సాధారణంగా బంగారం అంటే అందరికి ఇష్టం. మహిళలకు అయితే చాలా ఇష్టం. బంగారపు వస్తువులను కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే పసిడి ప్రియులు ఎలా పెరుగుతున్నారో, వాటి ధరలు కూడా అలానే పెరుగుతున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశంలో బంగారం ధరలు పెరగనున్నాయి. దేశానికి బంగారం దిగుమతులు పెరిగిపోతుండటం, అదే సమయంలో వాణిజ్య లోటు ఏర్పడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతిపై టాక్స్ పెంచింది. బంగారంపై దిగుమతి సుంకాన్ని 10.75 శాతం నుంచి 15 శాతానికి పెంచింది. ఈ మేరకు ఆర్థికమంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక నోటిఫికేషన్ జారీ చేసింది.
బంగారం దిగుమతులు ఒక్కారిగా పెరడంతో డిమాండ్ తగ్గించాలనే లక్ష్యంతో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. బంగారం దిగుమతులు పెరగడం కరెంట్ ఖాతా లోటుపై ఒత్తిడి పెంచుతోంది. దీంతో కస్టమ్స్ సుంకాన్ని పెంచివేసింది. గతంలో బంగారంపై ప్రైమరీ కస్టమ్స్ డ్యూటీ 7.5 శాతం ఉండగా, దానిని 12.5 శాతానికి పెరిగింది. ఈ పెరిగిన దానికి 2.5 శాతం వ్యవసాయ మౌలిక సదుపాయాల అభివృద్ధి పన్నుతో కలిపి బంగారంపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీ 15 శాతానికి చేరింది. దీనికి అదనంగా 3 శాతం జీఎస్టీ కూడా వర్తిస్తుంది. తాజా నిర్ణయంతో ఎంసీఎక్స్ మార్కెట్లో బంగారం ధరలు పుంజుకున్నాయి. అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకూ పడిపోతోంది. దేశంలో బంగారం వంటి వాటి దిగుమతులు పెరుగుతున్నాయి. ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి.
వీటితో పాటు వినియోగదారుల ఆందోళన నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. దిగుమతి సుంకం పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో దేశవ్యాప్తంగా బంగారం ధరలు మూడు శాతం పెరిగాయి. హోల్ సేలర్లతోపాటు రిటైల్ ఆభరణాల విక్రేతలు ధరలను పెంచేశారు. ఇది వినియోగదారులకు భారంగా మారిందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి.. బంగారం పై కేంద్రం తీసుకున్న ఈ తాజా నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.