ఇల్లు కట్టుకోవాలని చాలా మంది అనుకుంటారు. కానీ కొత్త ఇల్లు కట్టుకోవాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నది. అదే పాత ఇల్లు అయితే కొంచెం భరించగలిగే బడ్జెట్ లో వస్తుందని ఆలోచిస్తారు. అయితే కొనాలా? వద్దా? అన్న సందేహంలో ఉంటారు. మరి పాత ఇల్లు కొనడం లాభమా? నష్టమా?
ఇల్లు కొనడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన అంశం. ఇల్లు కట్టి చూడు, పెళ్లికి చేసి చూడు అని అంటారు. అంటే ఇల్లు కట్టడం, పెళ్లికి చేయడం ఎంత కష్టమో ఆలోచించండి. అయితే సింపుల్ గా పెళ్లి చేసేవారు ఉంటారు, సెకండ్ హ్యాండ్ ఇల్లు కొనుక్కునేవారు కూడా ఉంటారు. అయితే సెకండ్ హ్యాండ్ లో అపార్ట్మెంట్ లేదా ఇల్లు కొనడం మంచిదేనా? దీని వల్ల లాభమా? నష్టమా? కొనే ముందు కొనాలా? వద్దా? అన్న కన్ఫ్యూజన్ దగ్గరే ఆగిపోతారు. అయితే ప్రైమరీ మార్కెట్లో కొన్ని వందల ఆప్షన్స్ ఉన్నాయని, రీసేల్ లేదా సెకండరీ మార్కెట్ అనే ఆప్షన్ ఒకటుందని మీరు మరువద్దు. ప్రైమరీ రియల్ ఎస్టేట్ మార్కెట్ పతనమైన సమయంలో డిస్కౌంట్లు పొందడానికి రీసేల్ మార్కెట్ అనేది మంచి ఆప్షన్. వెంటనే గృహప్రవేశం చేయడానికి, పేమెంట్ చేసుకోవడానికి అనువుగా ఉంటాయి.
రీసేల్ అపార్ట్మెంట్ లేదా సెకండ్ హ్యాండ్ ఇంటిని కొనే ముందు ఫ్లోర్ ప్లాన్, సౌకర్యాలు, బిల్ట్ ఏరియా మాత్రమే కాకుండా లొకేషన్, ఇంటీరియర్, రిటర్న్స్, పెట్టుబడులు వంటి అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.
కొత్త ఇళ్లతో పోలిస్తే సెకండ్ హ్యాండ్ లేదా రీసేల్ హౌజ్ లు తక్కువ ధరకు లభిస్తాయి. ఒకవేళ ఇల్లు ఒక వ్యక్తికి సంబంధించిన ఆస్తి అయితే కనుక ల్యాండ్ ధరతో ఇంటి ధర లింక్ అయి ఉంటుంది. అయితే మీరు బిల్డింగ్ వయసును బట్టి, ఇంటీరియర్స్ బట్టి బేరం ఆడి తగ్గించమని అడగొచ్చు.
రీసేల్ హౌజ్ లు అనేవి పాత ఇళ్ళు అయినా అప్పట్లో దొరికిన స్థలం మీద ఆ సమయంలో సిటీలో ఇళ్లను కట్టారు. రీసేల్ ఇల్లు అంటే ఆల్రెడీ ఆ ఏరియాలో అభివృద్ధి అనేది ఉంటుంది. చుట్టుపక్కల ఇళ్ళు కూడా ఉంటాయి. కాబట్టి ఆ ఇంట్లో నివసించడానికి అనుకూలంగా ఉంటుంది.
పాత ఇళ్ళు అంటే అప్పట్లో విశాలమైన ప్రదేశంలో కట్టి ఉంటారు. ఇప్పట్లో లాగా ఇరుకిరుకుగా కట్టేయకుండా విశాలంగా కట్టి ఉంటారు.
ఒకవేళ మీరు కన్స్ట్రక్షన్ లో ఉన్న ఇల్లు కొన్నారనుకోండి అద్దె, ఈఎంఐ రెండూ ఏకకాలంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇల్లు పూర్తయ్యేవరకూ అసలు, వడ్డీ చెల్లించాలి. అదే రీసేల్ ఇల్లు కొంటే అద్దె కట్టే డబ్బులతోనే సొంతం చేసుకోవచ్చు. వెంటనే గృహ ప్రవేశం చేయచ్చు. అద్దె డబ్బులు ఆదా అవుతాయి. అలానే అదనపు ఈఎంఐ భారం కూడా ఆదా అవుతుంది.
