దేశంలో నంబర్ వన్ ప్రైవేట్ టెలికాం కంపెనీగా కొనసాగుతున్న రిలయన్స్ జియో తాజాగా సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. దీని వల్ల కొంతమంది ప్రత్యేక వినియోగదారులు రెండు రోజుల పాటు జియో ఉచిత సర్వీస్ ను పొందనున్నారు. ఫిబ్రవరి 5న రిలయన్స్ జియో నెట్‌వర్క్ ఒక్కసారిగా డౌన్ అయిన విషయం తెలిసిందే. ముంబై, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ ప్రాంతాలలో రిలయన్స్ జియో సేవలలో డౌన్ కావడంతో చాలామంది జియో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చింది.
జియో నెట్ వర్క్ డౌన్ అవ్వడం వల్ల చాలా మంది యూజర్లు అనేక ఇబ్బందులు పడ్డారు. కాల్స్ చేసేటప్పుడు “మీరు నెట్ వర్క్ లో రిజిస్టర్ కాలేదు” అనే సందేశాన్ని వచ్చినట్లు వినియోగదారులు ఫిర్యాదు చేశారు. దీంతో దాదాపు 8 గంటలకు పైగా జియో సేవలు దేశవ్యాప్తంగా పలు నగరాలలో నిలిచిపోయాయి. ఈ ఘటన వల్ల జియో కస్టమర్లు అసంతృప్తికి లోనయ్యారు. ఈ అసౌకర్యానికి చింతిస్తూ రిలయన్స్ జియో ఇప్పుడు ప్రభావిత వినియోగదారులకు రెండు రోజుల ఉచిత కాలింగ్, డేటా సేవలను అందిస్తుంది. ఈ ఉచిత సేవలు నెట్ వర్క్ సమస్యను ఎదుర్కున్న.. ఎంపికచేసిన ప్రతి యూజర్ కు సంబంధించిన ప్రస్తుత రీఛార్జ్ ప్యాక్ కు జోడించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. దీంతో ప్రస్తుత ప్యాక్ చెల్లుబాటు రెండు రోజుల పాటు పొడిగించనున్నారు. 2021లోనూ ఇలాంటి సమస్యే ఎదురయ్యింది. కానీ, అప్పుడు కూడా ఇలానే కొంతమందికి మాత్రమే నెట్ వర్క్ సమస్య తలెత్తగా.. వారికి రెండు రోజుల పాటు ఉచిత సేవలు అందించారు.