ఈ ప్రభుత్వ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే మీరు కోటీశ్వరులు అవుతారు. వడ్డీ రూపంలోనే కోటి రూపాయలు వస్తున్నాయంటే ఎంత మంచి పథకంలో ఆలోచించండి. మరి నెలకు ఎంత పెట్టుబడి పెట్టాలి? ఈ పథకం ఏంటి? అనే వివరాలు మీ కోసం.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) అనేది దీర్ఘకాలిక పెట్టుబడుల పథకం. ఈ ప్రభుత్వ పథకం యొక్క లాకిన్ పీరియడ్ 15 ఏళ్ళు ఉంటుంది. ఈ పీపీఎఫ్ ఖాతాను ఏదైనా బ్యాంకులో గానీ లేదా పోస్టాఫీసులో గానీ రూ. 100 డిపాజిట్ చేయడం ద్వారా తెరవచ్చు. అయితే ఖాతా ఓపెన్ చేసిన తర్వాత కనీసం ఏడాదికి రూ. 500 అయినా డిపాజిట్ లేదా ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకూ డిపాజిట్ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఏడాదికి ఒకసారి అయినా లేదా నెలకొకసారి చొప్పున 12 నెలలు కట్టుకోవచ్చు. ఈ పథకంలో చేరితే సెక్షన్ 80సి కింద పన్ను ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఏడాదిలో డిపాజిట్ చేసే రూ. 1.50 లక్షలపై పన్ను ప్రయోజనాలు లభించడం సహా మెచ్యూరిటీ సమయంలో పన్ను ప్రయోజనాలను పొందవచ్చు.
పీపీఎఫ్ ఖాతాపై ప్రభుత్వం ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటు చెల్లిస్తుంది. ఈ వడ్డీని ప్రతి మూడు నెలలకొకసారి ప్రభుత్వం పీపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే ఒక క్రమపద్ధతిలో పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే కోటీశ్వరులు అవ్వచ్చునని నిపుణులు అంటున్నారు. అయితే మెచ్యూరిటీ పీరియడ్ ని 15 ఏళ్లకు పెట్టుకుంటే కోటీశ్వరులు కాలేరు. మామూలుగా 15 ఏళ్ల వరకూ పీపీఎఫ్ ఖాతాకు లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఆ తర్వాత 3 దఫాలుగా 5 ఏళ్ళు చొప్పున పెంచుకోవచ్చు. అప్పుడు అదనంగా మరో 15 ఏళ్ళు పీరియడ్ ఉంటుంది. అంటే మొత్తం 30 ఏళ్ళు లాకిన్ పీరియడ్ పెట్టుకుంటే.. నెలకి ఇంత అని పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే మెచ్యూరిటీ సమయంలో కోటిన్నర పైనే పొందవచ్చునని నిపుణులు అంటున్నారు.
ఉదాహరణకు మీరు 30 ఏళ్ల వయసప్పుడు పీపీఎఫ్ ఖాతా తెరిచి డిపాజిట్ లేదా పెట్టుబడి పెట్టడం ప్రారంభించారనుకుందాం. లాకిన్ పీరియడ్ 15 ఏళ్ళు అయితే.. మూడు దఫాలు ఐదేళ్ల చొప్పున పీరియడ్ ని పొడిగించారు. అప్పుడు మొత్తం పెట్టుబడి వ్యవధి 30 ఏళ్ళు. గరిష్టంగా ఏడాదికి రూ. 1.50 లక్షల (నెలకు రూ. 12,500) చొప్పున 30 ఏళ్ల పాటు పెట్టుబడి పెడుతూ వెళ్తే.. 30 ఏళ్ల తర్వాత మీ చేతికి రూ. 1,54,50,911 వస్తాయి. అంటే కోటిన్నర పైనే అన్నమాట. దీని కోసం ప్రభుత్వం చెల్లించే వడ్డీ 7.1 శాతం. ఏడాదికి లక్షన్నర చొప్పున 30 ఏళ్లకు మీరు పెట్టిన పెట్టుబడి రూ. 45 లక్షలు. కానీ మీ చేతికి అదనంగా రూ. 1,09,50,911 వస్తాయి. అంటే వడ్డీ ఏకంగా కోటి 9 లక్షల పైనే వస్తుంది. ఏడాదికి రూ. 1.50 లక్షలు అయినా డిపాజిట్ చేయవచ్చు. లేదా నెలకు రూ. 12,500 చొప్పున డిపాజిట్ చేయవచ్చు. ఇలా 30 ఏళ్ళ పాటు చేస్తే మెచ్యూరిటీ సమయంలో కోటిన్నరకు పైగా పొందవచ్చు. అయితే నెలకు రూ. 12,500 కట్టలేకపోయినా రూ. 500 చొప్పున కూడా ఇన్వెస్ట్ చేయచ్చు. కాకపోతే మెచ్యూరిటీ సమయంలో ఎక్కువ లాభం ఉండదు. మరి కోటీశ్వరులను చేసే పీపీఎఫ్ పథకంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.