బంగారం ధర ఒక్క రోజే 800 రూపాయల మేర తగ్గడంతో.. హమ్మయ్యా అనుకున్నారు. పర్లేదు.. కొన్ని రోజుల పాటు పసిడి ధర ఇలానే దిగి వస్తే.. పెళ్లిల్ల సీజన్‌లో బంగారం కొనుగోలు చేయవచ్చని భావించారు. అయితే ఆ ఆనందం పట్టుమని ఒక్క రోజు కూడా నిలవలేదు. నిన్న తగ్గినట్లే తగ్గిన పసిడి ధర.. నేడు భారీగా పెరిగింది. ఆ వివరాలు..
బంగారం ధర సామాన్యులతో ఆడుకుంటుంది. గురువారం నాడు తులం మీద ఏకంగా 800 రూపాయలు తగ్గి.. భారీ ఊరట కలిగించింది. అయితే ఆ ఆనందం ఒక్క రోజు కూడా నిలవలేదు. నిన్న తులం మీద భారీగా తగ్గిన పసిడి ధర.. నేడు అదే స్థాయిలో పెరిగింది. దాంతో పసిడి ప్రియులతో పాటు.. సామాన్యులు కూడా అసలు బంగారం కొనాలా వద్దా అని ఆలోచిస్తున్నారు. సాధారణంగా అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే.. బంగారం, వెండి ధరలు దిగి వస్తాయి. గురువారం ఫెడ్ వడ్డీ రేట్లు పెంచింది. అయితే ఈ పెంపు కేవలం ఒక్కరోజుకే పరిమితమవడం గమనార్హం. ఇదే సమయంలో ఫెడ్.. భవిష్యత్తులో వడ్డీ రేట్ల పెంపును నిలిపివేసే యోచనలో ఉన్నట్లు వార్తలు రావడంతో.. అక్కడి డాలర్ విలువ పడిపోయింది. దాంతో బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి.
ఇక దేశీయంగా, అంతర్జాతీయంగా బంగారం ధర ఎంత పెరిగింది.. తులం ధర ఎంత ఉంది అంటే.. శుక్రవారం హైదరాబాద్‌లో 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర ఏకంగా రూ. 600 మేర పెరిగి రూ.54,800 మార్కుకు చేరింది. మరోసారి ఆల్ టైం హైకి చేరువలోకి వచ్చింది. గురువారం రోజు 800 రూపాయలు పడిపోయిన బంగారం ధర.. ఒక్క రోజు వ్యవధిలోనే ఏకంగా 600 రూపాయలు పెరగడం కలవరపెడుతోంది. అంతేకాక స్వచ్ఛమైన 24 క్యారెట్ పసిడి ధర.. తులం మీద రూ.650 మేర పెరిగి రూ.59,780కి చేరింది. 4 రోజుల కిందట బంగారం ధర 10 గ్రాములకు రూ.60 వేల మార్కును తాకిన సంగతి తెలిసిందే.
ఇక న్యూఢిల్లీలో కూడా బంగారం ధర భారీగా పెరిగింది. హస్తినలో 22 క్యారెట్ బంగారం తులం మీద రూ.600 పెరిగి రూ.54,950 వద్ద ఉండగా.. 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల మీద రూ.650 మేర పుంజుకొని రూ.59,930 వద్దకు చేరింది. ఇది ఇలా ఉండగా వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. నేడు హైదరాబాద్‌లో సిల్వర్ ధర కేజీ మీద ఏకంగా 1400 రూపాయలు పెరిగి భారీ షాకిచ్చింది. నేడు భాగ్యనగరంలో కిలో వెండి ధర రూ.75,400 మార్కును చేరింది.
అటు ఢిల్లీలో కూడా వెండి ధర బాగానే పెరిగింది. కేజీ వెండి ధర రూ.1000 మేర పెరిగి ప్రస్తుతం కిలో రూ.72,600కు చేరింది. ఇప్పుడు అమెరికాలో బ్యాంకింగ్ సంక్షోభానికి తోడు మార్కెట్లు పడిపోతుండటం, ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో.. ఫెడ్ వడ్డీ రేట్ల పెంపును భవిష్యత్తులో నిలిపివేసే యోచనలో ఉండటం వంటి పరిమాణాల నేపథ్యంలో బంగారం ధర ఎలా ఉంటుందో అంచాన వేయలేకపోతున్నారు.