దేశంలో ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ మొదలయ్యాక.. అన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ తో ఆధార్ నెంబర్ ను లింక్ చేయండంటూ కేంద్ర ప్రభుత్వం చెప్తున్న సంగతి అందరికీ విదితమే. ఇప్పటికే రేషన్ కార్డు, పాన్ కార్డు, పెన్షన్ కార్డు సహా ఇతర ముఖ్యమైన పత్రాలతో అనుసంధానం ప్రక్రియ మొదలైపోగా, ఇప్పుడు ఓటర్ వివరాల వంతొచ్చింది. అందుకు సంబంధించినదే ఈ కథనం.
దేశంలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ వారి వారి ఓటర్ ఐడీ వివరాలను ఆధార్‌తో అనుసంధానం చేయాలని కేందం ఎప్పటినుంచే చెప్తూనే ఉంది. అయినప్పటికీ ప్రజల్లో మాత్రం చలనం ఉండట్లేదు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారే తప్ప.. లింక్ చేయకపోతే ఏమవుతుందిలే అన్నట్లుగా దాటవేస్తున్నారు. ఇలాంటి వారి కోసం ఇదే చివరిసారి అంటూ డెడ్ లైన్ విధించటం.. ఆ గడువు సమయం వచ్చేలోగా మరోమారు పొడిగించటం జరుగుతోంది. ఇప్పుడు కూడా అదే జరిగింది. ఆధార్-ఓటర్ ఐడీ అనుసంధానం గడువును మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
ఓటర్ కార్డుతో ఆధార్ సంఖ్య అనుసంధానానికి కేంద్ర న్యాయశాఖ గతేడాది జూన్ 17న నోటిఫికేషన్ జారీ జేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ ఏడాది ఏప్రిల్ 1తో గడువు ముగియనుంది. అయినప్పటికీ.. వీటిని అనుసంధానించే ప్రక్రియ ఇంకా మొదలుకాలేదు. ఈ నేపథ్యంలో కేంద్ర న్యాయశాఖ.. ఆ గడువును మరో ఏడాది పాటుపెంచుతూ నిర్ణయం తీసుకుంది. 2023 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు గడువును పొడిగించింది. దీంతో మరో ఏడాది పాటు ఆధార్-ఓటరు కార్డు లింక్ చేసుకునేందుకు జనానికి అవకాశం దొరికింది.
మరోవైపు ఆధార్-పాన్ అనుసంధాన గడువును మరోమారు పొడిగించాలని ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ మేరకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీకి లేఖ రాసింది. రూ.1000 అపరాధ రుసుంను కూడా ఎత్తివేయాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఆధార్ – పాన్ అనుసంధానానికి మార్చి 31తో తుది గడువు ముగియనుంది. ఒకవేళ ఆలోపు అనుసంధానం చేయకపోతే పాన్ కార్డు పనిచేయదు. మొదట మార్చి 31, 2022వరకు ఉచితంగానే అనుసంధానికి వెసులుబాటు ఇచ్చినప్పటికీ, అనంతరం రూ.500, రూ. 1,000 అపరాధ రుసుంతో గడువును మార్చి 1, 2023కు పెంచింది. తాజాగా ఆ గడువు కూడా దగ్గరపడుతోంది.
ఎస్ఎంఎస్ ద్వారా:
ఆధార్‌తో ఓటరు ఐడీని అనుసంధానాన్ని ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా చేయవచ్చు. ఇందుకోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి మెసేజ్ పంపాల్సి ఉంటుంది. ECILINKSPACE>EPIC No.> SPACE>Aadhaar No. ఎంటర్ చేసి 166 లేదా 51969 నెంబర్‌కు మెసేజ్ పంపాలి. అనంతరం లింక్ అయినట్లుగా మెసేజ్ వస్తేనే.. పూర్తయినట్లు.
ఫోన్ చేయడం ద్వారా:
ఫోన్ చేయడం ద్వారా కూడా ఆధార్- ఓటర్ ఐడీ అనుసంధానం చేయవచ్చు. అందుకోసం భారత ప్రభుత్వం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అనేక కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది. అనుసంధానం చేయాలనుకున్న వారు 1950 నంబర్‌కు కాల్ చేసి ఆధార్ నంబర్‌తో పాటు తమ ఓటర్ ఐడీ వివరాలను వివరించాలి.ఈ ప్రక్రియ పూర్తి అయ్యాక.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు మెసేజ్ వస్తుంది.