బంగారం, వెండి ధరలు ఈ ఏడాది ఆల్ టై రికార్డు హై స్థాయికి చేరుకున్నాయి. మార్కెట్ నిపుణులు అంచనా వేసినట్లే.. స్వచ్ఛమైన బంగారం తులం ధర 60 వేలకు చేరుకుంది. మరి ఈ ధర తగ్గుతుందో లేదో అర్థం కావడం లేదు. నేడు బంగారం ధర ఎలా ఉంది అంటే..
బంగారం, వెండి ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. తాజాగా పసిడి ధర ఈ ఏడాది ఆల్ టైం గరిష్టానికి చేరుకుంది. ఈ సమయంలో బంగారం కొనే ఆలోచన మానుకోవాలి అంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇక బంగారం, వెండి సహా పలు అలంకరణ లోహాల ధరలు మన దేశంలోనే కాక.. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ప్రతి రోజూ మారుతుంటాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల మీద ఈ లోహాల ధరల్లో మార్పులు ఆధారపడి ఉంటాయి. ఆ ప్రభావం మన దేశంలో కూడా ఉంటుంది. ఈ లోహాల ధరలు పెరుగుదలకు అనేక కారణాలున్నాయి. ఈ మధ్య కాలంలో అయితే రష్యా – ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం అనేక రంగాలపై పడింది. ఆ ప్రభావం వల్లే ఇటీవలి నెలల్లో ధరల్లో విపరీత మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంకా.. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు వద్ద బంగారం నిల్వలు, వడ్డీ రేట్ల పెరుగుదల, తగ్గుదల.. ఆయా లోహాలకు సంబంధించి వినియోగదారుల నుంచి వస్తున్న డిమాండ్‌లో హెచ్చుతగ్గులు వంటి ఎన్నో అంశాలు ఈ ఆభరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి.
దేశీయ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు గత 10 రోజులుగా పైకే చూస్తున్నాయి. ఇక నేడు హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. నేడు హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల ధర రూ.55,300 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. ఇక 24 క్యారెట్ బంగారం తులం ధర హైదరాబాద్‌లో రూ.60,320 మార్కు వద్ద ట్రేడవుతోంది. ఇక దేశ రాజదాని న్యూఢిల్లీలో విషయానికి వస్తే అక్కడ 22 క్యారెట్ బంగారం తులం రేటు రూ.55,450 వద్ద ఉండగా.. 24 క్యారెట్ మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.60,470 వద్ద కొనసాగుతోంది.
గత కొద్దిరోజులుగా వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. నేడు దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.72,100 గా ఉంది. గత 10 రోజుల వ్యవధిలో వెండి ధర కిలో మీద సుమారు రూ.7 వేల మేర పెరగడం గమనార్హం. హైదరాబాద్‌లోనూ వెండి ధర భారీగానే పెరిగింది. భాగ్య నగరంలో కూడా కిలో వెండి ధర గత పది రోజుల్లో 7 వేల రూపాయల మేర పెరిగింది. ఇక నేడు హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.74,400 వద్ద ఉంది. సాధారణంగా హైదరాబాద్‌తో చూస్తే దేశ రాజధాని న్యూఢిల్లీలో బంగారం ధర కాస్త ఎక్కువగా.. వెండి రేటు కాస్త తక్కువగా ఉంటుంది. స్థానిక పన్నులను బట్టి ఇవి మారుతుంటాయి.