ఎలక్ట్రిక్ వాహనం కొనాలని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోకుండా ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేస్తే బాధపడక తప్పదు.
కాలుష్యం ఉండదు, పెట్రోల్ భారం ఉండదు కాబట్టి ఎలక్ట్రిక్ వాహనం కొనడం మంచిదే అని అనుకుంటున్నారా? స్వార్థంతో పాటు సామాజిక బాధ్యత కూడా ఉందని మీకు మీరు నచ్చజెప్పుకుంటున్నారా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోకపోతే నష్టపోతారు. రొటీన్ గా బ్యాటరీలు పేలిపోతాయి, ధర ఎక్కువ, రేంజ్ తక్కువ అని కాకుండా ఒకే ఒక్క కారణం తెలిస్తే అసలు ఎలక్ట్రిక్ వాహనం కొనడం దండగ అని అనుకుంటారు. అవును నిజం.. బ్యాటరీలు పేలిపోతాయని ఎంతమంది భయపెట్టినా అన్ని బండ్లకు అలా జరగవు కదా.. పేలుడు శాతం కూడా తక్కువే కదా అని మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవచ్చు. రేంజ్ ని బట్టి రేట్లు వాచిపోతున్నా పెట్రోల్ భారం తగ్గుతుంది కాబట్టి సర్దుకుపోదామనుకుంటారు.
బ్యాటరీ బయటకు తీసి ఇంట్లో ఓ నాలుగు గంటలు ఛార్జింగ్ పెడితే తక్కువ కరెంటు బిల్లు అవుతుంది కదా, అదే పెట్రోల్ అయితే ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది కదా.. కాబట్టి ఎలక్ట్రిక్ వాహనమే బెస్టు అని అనుకుంటారు. బ్యాటరీ మీద వారంటీ ఎలాగూ వస్తుంది కదా అని అనుకుంటారు. సరే ఈ విషయాలు పక్కన పెడితే ఎందుకు కొనకూడదు అనడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే.. అత్యవసర పరిస్థితుల్లో మీకు మీ బండి ఉపయోగపడదు. ఉదాహరణకు మీరు ఒక ‘ఏ’ అనే కంపెనీ ఎలక్ట్రిక్ బండి కొనుక్కున్నారు. దాని ఖరీదు లక్ష రూపాయలు. ఆ లక్షకు తగ్గట్టు దాని రేంజ్ 85 కి.మీ. వస్తుందని చెప్తారు. నిజానికి బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అయ్యాక డిజిటల్ మేటర్ లో చూపించేది 70 కి.మీ. మాత్రమే.
రన్నింగ్ లో ఉన్నప్పుడు మిగతా 15 కి.మీ. యాడ్ అవుతాయని కంపెనీ వారు చెబుతారు. అది నిజమో కాదో అనేది దేవుడికి తెలియాలి. పోనీ 70 కి.మీ. తోనే సర్దుకుపోవచ్చు అని అనుకున్నా.. ఎకో మోడ్ లో చూపించిన 70 కి.మీ, పవర్ మోడ్ లో 55 కి.మీ అవుతుంది. ఇక్కడ మళ్ళీ మనకి 15 కి.మీ. లాస్. కంపెనీ క్లెయిమ్ చేసిన రేంజ్ 80 కి.మీ. అయితే మొత్తం ఇక్కడ 30 కి.మీ. లాస్ అవుతున్నాము. సరే క్లియర్ గా తెలుసుకోకుండా బండి కొనడం తప్పే అని సర్ది చెప్పుకుంటారు. ఇప్పుడు మీరు ఎకో మోడ్ లో ప్రయాణం చేస్తే 70 కి.మీ. రేంజ్ వస్తుంది కాబట్టి పర్లేదు అని అనుకుంటారు. కానీ ఈ హడావుడి హంగామా సిటీలో ఎద్దుల బండిలా స్లోగా వెళ్తానంటే కుదరదు. చాలా వెనకబడి పోతారు.