పాత ఇల్లు కొనడం వల్ల అప్పట్లో అమరికలు, కనీస సౌకర్యాలను యజమాని పెట్టే ఉంటారు. గ్యాస్, కరెంట్, మెయింటెనెన్స్, సెక్యూరిటీ, వాటర్ సదుపాయం వంటివి ఉంటాయి. మళ్ళీ మళ్ళీ వీటిని పెట్టుకోవాలి అనే విధంగా ఉండదు. కొన్ని రిపేర్లు ఉంటాయి అంతే.
వెంటనే పాత ఇంటికి వెళ్లడం వల్ల హోమ్ లోన్ లో మొదటి వాయిదా మీద పన్ను ప్రయోజనం ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని 80సి కింద ప్రిన్సిపల్ ఈఎంఐ మీద రూ. లక్ష వరకూ పన్ను మినహాయింపు ఉంటుంది. 24బి కింద హోమ్ లోన్ వడ్డీ మీద రూ. 5 లక్షల వరకూ పన్ను మినహాయింపు ఉంటుంది.
పాత ఇల్లు కొనే ముందు ఇల్లు కట్టి ఎన్నేళ్లు అయ్యిందో చూసుకోవాలి. ఒకవేళ మీరు కొనబోయే ఇల్లు కట్టి ఐదేళ్లు లేదా పదేళ్లు పైన అయితే అయి ఉండకూడదు. పదేళ్లు కంటే పాత ఇల్లు అయితే పెట్టుబడి పెట్టడం మంచిది కాదు.
పాత ఇల్లు కొనడం వల్ల గత యజమాని అభిరుచికి తగ్గట్టు ఇంటి నిర్మాణం జరిగి ఉంటుంది. అవన్నీ నచ్చకపోవచ్చు. ఇది కొన్నిసార్లు కలవరపెడుతుంది.
పాత ఇంటిని కొనే ముందు ఇంటికి సంబంధించి అన్ని బిల్స్ యజమాని చెల్లించాడో లేదో నిర్ధారించుకోవాలి. మెయింటెనెన్స్ కి సంబంధించి బిల్లులు పెండింగ్ లో ఉన్నా, సొసైటీలో మెంబర్ షిప్ కి సంబంధించి బిల్ వంటివి కొత్త యజమాని మీద పడే అవకాశం ఉంటుంది.
పాత ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు రిపేర్ కాస్ట్ ఎక్కువవుతుందా లేదా అనేది చూసుకోవాలి. రిపేర్ కి తక్కువ ఆస్కారం ఉన్న ఇల్లు కొనుక్కుంటే మంచిదే. కానీ కొన్న తర్వాత రిపేర్ల ఖర్చులు ఎక్కువైతే కనుక నష్టమనే చెప్పాలి. పెయింటింగ్ కి, ఫ్లోరింగ్ కి, వుడ్ వర్క్ కి, ప్లంబింగ్ వంటి రిపేర్లకు ఖర్చు ఎక్కువవుతుంది.
కొత్త ఇంటితో పోలిస్తే పాత ఇంటికి ఇన్సూరెన్స్ అనేది తక్కువ ఉంటుంది. కొత్త ఇంటికి ఉన్నన్ని ప్రయోజనాలు పాత ఇళ్లకు ఉండవు. బిల్డింగ్ వయసును బట్టి ఇన్సూరెన్స్ ని నిర్ణయిస్తాయి. కొన్ని సందర్భాల్లో సహజమైన విపత్తు, దొంగతనం వంటివి జరిగితే ఇన్సూరెన్స్ కంపెనీలు తక్కువ బీమా మాత్రమే ఇస్తాయి.
పాత ఇంటిని కొనడానికి గృహ ఋణం తీసుకుంటే కనుక మీరు ఆ ఇంటి విలువలో 20 శాతాన్ని డౌన్ పేమెంట్ గా చెల్లించాల్సి ఉంటుంది. ఇది బిల్డర్లు ఛార్జ్ చేసే దాని కంటే అధికం.
మరీ పదేళ్లు పాత ఇల్లు కాకుండా, రిపేర్ ఖర్చులు ఎక్కువ కాకుండా, అన్ని రకాలుగా సదుపాయాలు, సౌకర్యాలు ఉన్న ఇల్లు కొనుక్కోవడం మంచిదే. అలానే చుట్టుపక్కల ఏరియా డెవలప్ అయ్యిందో లేదో కూడా చూసుకోవాలి. మార్కెట్ పరంగా, ఆఫీస్ కి ట్రావెలింగ్ పరంగా అనుకూలంగా ఉందో లేదో చూసుకోవాలి. అన్ని రకాలుగా బాగున్నాయనిపిస్తే పాత ఇల్లు లేదా పాత ఫ్లాట్ కొనుక్కోవచ్చు.