‘ఉద్యోగుల భవిష్య నిధి(EPF)..’ దీని గురించి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకు సుపరిచితమే. గతంలో పీఎఫ్ వద్దనుకుంటే కొన్ని కంపెనీలు వెసులుబాటు కల్పించేవి. కానీ, ఇప్పుడు ప్రభుత్వం పీఎఫ్‌ని తప్పనిసరి చేయడంతో దాదాపు ఉద్యోగులందరూ ఈ పీఎఫ్ చందాదారులుగా ఖాతాలు కలిగి ఉన్నారు. ఉద్యోగుల జీతాల్లోంచి నెలనెలా కొంత మొత్తంలో డెడక్ట్ చేసి ఆయా ఖాతాల్లో జమ చేస్తుంటారు. అలా జమ చేసిన డబ్బుకు ఉద్యోగుల భవిష్య నిధి వడ్డీ కూడా చెల్లిస్తుంది. ప్రస్తుతం వడ్డీ రేటు 8.10% ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరానికి వడ్డీని ఇప్పటికే వారి వారి ఖాతాల్లో జమ చేసింది.
మన ఖాతాల్లో ఉన్న పీఎఫ్ అమౌంట్ ఎంత? మనకు వస్తున్న వడ్డీ ఎంత? అన్నది చాలా మందికి తెలియదు. ఇందుకు కారణం.. UAN నెంబర్ తెలియకపోవడమే. అసలు UAN నెంబర్ అంటే ఏమిటి? దీని వల్ల ప్రయోజనాలేంటి? పీఎఫ్ బ్యాలన్స్ ఎలా చెక్ చేసుకోవాలి? ఖాతాలో జమ అయిన వడ్డీని ఎలా తెలుసుకోవాలి? వంటి అన్ని వివరాలు మీకోసం..
మొదటగా UAN: దీన్నే యూనివర్సల్ అకౌంట్ నంబర్ అంటారు. EPF కి సహకారం అందించే ప్రతి జీతానికి కేటాయించిన 12 అంకెల ప్రత్యేక నెంబర్. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఉద్యోగ మార్పులతో సంబంధం లేకుండా ఉద్యోగి యొక్క జీవితంలో ఇది ఒకే విధంగా ఉంటుంది. అంటే.. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినా.. UAN నెంబర్ ఒకటే ఉంటుంది. ఉద్యోగి యొక్క UAN నంబర్ వారి వారి పే స్లిప్ లమీద కూడా ఉంటుంది. ఒకవేళ మీ దగ్గర పే స్లిప్స్ లేకపోయినా ఈ కింది లింక్ ను ఉపయోగించి మీ UAN నెంబర్ తెలుసుకోవచ్చు.
ఈపీఎఫ్ పోర్టల్: ఈపీఎఓ సభ్యత్వ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న సభ్యులు అధికారిక వెబ్ సైట్ కు వెళ్లి కూడా బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు. అందులో ‘అవర్ సర్వీసెస్’లోని ‘మెంబర్ పాస్బుక్’ విభాగంలోకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ తరువాత యూఏఎన్ నంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేయడం కోసం మరో పేజీకి రీడైరెక్ట్ అవుతుంది. వివరాలు ఎంటర్ చేయడం ద్వారా మీ ఖాతా వివరాలు తెలుసుకోవచ్చు.
మిస్డ్ కాల్ సర్వీస్: ఈపీఎఫ్ఎతో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నుంచి 011-22901406 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. మీరు మిస్డ్ కాల్ ఇచ్చిన తర్వాత ఓ రింగ్ అయి వెంటనే కాల్ కట్ అవుతుంది. కాసేపటికే బ్యాలెన్స్ వివరాలు ఎస్సెమ్మెస్ రూపంలో ప్రత్యక్షమవుతాయి.
Umang app: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉమాంగ్ యాప్ ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకునే వీలుంది. అందుకోసం ఉమాంగ్ యాప్లో ని ఈపీఎఫ్ఎను ఎంచుకోవాలి. అందులో ‘ఎంప్లాయీ సెంట్రిక్ సర్వీసెస్’ విభాగంలోకి వెళ్లి వ్యూ పాస్బుక్ ను క్లిక్ చేయాలి. అప్పుడు మీ యూఏఎన్ నంబర్లో పాటు మీ మొబైల్ నంబరు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కనిపించే మెంబర్ ఐడీని క్లిక్ చేయడం ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ను పొందొచ్చు. అయితే, మీ పీఎఫ్ ఖాతాతో మొబైల్ నంబర్ ముందే జత చేసి ఉండాలి.
ఎస్సెమ్మెస్ ద్వారా: యూఏఎన్ యాక్టివేట్ చేసుకున్న చందాదారులు ఈపీఎఫ్ ఖాతాకు జత చేసిన మొబైల్ నుంచి ‘EPFOHO UAN ENG’ అని టైప్ చేసి 77382 99899 నంబర్ కు ఎస్సెమ్మెస్ పంపించాలి. అదే తెలుగులో వివరాలు కావాలనుకుంటే..’EPFOHO UAN TEL’ అని మెసేజ్ పంపాల్సి ఉంటుంది.