అక్షయ తృతీయ నాడు విలువైన వస్తువులు కొంటే శుభం చేకూరుతుందని హిందువుల విశ్వాసం. ముఖ్యంగా బంగారం కొంటే సంపద రెట్టింపు అవుతుందని నమ్ముతారు. అయితే ఏ సమయంలో బంగారం కొంటే మంచిదో తెలుసుకోండి.
బంగారం కొనాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. డబ్బున్న వారు, మధ్యతరగతి వారు, దిగువ మధ్యతరగతి వారు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొనుక్కుంటారు. ఇంట్లో ఏ శుభకార్యమైనా సరే బంగారంతో చేసిన ఆభరణాలు ఉండాల్సిందే. పండుగైనా, పెళ్ళైనా, ఏ వేడుకైనా సరే ఆడవారి ఒంటి మీద బంగారం మెరవాల్సిందే. మామూలు రోజుల్లోనే బంగారం కొనేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. అలాంటిది అక్షయ తృతీయ అంటే ఆరోజున ఖచ్చితంగా బంగారం కొనాల్సిందే అని భీష్మించుకు కూర్చుంటారు. ఈరోజున కొంటే మంచిదని భావిస్తారు. అందుకే తమ స్థాయిని బట్టి బంగారం కొంటూ ఉంటారు.
అక్షయ తృతీయ ముఖ్యమైన పండుగలలో ఒకటి. అక్షయ తృతీయ రోజుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ పవిత్రమైన రోజున పరశురాముడి జయంతిని జరుపుకుంటారు. ఇదే రోజున భగీరథుడి తపస్సు ఫలితంగా దివిలో ఉన్న గంగ నేల మీదకొచ్చిందని చెబుతారు. అందుకే ఈరోజున పవిత్ర గంగానది స్నానం ఆచరిస్తారు. దీని వల్ల పాపాలు నశించి సుఖశాంతులు కలుగుతాయని పెద్దలు చెబుతారు. అక్షయం అంటే ఎన్నటికీ తరగనిది, చిరకాలం ఉండేది అని అర్థం. అందుకే అక్షయ తృతీయ నాడు ఏవైనా వస్తువులు కొన్నా, ఏదైనా కొత్త వ్యాపారులు మొదలుపెట్టినా ఎప్పటికీ ఉండిపోతాయని నమ్ముతారు. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ తదియన ఈ అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈసారి అక్షయ తృతీయ ఏప్రిల్ 22న వచ్చింది. ఈరోజున బంగారం కొంటే మంచిదని, ఐశ్వర్యం రెట్టింపు అవుతుందని హిందువులు విశ్వసిస్తారు.
బంగారంతో పాటు ఎలాంటి విలువైన వస్తువులు కొన్నా తమ సంపద, శ్రేయస్సు పెరుగుతుందని నమ్ముతారు. అయితే ఏ సమయంలో పడితే ఆ సమయంలో కాకుండా ఓ శుభ ముహూర్తాన బంగారం కొంటే మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఏప్రిల్ 22 శనివారం ఉదయం 7:49 గంటల నుంచి ఏప్రిల్ 23 ఉదయం 7:47 గంటల వరకూ ఏ సమయంలో కొన్నా గానీ మంచి ఫలితాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. ఇక ఈ అక్షయ తృతీయ రోజున సర్వార్థ సిద్ధి యోగం, త్రిపుష్కర యోగం, అమృత సిద్ధి యోగం, రవి యోగం, ఆయుష్మాన్ యోగం వంటి శుభ యోగాలు కలగనున్నాయి. ఏప్రిల్ 22 శనివారం ఉదయం 7:50 గంటల నుంచి ఏప్రిల్ 23 ఆదివారం ఉదయం 7:48 గంటల వరకూ శుభ యోగాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు.