ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ ఎన్ఆర్ నారాయణ మూర్తి చూడని విజయం లేదు. సాఫ్ట్వేర్ రంగంలో తన సంస్థను ఎంతో ఎత్తుకు చేర్చారు. అయితే ఇన్ని సక్సెస్‌లు చూసినా.. తల్లి విషయంలో మాత్రం ఆయనో తప్పు చేశారట. ఆ విషయం గురించి తాజాగా ఆయన వ్యాఖ్యానించారు. అసలేం జరిగిందంటే..!
మన దేశంలోని దిగ్గజ టెక్ కంపెనీల్లో ఇన్ఫోసిస్ ఒకటి. ఆ సంస్థను ఈస్థాయికి తీసుకురావడంలో ఎన్ఆర్ నారాయణ మూర్తి పాత్ర ఎంత ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొంతమంది మిత్రులతో కలసి కేవలం రూ.10 వేలు పెట్టుబడిగా పెట్టి ఇన్ఫోసిస్ కో-ఫౌండర్‌గా మారారాయన. ఈ డబ్బులను ఆయన భార్య సుధా మూర్తి ఇచ్చినట్లుగా చెబుతుంటారు. ప్రస్తుతం కాటమరాన్ వెంచర్స్ ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తున్నారు మూర్తి. తాజాగా వారాంతంలో ఐఐఎం అహ్మదాబాద్ స్టూడెంట్స్‌తో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా అక్కడి విద్యార్థులతో తన జీవిత విశేషాలను ఆయన పంచుకున్నారు. కార్పొరేట్ లీడర్లు ఎలా ఉండాలో వారికి సూచించారు.
జీవితంలో ఇంత సక్సెస్ చూసినా.. తన అమ్మ విషయంలో మాత్రం ఒక పొరపాటు చేశానన్నారు. తల్లి విషయంలో తాను అలా చేసి ఉండాల్సింది కాదని నారాయణ మూర్తి పశ్చాత్తాపం చెందారు. తన అమ్మ ఆరోగ్యంగా ఉన్న సమయంలో ఇన్ఫోసిస్‌కు తాను ఏ రోజూ ఆహ్వానించలేదన్నారు. అయితే చనిపోయే రోజుల్లో ఆమెను కంపెనీకి రావాల్సిందిగా ఆహ్వానించడం పెద్ద తప్పేనన్నారు నారాయణ మూర్తి. ఆమె హెల్తీగా ఉన్నప్పుడు పిలవనందుకు చాలా బాధగా ఉందన్నారు. ఇక, కార్పొరేట్ లీడర్ అంటే నిర్ణయం తీసుకునేటప్పుడు.. దాని వల్ల ప్రభావితమయ్యే వారి గురించి, వాటి వల్ల నష్టపోయే పేదవాళ్ల గురించి ఆలోచించాలన్నారు. దీన్ని మహాత్మా గాంధీ నుంచి నేర్చుకున్నానని ఎన్ నారాయణ మూర్తి చెప్పారు.