బంగారం ధరలు పరిశీలిస్తే.. కొంత కాలం పాటు పెరుగుతాయి.. ఉన్నట్లుండి తగ్గిపోతాయి. అసలు దేని ఆధారంగా బంగారం ధర పెరగడం, తగ్గడం జరుగుంది.. ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి అంటే..
బంగారం.. భారతీయుల జీవితాల్లో భాగం అయ్యింది. చాలా మంది తమకు ఇష్టమైన వారిని ముద్దు పేర్లతో పిలవాలంటే.. బంగారం అనే పిలుస్తారు. అంతగా మన నిత్య జీవితంలో భాగం అయిపోయింది. బంగారం అంటే ఇష్టపడని ఆడవారు చాలా అరుదుగా ఉంటారు. సందర్భం దొరికిన ప్రతి సారి మహిళలు ఎంతో కొంత బంగారం కొనుగోలు చేయడానికి చూస్తారు. పండుగలు, వివాహాది శుభకార్యాల వేళ.. తప్పకుండా బంగారం కొనుగోలు చేస్తారు. అందుకే మన దగ్గర బంగారానికి డిమాండ్ ఎక్కువగా ఉండే పండుగలు, వివాహాల సీజన్‌లో.. ధర భారీగా పెరుగుతుంది. ఇక ఈ నెలలో బంగారం ధర ఆల్ టైం రికార్డ్ ధరకు చేరింది. తులం ఏకంగా 60 వేల రూపాయలు పలికింది. ఈ ధరలు ఇలానే కొనసాగుతాయి అని చాలా మంది భావించారు. ఎందుకంటే ఉగాది పండుగ, ఆ తర్వాత పెళ్లిల్ల సీజన్ వస్తుంది. ఆ సమయంలో బంగారానికి డిమాండ్ ఎక్కువ. కనుక ధర ఇదే విధంగా ఉండటం.. ఇంకా పెరగడం జరుగుతుంది అని అంతా భావించారు.
అయితే అందుకు విరుద్దంగా తెలుగు సంవత్సరాది అయిన ఉగాది పండుగ నుంచి బంగారం ధర భారీగా దిగి వస్తోంది. పండుగ మరుసటి రోజే అనగా గురువారం బంగారం ధర భారీగా పడిపోయింది. తులం మీద ఏకంగా 800 రూపాయలు తగ్గింది. 22 క్యారెట్, 24 క్యారెట్ బంగారం ధర తులం మీద 800 తగ్గి.. 60 వేల దిగువకు వచ్చింది. పండుగ మరుసటి రోజే పుత్తడి ధర ఇలా దిగి రావడం పట్ల పసిడి ప్రియులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేడు 22 క్యారెట్ తులం బంగారం ధర ఒక్కరోజే రూ.800 మేర పతనమై 10 గ్రాముల ధర రూ.54,200 మార్కుకు చేరింది. స్వచ్ఛమైన 24 క్యారెట్ పసిడి ధర రూ.870 పడిపోయి రూ.59,130 వద్ద కొనసాగుతోంది.
బంగారం ధరలు ఒక రోజు పెరుగుతాయి.. ఒక రోజు తగ్గుతాయి.. అసలు పసిడి ధర పెరగడం, తగ్గడం దేని మీద ఆధారపడి ఉంటుంది.. ఏ అంశాలు దీన్ని ప్రభావితం చేస్తాయి అంటే.. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు అంటున్నారు బులియన్ మార్కెట్ విశ్లేషకులు. ప్రస్తుతం అమెరికాను ఓ వైపు ద్రవ్యోల్భణం, మరోవైపు బ్యాంకింగ్ సంక్షోభం కుదిపేస్తున్నాయి. వీటి నుంచి బయటపడేందుకు వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లను పెంచుతున్నట్లు యూఎస్ ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ తెలిపారు. బ్యాంకింగ్ సంక్షోభం ఉన్నా వడ్డీ రేటును అధికం చేయడం, భవిష్యత్తులోనూ ఈ రేటు పెంపు ఉంటుందనే సంకేతాలు ఇవ్వడంతో.. స్టాక్ మార్కెట్లపై కాస్త ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక బంగారం ధరకు, ఈ వడ్డీ రేట్ల పెంపుకు మధ్య అవినాభావ సంబంధం ఉంది. అమెరికా డాలర్ అనేది రిజర్వ్ కరెన్సీ. బంగారాన్ని సాధారణంగా అమెరికా డాలర్లలో సూచిస్తారు. అందుకే డాలర్ విలువపైనే బంగారం ధరలు ప్రధానంగా ఆధారపడి ఉంటాయి. అయితే ఈ రెండింటిని ప్రభావితం చేసే ఇతర అంశాల్లో వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం, ద్రవ్య విధానం, సరఫరా, డిమాండ్ వంటివి ఉంటాయి. డాలర్ బలం అనేది వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది.
డాలర్ విలువ ఎలా పెరుగుతుంది అంటే.. ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడంతో. ఈ రేటు పెంచకపోతే.. అది డాలర్‌ను మరింత బలహీన పరిచే అవకాశాలు ఉన్నాయి. దీంతో బాండ్ ఈల్డ్స్, డాలర్ ఇండెక్స్ మరింత పతనం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు బంగారంపై పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపుతారు. దాంతో బంగారానికి డిమాండ్ పెరిగి.. ధర తగ్గుతుంది. ఒక వేళ డాలర్ విలువ పెరిగినట్లయితే.. ఇన్వెస్టర్లు బంగారం నుంచి బాండ్ ఈల్డ్స్, డాలర్ ఇండెక్స్‌లల్లో పెట్టుబడులు పెడతారు. అప్పుడు బంగారం విలువ తగ్గుతుంది. ధర కూడా తగ్గుతుంది. ఇక తాజాగా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడంతో.. బంగారం ధర తగ్గింది.