ఉద్యోగానికి, వ్యాపారానికి చాలా తేడా ఉంటుంది. వ్యాపారంలో ఉన్నంత సౌకర్యం ఉద్యోగంలో ఉండదు. దానికి తోడు కుటుంబానికి, ఊరికి దూరంగా బతకడం అంటే చాలా బాధగా ఉంటుంది. కానీ ఊళ్ళో కాళ్ళ మీద నిలబడదామంటే సరైన ఉద్యోగం ఉండదు. వ్యాపారం చేద్దామంటే ఏది చేయాలో అర్ధం కాదు. మరి వ్యాపారం చేసి మంచిగా లాభాలు పొందాలి అనుకుంటే ఈ గుంటూరు యువకుడి స్టోరీ తెలుసుకోవాల్సిందే. చేస్తున్న ఉద్యోగం మానేసి ఇంటి వద్దనే ఉంటూ నెలకు రూ. 80 వేల వరకూ సంపాదిస్తున్నారు.
ఊరికి, ఇంటికి దూరంగా వెళ్ళిపోయి ఉద్యోగం చేయడం కంటే ఇంటి వద్దే ఉంటూ సొంతంగా ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ కొంతమందికే అది సాధ్యమవుతుంది. కొంతమంది కొన్నాళ్ళు ఉద్యోగం చేసి ఆ దాచుకున్న జీతం సొమ్ముతో సొంత ఊరికి వచ్చి వ్యాపారం మొదలుపెడతారు. అయితే ఎక్కువగా యువకులు వ్యవసాయాన్ని ఉపాధిగా మలచుకుంటున్నారు. వ్యవసాయాన్ని వ్యాపారంగా భావించి దిగి లాభాలు ఆర్జిస్తున్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందేలా ఆధునిక పద్ధతులను అనుసరించి వ్యవసాయ సాగు చేస్తున్నారు. అలా సాగు చేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగిలా నెలకు లక్షలు సంపాదిస్తున్న వారు చాలా మందే ఉన్నారు. వీరిలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన సాయి ఒకరు.
ఈ యువకుడు గతంలో ఉద్యోగం చేసేవారు. కానీ ఆ ఉద్యోగం మానేసి సొంత ఊరికి వచ్చేసి సొంతంగా వ్యవసాయం చేసుకుంటున్నారు. దీని కోసం ముందు ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందా అని ఆలోచించినప్పుడు పుట్టగొడుగుల వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం పుట్టగొడుగుల పెంపకం గురించి శిక్షణ ఇచ్చే సంస్థలో శిక్షణ తీసుకున్నారు. శిక్షణ పూర్తయ్యాక పుట్టగొడుగుల వ్యాపారం ప్రారంభించారు. పుట్టగొడుగుల్లో బటన్ మష్రూమ్, మిల్కీ మష్రూమ్ అని 40 రకాలు ఉన్నాయి. ఈ యువకుడు మిల్కీ మష్రూమ్ లని ఎంచుకున్నారు. మూడేళ్ళ క్రితం ఈ వ్యవసాయాన్ని ఒక గదిలో ప్రారంభించి.. రోజూ 2 నుంచి 3 కిలోల పుట్టగొడుగులను దిగుబడి తీసేవారు. ఇప్పుడు 10 గదులకు విస్తరించి మంచి దిగుబడి పొందుతున్నారు. ఇంటినే పరిశ్రమగా మార్చేశారు.
ఈ పుట్టగొడుగుల వ్యాపారం ప్రారంభించాక మొదటి బ్యాచ్ పూర్తవ్వడానికి 45 నుంచి 50 రోజులు పడుతుంది. 60 రోజుల్లో మూడు బ్యాచ్ లు తీయచ్చునని అన్నారు. దీనికి రూ. 6 నుంచి రూ. 7 లక్షలు పెట్టుబడి పెట్టానని, రోజుకు 10 నుంచి 15 కిలోలు దిగుబడి వస్తుందని అన్నారు. ప్రస్తుతం కిలో పుట్టగొడుగుల ధర రూ. 250 వరకూ ఉంది. మార్కెట్ విషయానికొస్తే హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు పంపిస్తామని అన్నారు. పెళ్లిళ్లకి, స్థానికంగా ఎవరికైనా కావాలంటే వాళ్ళకు నేరుగా విక్రయిస్తున్నామని అన్నారు. నెలకు రూ. 70 వేలు నుంచి రూ. 80 వేలు సంప్రదిస్తున్నామని అన్నారు. అన్ సీజన్ లో అయితే రూ. 50 వేలు సంపాదిస్తానని అన్నారు.
ఈ వ్యాపారం సక్సెస్ ఫుల్ గా చేయాలంటే మార్కెట్ చేసుకోవడం చాలా ముఖ్యమని, పేపర్ ప్రకటనలు, సోషల్ మీడియాలో ప్రకటనలు ఇవ్వాలని అన్నారు. ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా మార్కెటింగ్ చేసుకోవచ్చునని, లేదా క్యాటరింగ్ చేసే వారిని సంప్రదించినా మార్కెట్ చేసుకోవచ్చునని అన్నారు. మొదట ఒకే గదిలో ప్రారంభించి వచ్చిన లాభాలను బట్టి గదులను పెంచుకుంటూ వెళ్తే నెలకు రూ. 80 వేలు నుంచి లక్ష వరకూ సంపాదించుకోవచ్చు. మీరు కూడా ఈ వ్యాపారం చేసి మంచిగా లాభాలు పొందండి. మరి ఉద్యోగం మానేసి సొంత ఊరికి వచ్చి సాఫ్ట్ వేర్ జీతం సంపాదిస్తున్న ఈ యువకుడిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.