సాధారణంగా చాలా మంది తన ఇంట్లో పనిచేసేవారికి జీతం మాత్రమే ఇస్తారు. కొందరు మాత్రం తమ ఇంట్లో పనివారిని సొంత మనుషులాగా చూసుకుంటారు. అలా దాతృత్వం చూపించే వారిలో ప్రైవేట్ రంగం బ్యాంక్ IDFC ఫస్ట్ బ్యాంక్ ఎండీ, సీఈవో వి.వైద్యనాథన్ ఒకరు. ఆయన మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. గతంలో వ్యక్తిగత హోదాలో కొందరు వ్యక్తులకు షేర్లను బహుమానంగా ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తన వ్యక్తిగత సిబ్బందికి 9 లక్షల షేర్లను బహుమతిగా ఇచ్చారు. వి.వైద్యనాథన్ తన వ్యక్తిగత ట్రైయినర్, పనిమనిషి, డ్రైవర్ తో పాటు మరో ఐదు మంది ఇళ్ల నిర్మాణం కోసం 9 లక్షల షేర్లను బహుమతిగా ఇచ్చి తన ఉదారతను చాటుకున్నారు.
సోమవారం నాటికి స్టాక్ మార్కెట్ ధరను బట్టి చూస్తే ఈ షేర్ల విలువ దాదాపు రూ.4 కోట్లుగా ఉంటుంది. ఈ ఐదు మందికి వారి సొంత ఇంటి కల సాకారం చేసేందుకే ఆయన ఈ సహాయం చేశారు. ఈ 9 లక్షల షేర్లలో ట్రెయినర్ రమేష్ రాజుకు 3 లక్షల షేర్లు, పనిమనిషికి ప్రాంజల్ నర్వేకర్, డ్రైవర్ అలగర్ సామికి చెరో 2 లక్షలు, ఆఫీస్ సపోర్ట్ ఉద్యోగితో పాటు మరో పనిమనిషికి చెరి 1 లక్ష షేర్లను బహుమతిగా IDFC ఫస్ట్ బ్యాంక్ ఎండీ వైద్యనాథన్ ఇచ్చారు.
ఆయన సామాజిక కార్యకలాపాల కోసం 11 లక్షల ఐడీఎఫ్ సీ షేర్లను కేటాయించారు. ఈ షేర్ల నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎటువంటి ప్రయోజనాలు వైద్యనాథన్ పొందలేదని బ్యాంకు వెల్లడించింది. మరోవైపు, సామాజిక సేవ కార్యక్రమాల కోసం ఈయన స్థాపించిన రుక్మిణీ సోషల్ వేల్ఫేర్ ట్రస్ట్ 2 లక్షల షేర్లను విరాళంగా ఇచ్చినట్లు ఐడీఎఫ్ సీ బ్యాంకు తెలిపింది. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.