రూపాయికి రూపాయి పోగేసి సంపాదించి కోటీశ్వరులు అవ్వడం ఈరోజు దాదాపు అసాధ్యం. ఓ సాధారణ మధ్య తరగతి ఉద్యోగి తన జీవిత కాలంలో మహా అయితే ఓ కోటి రూపాయలు సంపాదించి, వాటిని ఖర్చు చేసి.., జస్ట్ బతికాను అన్నట్టు తన జీవితాన్ని ముగించేస్తున్నాడు. కానీ.., ఈవిషయంలో ఇంకొంత మంది స్మార్ట్ గా ఆలోచిస్తున్నారు. వీరు రూపాయికి రూపాయి పోగు వేయడం లేదు. తమ దగ్గర ఉన్న డబ్బులను వివిధ ఫైనాన్షియల్ ప్లాట్ ఫామ్స్ పై ఇన్వెస్ట్ చేసి.. తెలివిగా డబ్బు సంపాదిస్తున్నారు. ఈ విషయంలో భారతీయులు ఎక్కువగా నమ్మేది బంగారంపై పెట్టుబడి పెట్టదాన్ని మాత్రమే.
గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మన దగ్గర అనాదిగా వస్తోంది. దీని కారణంగానే భారత్ లో ప్రస్తుతం 25 వేల టన్నుల బంగారం ఉంది. కానీ.., ఇప్పుడు ఇండియన్స్ లెక్కలు మారిపోయాయి. బంగారంపై పెట్టుబడి పెట్టడం కన్నా, క్రిప్టోకరెన్సీ పై ఇన్వెస్ట్మెంట్ కి ఇండియన్స్ ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. క్రిప్టో కరెన్సీలోన కేవలం ఒక్క బిట్‌కాయిన్ మాత్రమే కాదు.., డాగ్‌కాయిన్, ఈథర్, బిట్ కాయిన్ క్యాష్, స్టెల్లార్, చైన్ లింక్, బినాన్స్ కాయిన్ వంటివి 4000 రకాల వరకు ఉన్నాయి. వీటిలో ఒక్కో కాయిన్ విలువ 26 లక్షల నుండి.., ఒక్క రూపాయి వరకు కూడా ఉన్నాయి.
క్రిప్టో కరెన్సీ పై ఇండియన్స్ కి ఆసక్తి ఎందుకు పెరిగింది అనే దానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఈరోజు ఒక్క బిట్ కాయిన్ విలువ 26 లక్షల రూపాయలు. కానీ.. 2010 లో ఇదే బిట్ కాయిన్ విలువ కేవలం 50 రూపాయలు మాత్రమే. ఇందుకే ఇప్పుడు భారతీయుల చూపు క్రిప్టో కరెన్సీ వైపు మళ్లింది. దీంతో.., ఈ మనీపై ఇన్వెస్ట్మెంట్ భారీ స్థాయిలో పెరిగింది. క్రిప్టో కరెన్సీ లో ఇన్వెస్ట్ చేసి.., కాస్త సహనంగా ఉంటే కనీవినీ ఎరుగని లాభాలు పొందవచ్చని భారతీయులు ఇప్పుడు బలంగా నమ్ముతున్నారు.
ఈ విషయంలో ప్రముఖ సంస్థ చైనాలిసిస్ ఓ అధ్యయనాన్ని విడుదల చేసింది. వీరి లెక్కల ప్రకారం భారత్‌లో గత సంవత్సరంలో క్రిప్టో కరెన్సీ పెట్టుబడులు 200 మిలియన్ డాలర్ల నుంచి.. ఒకేసారి 40 బిలియన్ డాలర్లుకు వరకు పెరిగింది. రానున్న కాలంలో ఈ ఫిగర్ ఇంకా పెరిగే అవకాశం ఉందని చైనాలిసిస్ తేల్చి చెప్పింది. కానీ.., ఇక్కడ ఇంకా ఆశ్చర్యకరమైన అంశం ఏమిటో తెలుసా? క్రిప్టోకరెన్సీ పై ఇంతలా కోట్లు పెట్టుబడి పెడుతోంది బిజినెస్ మేన్స్ అనుకుంటే మీరు పొరబడినట్టే. 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉన్న యువత ఈ క్రిప్టోకరెన్సీ పై ఎక్కువగా పెట్టుబడులు పెడుతున్నారు. తగిన రేట్ వచ్చాక వాటిని వెనక్కి తీసుకుంటున్నారు. ఇక మన దేశంలో మొత్తం 19 క్రిప్టో ఎక్స్చేంజ్ మార్కెట్లు ఉన్నాయి.