ఎకో మోడ్ లో టాప్ స్పీడ్ కనీసం 50 కి.మీ. అయినా ఉంటే నలుగురితో నారాయణ అనుకుంటూ వెళ్లొచ్చు. ఏ నలభయ్యో ఉంటే.. వెనక వచ్చే భయ్యా గాళ్ళతో అడ్డమైన మాటలు పడాలి. వద్దు.. నాకీ బతుకొద్దు అని పవర్ మోడ్ లో వెళ్తానంటే.. 55 కి.మీ. రేంజ్ మాత్రమే వస్తుంది. అది కూడా పూర్తిగా వస్తాదని గ్యారంటీ లేదు. బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతున్న కొద్దీ వేగం అనేది తగ్గిపోతుంది. ఈ మాత్రం దానికి పవర్ మోడ్ అన్న పేరెందుకో అనేది అర్ధం కాదు. మీరు ఉండే ఇంటికి, ఆఫీసుకి 10 కి.మీ. దూరం అనుకుంటే రానూ, పోనూ పవర్ మోడ్ లో 20 కి.మీ. అవ్వాలి. కానీ మన కర్మకి 25 కి.మీ. అయిపోతుంది. మరుసటి రోజు ఇదే పరిస్థితి. అంటే లక్ష రూపీస్ పెట్టుకుని బండి కొని బ్యాటరీ 4 గంటలు ఛార్జింగ్ పెట్టుకుని బయటకు తీసి పవర్ మోడ్ లో వెళ్తే రెండు సార్లు ఇంటి నుంచి ఆఫీసుకి, ఆఫీసు నుంచి ఇంటికి రావడానికి అవుతుంది.
ఇక మళ్ళీ ఏ కూరగాయల మార్కెట్ కో వెళ్ళాలి అనుకుంటే ఛార్జింగ్ పెట్టి ఏడవాలి. ఛార్జింగ్ అయ్యే వరకూ ఆగాలి. లేదా ఇంకొకరి బండి మీద వెళ్ళాలి. లేదా ఇంకో బైక్ కొనుక్కోవాలి. అవసరమా అని అనిపిస్తుంది. సరే కాలుష్యం లేని సమాజాన్ని నిర్మించడం కోసం సామాజిక బాధ్యతగా, పెట్రోల్ భారం తగ్గించుకోవాలన్న స్వార్ధంతో ఇవన్నీ భరిస్తాను అంటే ఓకే. కానీ కరెక్ట్ గా ఛార్జింగ్ అయిపోయే సమయానికి ఏ హాస్పిటల్ కో వెళ్లాల్సి వస్తే.. ఇంట్లో ఎవరికైనా ఏదైనా జరగరానిది జరిగితే హాస్పిటల్ కి తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఏంటి పరిస్థితి. ఏ అత్యవసర పనో పడితే ఏం చేయాలి. అప్పటికప్పుడు ఎలక్ట్రిక్ వాహనం బ్యాటరీ ఛార్జింగ్ పెట్టడం కుదిరినా వెంటనే ఫుల్ అవుతుందా? పోనీ ఛార్జింగ్ స్టేషన్ లో బ్యాటరీ స్వాప్ చేసుకుందామంటే నగరంలో అసలు స్వాపింగ్ స్టేషన్లు ఉన్నాయా? ఎంత దూరంలో ఉన్నాయి?
ఈ ఒక్క కారణం చాలదా.. ఎలక్ట్రిక్ వాహనం కొనకూడదు అనుకోవడానికి. బాగా ఎక్కువ రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉన్నాయి. కానీ లక్షన్నర పైనే పెట్టాలి. అది కూడా నాన్ రిమూవబుల్ బ్యాటరీ. ఇంట్లో ఏ పార్కింగ్ లోనో ఛార్జింగ్ పెట్టాల్సి ఉంటుంది. అక్కడ సురక్షితమా అంటే ఏమో చెప్పలేము. పార్కింగ్ లో ఛార్జింగ్ కి అనుకూలంగా లేకపోతే ఏ గదిలోకో తీసుకెళ్లి ఛార్జింగ్ పెట్టాలి. రోజూ బ్యాటరీని బయటకు తీసి ఇంట్లోకి తీసుకెళ్లాలి. మాకు ఓపిక ఎక్కువండి బ్యాటరీ మోసుకుంటూ వెళ్లి గదిలో ఛార్జింగ్ పెట్టుకుంటాం అని అనుకున్నా.. రోజూ ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీ పాడయ్యే అవకాశం ఉంది. అది పేలుతుందేమో అన్న భయం ఉంటుంది. నిద్ర అనేది ఉండదు. సుఖంగా గుండె మీద చేయి వేసుకుని నిద్రపోలేని పరిస్థితి ఎందుకు చెప్పండి అని అనిపిస్తుంది. అయితే బాగా ఎక్కువ రేంజ్ ఇచ్చే వాహనం అయినా కొనుక్కోవాలి. లేదా ప్రతి రోజూ 4,5 గంటలు ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఎక్కువ దూరం ప్రయాణం చేసేవారికి ఇది ఒకరకమైన సేవే. దీని కంటే ఒక బైక్ కొనుక్కుని పెట్రోల్ అయిపోయే సమయంలో ఏ పెట్రోల్ పంపులోకో వెళ్లడం ఉత్తమం అనిపిస్తుందా? కొంతమంది ఎలక్ట్రిక్ వాహనాలు వాడిన తర్వాత వారు చెబుతున్న అనుభవాలు ఇవి.
