కూల్ డ్రింక్ కంపెనీలన్నింటిని ఒక చెట్టు భయపెడుతోంది. ఈ సమస్య గురించి ఐక్యరాజ్య సమితి వేదికగా తమ గోడు వెళ్లబోసుకుంటున్నాయి కూల్ డ్రింక్ కంపెనీలు. ఇంతకు ఏంజరిగింది అంటే..
ఓ పాతికేళ్ల క్రితం వరకు.. కూల్ డ్రింక్ అంటే నిమ్మకాయ సోడా, గోళి సోడా. మరి ఇప్పుడో.. వేర్వురు రంగుల్లో.. వేర్వురు రుచుల్లో చూడగానే ఆకర్షించే ప్యాకింగ్‌లో ఎన్నో రకాల కూల్ డ్రింక్స్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. పాలు తాగే పసి వాళ్ల నుంచి పండు ముసలి వాళ్ల వరకు.. అందరూ ఇప్పుడు ఈ రంగు నీళ్లకు అలవాటు పడ్డారు. వేసవి కాలంలో వీటి అమ్మకాలు మరింత పెరుగుతాయి. ఇప్పటికే మార్కెట్‌లో అనేక రకాల కూల్‌డ్రింక్స్ అందుబాటులో ఉండగా.. తాజాగా రిలయన్స్ సంస్థ కూడా కంపా డ్రింక్‌ను పోటీగా తీసుకువచ్చింది. రిలయన్స్ ఎంట్రీతో కూల్‌డ్రింక్ కంపెనీల మధ్య తీవ్ర పోటీ నెలకొననుండబోతుంది అనుకున్న తరుణంలో.. షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం కూల్‌డ్రింక్ కంపెనీలన్నింటిని ఓ చెట్టు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్లు సమాచారం. కూల్‌డ్రింక్ కంపెనీలకు, చెట్టుకు సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా.. అయితే ఇది చదవండి.
పెప్సీ, కోకాకోలా ఇలా ఏం కూల్ డ్రింక్ అయినా తయారు కావాలంటే ప్రధానంగా వాడే పదార్థం గమ్ అరబిక్. సాఫ్ట్ డ్రింక్స్ తయారీలో ఈ పదార్థం లేకపోతే చాలా కష్టం. సాఫ్ట్ డ్రింక్ తయారు చేసేందుకు వాడే పదార్థాలన్నింటిని ఈ గమ్ అరబిక్ కలిపి ఉంచుతుంది. ఫలితంగా అవి రుచిని పొందుతాయి. గమ్ అరబిక్ వాడకపోతే.. పదార్థాలన్ని విడిపోయి.. ఎలాంటి రుచి లేకుండా పోతుంది. కూల్ డ్రింక్స్ తయారీలో గమ్ అరబిక్ ఎంత ముఖ్యమో దీన్ని బట్టి అర్థం అవుతుంది కదా.
పేరుకు తగ్గట్టుగానే ఇది ఒక జిగురు. అకాసియా అనే చెట్టు నుంచి వచ్చే ఒకలాంటి జిగురు. ఈ చెట్లు సుడాన్‌లో మాత్రమే ఉన్నాయి. కూల్ డ్రింక్స్ తయారీకి కావాల్సిన గమ్ అరబిక్ ఈదేశం నుంచే దిగుమతి చేసుకుంటాయి. అయితే త్వరలోనే గమ్ అరబిక్‌కు తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉందని కూల్‌డ్రింక్ కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కారణం సూడాన్ అంతర్యుద్ధం.
ప్రపంచంలోనే అతి పేద దేశమైన సూడాన్‌ను అంతర్యుద్ధం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ ఆధిపత్య పోరుపై ప్రపంచ దేశాలే కాక.. అంతర్జాతీయ సంస్థలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా కూల్ డ్రింక్ తయారీ కంపెనీలు. తమ ఉత్పత్తుల తయారీకి అంతరాయం కలగకుండా ఉండేలా సూడాన్‌లో మాత్రమే దొరికే ఈ గమ్ అరబిక్‌కు పదార్థాన్ని భారీ ఎత్తున సమకూర్చుకునేందుకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి.
సూడాన్‌లోని సాహెల్ ప్రాంతం నుంచి సుమారు 70 శాతం గమ్ అరబిక్ ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతోంది. రాయిటర్స్‌లో వచ్చిన ఓ నివేదిక ప్రకారం.. మరో 5-6 నెలల్లో గమ్ అరబిక్‌తో తయారు చేసిన ఉత్పత్తులు అయిపోవచ్చని తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రధాన ఆహార, పానీయాల కంపెనీలకు గమ్ అరమిక్ సరపరా చేసే కెర్రీ గ్రూప్ ప్రొక్యూర్మెంట్ మేనేజర్ రిచర్డ్ ఫిన్నెగన్ను తెలిపినట్లు.. రాయిటర్స్ వెల్లడించిన నివేదికలో ఉంది. ప్రతి ఏటా 120,000 బిలియన్ డాలర్ల విలువైన 11,500 టన్నుల గమ్ అరబిక్ ఉత్పత్తి అవుతుందని కెర్రీ గ్రూప్ అంచాన వేసింది. తూర్పు నుంచి పశ్చిమ ఆఫ్రికా వరకు 500 మైళ్లలో విస్తరించి ఉన్న ప్రాంతం నుంచి గమ్ అరబిక్‌ను సేకరిస్తారు
గమ్ అరబిక్ లేకుండా పెప్సీ, కోకాకోలా వంటి దిగ్గజ కూల్ డ్రింక్ కంపెనీలు తమ ఉనికికి కాపాడుకోవడం దాదాపు అసాధ్యం అని అంటున్నారు. ఫిజీ డ్రింక్స్ వంటి ఉత్పత్తులో గమ్ అరబిక్‌కు ప్రత్యామ్నాయం లేదని నిపుణులు చెబుతున్నారు. దాంతో ప్రపంచ దేశాలకు చెందిన దిగ్గజ కూల్ డ్రింక్ కంపెనీలు సూడాన్ అంతర్యుద్ధం ముగింపుకై ఐక్యరాజ్య సమితి వేదిక మీద తమ గొంతుక వినిపిస్తున్నాయి. మరి ఈ అంతర్యుద్ధం ఇలానే కొనసాగితే.. రానున్న రోజుల్లో కూల్ డ్రింక్ ఉత్పత్తిపై భారీ ప్రభావం పడనుంది అంటున్నారు మార్కెట్ నిపుణులు. మరి రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉండనుందో చూడాలి.