భారతీ ఎయిర్ టెల్ ఓ కీలక ప్రకటన చేసింది. తమ కంపెనీలో గూగుల్ భారీ పెట్టుబడులు పెట్టనున్నట్లు వెల్లడించారు. ఏకంగా రూ.7500 కోట్లు(1 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపారు. గూగుల్ ఫర్ ఇండియా డిజిటలైజేషన్ ఫండ్ లో భాగంగా ఈ భారీ పెట్టుబడులకు గూగుల్ సిద్ధమైనట్లు ఎయిర్ టెల్ యాజమాన్యం ప్రకటించింది.
ఈ ఒప్పందంలో భాగంగా ఎయిర్ టెల్ లో వాటాను గూగుల్ కొనుగోలు చేయనుంది. దాదాపు 700 మిలియన్ డాలర్లతో ఎయిర్ టెల్ లోని 1.28 శాతం వాటాను గూగుల్ కొనుగోలు చేయనుంది. ఒక్కో షేర్ ను 734 రూపాయల చొప్పున మొత్తం 7,11,76,839 షేర్లను గూగుల్ కు జారీ చేసేందుకు ఎయిర్ టెల్ ఆమోద ముద్ర వేసింది. అంతేకాకుండా మరో 300 మిలియన్ డాలర్లను బహుళ సంవత్సరాల వాణిజ్య ఒప్పందాలకు ఖర్చు చేయనుంది.
ఈ ఒప్పందంతో ఎయిర్ టెల్ వినియోగదారులుగా ఉన్న 10 లక్షల చిన్న, మధ్య తరగతి వ్యాపారులకు గూగుల్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ‘భారత్ లో డిజిటల్ ఎకోసిస్టమ్ ను విస్తరించడమే లక్ష్యంగా గూగుల్ తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అంటూ భారతీ ఎయిర్ టెస్ ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ తెలిపారు.