ఒక్కరోజులో బంగారం భారీగా పెరిగిపోయింది. రికార్డు స్థాయిలో బంగారం ధర పలుకుతోంది. వెండి ధరలు కూడా బంగారం లానే పెరిగాయి. ఇవాళ హైదరాబాద్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
గత నెలలో తగ్గుతూ వచ్చిన బంగారం ధర ప్రస్తుతం రికార్డు స్థాయికి చేరుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా పెరిగిపోయింది. బంగారమే కాదు వెండి ధరలు కూడా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభ ప్రభావం కారణంగా అంతర్జాతీయంగా విలువైన లోహాలకు డిమాండ్ బాగా పెరిగింది. అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో ఒక ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర నిన్న ఒక్కరోజే 70 డాలర్లు పెరిగి రికార్డు సృష్టించింది. 1993 డాలర్లకు చేరుకుంది. ఔన్సు వెండి కూడా 23 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు స్పాట్ గోల్డ్ రూ. 1988.11 డాలర్లు ఉండగా.. ఔన్సు వెండి ధర రూ. 22.6 డాలర్లుగా ఉంది. అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభం రోజురోజుకు తీవ్రమవుతుండడంతో డాలర్ విలువ బలహీనపడుతోంది.
ఈ పరిణామం ఈక్విటీలతో పాటు ప్రభుత్వ బాండ్లు, ఇతర ఆర్ధిక సాధనాలపై ఒత్తిడి పెంచడంతో బంగారంలో పెట్టుబడులను పెడుతున్నారు. ఈ కారణంగా బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర శనివారం నాడు రూ. 1630 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల వద్ద రూ. 60,320 గా ఉంది. బంగారం 60 వేలు దాటడం ఇదే తొలిసారి. ఇక 22 క్యారెట్ల బంగారం కూడా రూ. 1500 మేర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం హైదరాబాద్ మార్కెట్ లో రూ. 55,300గా ఉంది. వెండి ధరలు కూడా అలానే ఉన్నాయి. కిలో వెండి ధర రూ. 1300 మేర పెరిగి.. రూ. 74,400 వద్ద కొనసాగుతోంది.
గడిచిన పది రోజుల్లో బంగారం ధర దాదాపు 5 వేల రూపాయలు పెరిగింది. హైదరాబాద్ మార్కెట్లో ఈ నెల 9న తులం బంగారం ధర రూ. 55,530 ఉండగా.. ఇవాళ రూ. 60,320కి చేరుకుంది. 2022 మార్చి 19న తులం బంగారం రూ. 51,600 ఉండగా.. ఏడాదిలో రూ. 8,720 పెరిగింది. వచ్చే వారంలో ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అమెరికా, యూరప్ బ్యాంకింగ్ వ్యవస్థల్లో కమ్ముకున్న సంక్షోభం ఇప్పట్లో తీరేలా లేదని నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు వచ్చే వారంలో అమెరికన్ సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను మరో 0.25 శాతం పెంచే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఔన్స్ గోల్డ్ 2 వేల డాలర్ల మార్క్ ను దాటి 2030 డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇక వెండి ధర 23 నుంచి 24 డాలర్ల వద్ద కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు.