మార్చుకోవాలనుకుంటున్న వ్యక్తుల వ్యాజ్యాలపై విచారణ జరిగిపిన ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం(ఎస్. అబ్దుల్ నజీర్, బి.ఆర్. గవాయి, ఎ.ఎస్. బోపన్న, V. రామసుబ్రమణియన్, B.V. నాగరత్న) ఆర్బీఐకి కీలక సూచన చేసింది.
“పెద్ద నోట్ల రద్దు సమయంలో కరెన్సీ నోట్లను మార్చుకోలేక పోయిన వారికి పరిష్కార మార్గాన్ని ఆలోచించగలరా అంటూ ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం.. రిజర్వు బ్యాంకును కోరింది. నిజాయితీగా, సరైన కారణాలతో అప్పట్లో డబ్బు డిపాజిట్ చేయలేకపోయిన వారి కేసుల విషయంలో పరిష్కారాన్ని అన్వేషిచాలని సూచించింది”. కోమాలో ఉన్న ఒక మహిళ తన వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకోలేకపోవడంపై ఈ వ్యాజ్యం దాఖలైంది. ఈ విషయంపై ఆర్బీఐ తరుపున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి బదులిస్తూ.. ‘నోట్ల రద్దు తేదీని పొడిగించలేమని తేల్చి చెప్పారు. అయితే రిజర్వు బ్యాంక్ కొన్ని ప్రత్యేక కేసుల విషయంలో షరతులకు లోబడి వీటిని పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు’.
అటార్నీ జనరల్ వ్యాఖ్యలపై స్పందించిన జస్టిస్ బి.ఆర్. గవాయి.. ‘స్పెసిఫైడ్ బ్యాంక్ నోట్స్ చట్టం 2017లోని సెక్షన్ 4లోని సబ్-సెక్షన్ (2) కింద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు అధికారం ఉందని, సెంట్రల్ బ్యాంక్ సంతృప్తి చెందితే దానిని తప్పనిసరిగా అమలుచేయొచ్చని గుర్తుచేశారు. నిజమైన కేసులలో దావాలను తిరస్కరించడం అనేది అధికారాన్ని ఏకపక్షంగా ఉపయోగించడం అవుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలో సుప్రీం కోర్టు.. ఇప్పటికీ తమవద్ద పాత నోట్లను కలిగి ఉన్న వారు వాటిని జాగ్రత్తగా ఉంచుకోవాలని వెల్లడించింది. గ్రేస్ పిరియడ్ లోపు రద్దైన నోట్లను మార్చులేకపోయిన వారి విషయంలో ఆర్బీఐ సొంత విచక్షణతో మరోసారి పరిశీలించాలని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసు తదుపరి విచారణ డిసెంబర్ 5కు వాయిదా వేయటం జరిగింది.