టాప్ స్పీడ్ కనీసం 60 నుంచి 100 కి.మీ. వేగం ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఎకో మోడ్ అయితే కనీసం 60 ఉండేలా చూసుకోండి. పవర్ మోడ్ అయితే 80 నుంచి 100 కి.మీ. ఉండేలా చూసుకోండి. ఎకో మోడ్ లో 25 కి.మీ. టాప్ స్పీడ్ అంటే సిటీలో రోడ్ల మీద తిరగడం కష్టం. వీధుల్లో తిరగడానికి ఓకే కానీ ఓపిక ఉండాలి. ఎకో మోడ్ లో 40 కి.మీ. టాప్ స్పీడ్ అయినా గానీ రోడ్ల మీద తిరగడానికి అవ్వదు. ఎకో మోడ్ లో టాప్ స్పీడ్ 40 కి.మీ. అయితే ఆ బండి కొనడం అనవసరం. ఇలాంటి బండ్లు పల్లెటూర్లలో పనికొస్తాయి. హైదరాబాద్ లాంటి సిటీల్లో పనికిరావు.
ట్రూ రేంజ్:
అన్ని కంపెనీలు ట్రూ రేంజ్ ని డామినేట్ చేస్తూ క్లెయిమ్ చేసిన రేంజ్ ని చెప్తారు. కంపెనీ క్లెయిమ్ చేసిన రేంజ్ అనేది రియాలిటీలో ఉండదు. ట్రూ రేంజ్ ఎంత అనేది తెలుసుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం 100 కి.మీ. పైనే రేంజ్ ఇచ్చే వాహనం అయితేనే మంచిది. లేదంటే అస్తమానూ ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఏదో సరదా కోసం తీసుకోవడమే తప్ప సీరియస్ గా రోజువారీ ప్రయాణానికి మామూలు ఈవీ అనేది సెట్ అవ్వదు. కాబట్టి కొనే ముందు వంద సార్లు ఆలోచించుకోండి.
రేంజ్ అనేది బ్యాటరీ, మోటార్ సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. బ్యాటరీ పర్సంటేజ్ తగ్గినప్పుడు స్పీడ్ తగ్గిపోతుంది. కాబట్టి ఎక్కువ సామర్థ్యం ఉన్న బ్యాటరీ తీసుకోండి. ఎక్కువ రేంజ్ ఇచ్చేలా ఉండే బ్యాటరీతో వచ్చే ఈవీ బెటర్. అలానే మోటార్ కూడా. బ్యాటరీ వారంటీ ఎన్నేళ్లు అనేది చూసుకోండి. రెండు, మూడేళ్లు వారంటీ ఇస్తే తీసుకోవచ్చు. చాలామంది చెప్పేది ఏంటంటే.. ఒక ఐదు, పదేళ్ల తర్వాత హై ఎండ్ మోడల్స్ వస్తాయి.. ఛార్జింగ్ స్టేషన్స్ పెరుగుతాయి. ఎలక్ట్రిక్ వాహనాల ధరలు తగ్గుతాయి. ఇప్పుడు పెట్టుకునే బడ్జెట్ కి ఇంకా ఎక్కువ రేంజ్, బ్యాటరీ సామర్థ్యం, తక్కువ ఛార్జింగ్ సమయం ఉండేలా వాహనాలు వస్తాయని అంటున్నారు. కాబట్టి అప్పటి వరకూ పెట్రోల్ వాహనాలే ఉత్తమం అనేది కొందరు అసంతృప్త ఈవీ వాహనదారుల అభిప్రాయం. మరి మీ అభిప్రాయమేమిటి? ఎలక్ట్రిక్ వాహనం కొనాలనుకుంటున్నారా? లేక 80, 70 కి.మీ. మైలేజ్ ఇచ్చే బైక్ కొనాలని అనుకుంటున్నారా?