12 అంకెలు కలిగిన గుర్తింపు కార్డే.. ఆధార్ కార్డు. ఒక వ్యక్తి యొక్క అన్ని వివరాలు ఇందులోనే ఉంటాయి. బయోమెట్రిక్ మొదలుకొని.. కళ్ళు స్కాన్ చేసిన వివరాల వరకు అన్ని వివరాలు ఉంటాయి. దీన్ని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) జారీచేస్తుంది. అంటే.. మన వివరాలన్నీ ప్రభుత్వ డేటాబేస్ లో సేవ్ అయ్యాయని అర్థం. బ్యాంకు అకౌంట్ తెరవాలన్నా, మన పిల్లలను స్కూలుకు పంపాలన్నా, మనకు ప్రభుత్వం నుంచి పింఛన్, సబ్సిడీ లాంటివి రావాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి. అంతటి విలువైన ఆధార్ కార్డును త్వరలో గేదెలకు జారీ చేయనున్నారు. ఈ విషయాన్ని దేశ ప్రధాని నరేంద్ర మోడీనే స్వయంగా ప్రకటించారు.
గ్రేటర్ నోయిడా వేదికగా జరిగిన ‘వరల్డ్ డైరీ సమ్మిట్ 2022’ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు. బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సాయంతో పశువులకు కూడా డేటాబేస్ రూపొందించడం జరుగుతుందని మోదీ తెలిపారు. ఇలా పశువులకు ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించడం ద్వారా వాటి జనాభా, ఆరోగ్యాన్ని ట్రాక్ చేయొచ్చనేదే ప్రభుత్వం ఆలోచన. అంతేకాదు.. దేశంలో డెయిరీ రంగాన్ని సైన్స్‌తో ముడిపెట్టి విస్తరిస్తున్నట్లు, డెయిరీ రంగానికి సంబంధించిన ప్రతి జంతువును ట్యాగ్ చేయనున్నట్లు తెలిపారు.
పశు ఆధార్
ఆధార్ కార్డును రూపొందించడానికి బయోమెట్రిక్ సమాచారం అవసరం. అంటే.. వేలిముద్రలు, కళ్లు తదితర సమాచారం తీసుకుంటారు. ఈ సమాచారాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జంతువుల నుంచి తీసుకుంటామని మోదీ తెలిపారు. ఈ ఆధార్ కు “పశు ఆధార్” అని పేరు పెట్టారు. జంతువుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోవడంతో పాటు, పాల ఉత్పత్తులకు సంబంధించిన మార్కెట్‌ను విస్తరించేందుకు ఇది దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు. పశు ఆధార్ ఇవ్వనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే ప్రకటించింది కనుక, ఇది అమలులోకి రావడానికి కొంత సమయం పట్టవచ్చు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు చేరవేస్తూనే ఉంటాము. ఈ విషయంపై, మీకు ఏమైనా సందేహాలు ఉంటే.. దగ్గరలోని పశు సంవర్ధక శాఖ అధికారులను సంప్రదించండి. ఈ విషయంపై, మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.