టెక్నాలజీ రాకతో గత కొన్నేళ్లుగా బ్యాంకింగ్ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు ఎవరికైనా డబ్బులు పంపాలంటే.. బ్యాంకుకు వెళ్లి.. ఫారమ్ రాసి.. లైన్ లో నిల్చొని.. కౌంటర్ లో తీసుకున్నాక.. పది నుంచి పదిహేను నిమిషాల ప్రాసెస్. కానీ, ఇప్పుడు ఇంటర్ నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవల ద్వారా సెకన్లలోనే డబ్బులు ఇతరులకు ట్రాన్సఫర్ చేస్తున్నాం. ఈ ప్రాసెస్ సౌకర్యంగా ఉన్నప్పటికీ.. కొన్నిసార్లు తప్పులు దొర్లి.. తప్పుడు ఖాతాకు డబ్బును బదిలీ చేస్తుంటాము. అంతే ఇక పోయాయి.. నా డబ్బులు అని ఒకటే టెన్షన్! నిజమే కదండీ!
ఇలాంటి సందర్భాల్లో ఏం చేయాలో చాలా మందికి తెలియదు. పోనీ, బ్యాంకుకు వెళ్లి అడిగారా! నువ్ యూపీఐ ట్రాన్సఫర్ అంటున్నావ్ గా.. వాడినే అడుగు అని నిర్లక్ష్యపు సమాధానం చెబుతారనే టెన్షన్. ఇకపై.. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. మీరు కొన్ని సులభమైన మార్గాల్లో మీ డబ్బును తొందరగా తిరిగి పొందవచ్చు. కానీ, కొన్ని సందర్భాల్లో రెండు నెలల సమయమా కూడా పట్టొచ్చు. తప్పుడు ఖాతాకు డబ్బులు ట్రాన్సఫర్ చేస్తే.. మీరు ముందుగా మీ బ్యాంక్ కస్టమర్ కేర్ కు కాల్ చేసి ఈ విషయాన్ని తెలియజేయాలి. దీనికి తోడు లావాదేవీల స్క్రీన్ షాట్లను వారికి అందించాలి. ఆ తర్వాత బ్యాంక్ మీ రిక్వెస్ట్ పై చర్యలు తీసుకోవటం ప్రారంభిస్తుంది.
1. తప్పు యూపీఐ ఐడీకి ట్రాన్సఫర్ చేసిన సందర్భాల్లో..
యూపీఐ ట్రాన్సఫర్ చేస్తున్న సమయంలో తప్పుడు ఖాతాకు డబ్బు ట్రాన్ఫర్ చేసినట్లయితే భయపడాల్సిన పనిలేదు. తప్పు లావాదేవీ జరిగితే, ముందుగా దాని వివరాలతో కూడిన స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ పేమెంట్ మెసేజ్ లో ఉన్న హెల్ప్ లైన్ నంబర్ కు కాల్ చేసి పిర్యాదు చేయండి. అదే సమయంలో ఈ వివరాలను బ్యాంక్ కు కూడా తెలపండి. వీలైనంత త్వరగా బ్రాంచ్ మేనేజర్‌ని సంప్రదించండి. మీరు తప్పుడు యూపీఐ ఐడీకి పంపినప్పుడు అది నిజంగా లేని పక్షంలో డబ్బు ఆటోమేటిక్‌గా రీఫండ్ చేయబడుతుంది.
2.ఇంటర్ బ్యాంక్ లావాదేవీ అయితే..
డబ్బును మీరు తప్పుడు వ్యక్తి ఖాతాకు బదిలీ చేసి ఉంటే.. దాని వివరాల రుజువును మీ బ్యాంకుకు ఫిర్యాదుతో పాటు అందించాలి. ఇది ఇంటర్ బ్యాంక్ లావాదేవీ అయితే.. మీ తరఫున బ్యాంకు.. రిసీవర్ బ్యాంకుకు ట్రాన్సాక్షన్ సంబంధిత అన్ని వివరాలను అందించి.. మీ డబ్బు.. మీరు తిరిగిపొందేలా సహాయం చేస్తుంది. ఈ ప్రక్రియ చాలా సులువుగా పూర్తవుతుంది.
3. రెండు వేర్వేరు బ్యాంకుల మధ్య లావాదేవీ జరిగినట్లయితే..
రెండు వేర్వేరు బ్యాంకుల మధ్య లావాదేవీ జరిగినట్లయితే.. సమీపంలోని బ్రాంచ్ ను రిసీవరీ కోసం సంప్రదిస్తుంది. ఖాతాదారుడి పేరు, బ్రాంచ్, మొబైల్ నంబర్ ఇతర అవసరమైన సమాచారాన్ని తెలుసుకోవదానికి ప్రయత్నిస్తుంది. అలాంటి సందర్భాల్లో.. మీరు రిసీవర్ బ్రాంచ్‌కి వెళ్లి నేరుగా మేనేజర్‌తో మాట్లాడి రిక్వెస్ట్ చేయవచ్చు. బ్యాంక్ మేనేజర్ డబ్బు పొందిన వ్యక్తితో మాట్లాడి మీ డబ్బును తిరిగి ఇవ్వమని అడుగుతాడు. అతడు అంగీకరిస్తే.. సులభంగానే డబ్బులు తిరిగి పొందొచ్చు. ఒకవేళ అతడు అంగీకరించకుంటే.. న్యాయ సహాయం తీసుకోవలసిందే.
1. IFSC కోడ్ తప్పుగా ఉన్నట్లయితే..
ఒకవేళ.. మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎవరికైనా డబ్బును బదిలీ చేసినట్లయితే, మీరు బ్యాంక్ ఖాతా నంబర్‌తో పాటు IFSC కోడ్‌ను నమోదు చేయాల్సి ఉంటుంది. ఒక వేళ మీ IFSC కోడ్ తప్పుగా ఉన్నట్లయితే, అటువంటి పరిస్థితిలో మీ డబ్బు 24 నుంచి 48 గంటల్లోపు తిరిగి ఖాతాలో జమ అవుతుంది. డబ్బు తిరిగి జమ కాకపోతే బ్యాంకు సిబ్బందిని సంప్రదించవచ్చు.
2. మీ డబ్బును తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తే..
డబ్బు తప్పుడు ఖాతాకు బదిలీ అయినప్పుడు.. మీ డబ్బును తిరిగి ఇవ్వడానికి ఆ వ్యక్తి నిరాకరిస్తే! అటువంటి పరిస్థితిలో మీరు న్యాయ సహాయం తీసుకోవచ్చు. మీరు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు. కోర్టు సహాయంతో మీ డబ్బును తిరిగి పొందవచ్చు. దీనిలో అన్నింటికన్నా ముఖ్యమైనది ఏమిటంటే మనం ఎంత త్వరగా దీనిపై స్పందించాము, బ్యాంకుకు ఎంత త్వరగా విషయాన్ని తెలియజేశామన్నదే. అప్పుడే బ్యాంక్ మీకు త్వరితగతిన డబ్బును తిరిగి ఇప్పించేందుకు సహాయపడుతుంది. ఏదేమైనా.. డిజిటల్ చెల్లింపులు చేసే సమయంలో వివరాలను ఒకటికి పదిసార్లు సరిచూసుకోవటంఉత్తమం. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.