పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలతో బైకులను పక్కన పెట్టేశారా..? అయితే మీకో శుభవార్త. త్వరలోనే ఇంధన ధరలు తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయి. ఆర్బీఐ సిపార్సుల మేరకు కేంద్రం కొన్ని ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించే దిశగా ఆలోచిస్తోందట.. అదే జరిగితే పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
దేశంలో ఇంధనం ధరలు ఆకాశాన్ని అంటుతున్న సంగతి తెలిసిందే. ఆయా రాష్ట్రాలను బట్టి పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 95 నుంచి రూ. 113 మధ్య ఉన్నాయి. దీంతో ఈ భారాన్ని మోయలేక ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆసక్తి కనపరుస్తున్న వారు కొందరైతే, ప్రభుత్వ వాహనాలలో ప్రయాణం సాగిస్తున్న వారు మరికొందరు. త్వరలోనే వీరందరికి కేంద్రం శుభవార్త చెప్పనుందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. పెరుగుతోన్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు పన్ను ధరల్ని తగ్గించాల్సిందిగా కేంద్రానికి రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా సూచించిందట. కేంద్రం కూడా అందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అదే జరిగితే.. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ పరుగులు పెడుతోంది. గతేడాది డిసెంబర్‌లో 5.72 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం.. జనవరిలో 6.52 శాతానికి పెరిగింది. ముఖ్యంగా పాల ధరలు, మొక్కజొన్న, సోయా నూనె వంటి ధరలు పెరగడం ద్రవ్యోల్బణం పెరిగేందుకు కారణమవుతున్నాయి. దీన్ని కట్టడిచేయడానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) కీలక పాలసీ రేట్లను పెంచుకుంటూ వస్తోంది. అలాగే కొన్ని ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను తగ్గించాలని ఆర్‌బీఐ, కేంద్రానికి సూచనలు చేసినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఆర్‌బీఐ సిఫార్సులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న, ఫ్యూయెల్ వంటి కొన్నింటిపై పన్నులు తగ్గించే ప్రతిపాదనను పరిశీలిస్తోందని, ఈ అంశంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు ఈ విషయాన్ని వెల్లడించినట్లు రాయిటర్స్ ఒక కథనంలో పేర్కొంది. వీటికి అదనంగా ఇంధనంపైనా పన్ను ధరల్ని తగ్గించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
కాగా, ఇటీవలి కాలంలో గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ధరలు స్వల్పంగా తగ్గినప్పటికీ.. దేశంలోని చమురు కంపెనీలు ఈ తగ్గింపులను వినియోగదారులకు బదిలీ చేయటం లేదు. గతంలో వచ్చిన నష్టాల్ని పూడ్చుకునేందుకు గతేడాది మే నుంచి పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయట్లేదు. దీంతో వాహనదారులపైనే అధిక భారం పడుతోంది. చాలా ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే రూ.100పైనే ఉండటం గమనార్హం. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గుతున్నా దేశంలో ఇంధన ధరలు తగ్గకపోవడానికి ఇదొక కారణం. అయితే కేంద్రం దీనిపై పన్నులను తగ్గిస్తే.. పంప్ ఆపరేటర్లు వినియోగదారులకు ప్రయోజనాలను అందించడానికి, ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడంలో సహాయపడవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ విధంగా ఇంధన ధరలు తగ్గుముఖం పట్టే అవకాశంఉందని అంచనా వేస్తున్నారు.