ఒకరోజు ధర పెరిగింది అంటారు.. మరో రోజు భారీగా పడిపోయింది అంటారు. అసలు బంగారం ధరలు కొన్నాళ్ల పాటు స్థిరంగా ఉండవా అని పసిడి ప్రియులు తెగ బాధపడుతున్నారు. బంగారం ధరలో హెచ్చుతగ్గులు సర్వ సాధారణం. అయితే గంత కొంతకాలంగా బంగారం ధర పెరుగుతూనే ఉంది. గత పది రోజుల్లో ఏకంగా 3 వేల రూపాయలు పెరిగింది. నేడు బంగారం తులం మీద ఎంత పెరిగింది అంటే..
బంగారంతో భారతీయులకు విడదీయరాని అనుబంధం ఉంది. బంగారం అంటే మనవాళ్లకు సెంటిమెంట్ ఎక్కువ. అందుకే చాలా పండుగలకు బంగారం కొనుగోలు చేస్తారు. ఎంత ఎక్కువ బంగారం ఉంటే అంత గొప్పగా భావిస్తారు భారతీయ మహళలు. ఇక పెళ్లిల్ల వంటి శుభాకార్యాల వేళ భారీగా బంగారం కొనుగోలు చేస్తారు. చాలా మంది తల్లిదండ్రులు ఆడ పిల్ల పుట్టిందంటే చాలు.. కుమార్తె బాల్యం నుంచే బంగారం కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. ప్రతి ఏటా కొంత బంగారం కొంటే.. కుమార్తె వివాహ సమయానికి అక్కరకు వస్తుంది అని భావిస్తారు. వివాహ వేళ ఒకేసారి కొనాలన్నా ఖర్చు ఎక్కువ. అందుకే ముందు నుంచే బంగారం కొనుగోలు చేస్తారు. అయితే గత కొంత కాలంగా బంగారం ధర చుక్కలను తాకుతోంది. తులం ధర 50 వేల రూపాయల పైచిలుకు ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధరలో హెచ్చుతగ్గులు నమోదవుతూ వస్తున్నాయి.
ఇక ఫిబ్రవరి చివరి వారంలో, మార్చి తొలి వారంలో భారీగా పడిపోయిన బంగారం ధర ఇప్పుడు మళ్లీ పెరుగుతోంది. అంతర్జాతీయంగా వెలువడుతున్న ప్రతికూల సంకేతాలే దీనికి కారణంగా చెప్పొచ్చు. వారం రోజుల వ్యవధిలోనే ఏకంగా తులం బంగారం ధర రూ.3000 వరకు పుంజుకుంది. దాంతో చాలా మంది ఇప్పుడు బంగారం కొనాలంటే భయపడుతున్నారు. అమెరికాలో బ్యాంక్‌లు దివాళ తీయడం, ఫెడ్ వడ్డీ రెట్ల పెంపు ఆధారంగా బంగారం ధరంలో హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. మరి నేడు అంతర్జాతీయం మార్కెట్‌తో పాటు.. దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
నేడు అనగా మార్చి 18న అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ బంగారం ధర ఔన్సుకు 1989 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. బంగారంతో పాటే స్పాట్ సిల్వర్ ధర కూడా 22.65 డాలర్లకు చేరింది. కొద్దిరోజుల కిందట ఇవి వరుసగా 1800 డాలర్లు, 19 డాలర్లకు పడిపోవడంతో.. పసిడి ప్రియులు సంతోషపడ్డారు. ఇక నేడు డాలర్‌తో చూస్తే రూపాయి మారకం విలువ స్థిరంగా కొనసాగుతోంది. ఇక నేడు హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.53,800గా ఉంది. నేడు ఒక్క రోజే 22 క్యారెట్ బంగారం తులం మీద ఏకంగా రూ.250 పెరిగింది. అలానే 24 క్యారెట్ బంగారం 10 గ్రాముల మీద రూ.270 ఎగబాకి రూ.58,690కి చేరింది. పది రోజుల క్రితం అనగా మార్చి 9న హైదరాబాద్‌లో 10 గ్రాముల గోల్డ్ రూ.50,900 వద్ద ఉండగా.. ఇంతలోనే ఏకంగా రూ.3000 పుంజుకుంది. ఇక నేడు ఢిల్లీలో కూడా గోల్డ్ రేటు 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర రూ.250 పెరిగి రూ.53,950కి చేరింది. ఇక 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాముల మీద రూ.270 పెరిగి రూ.58,840కి చేరింది.
ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. గత వారం రోజులుగా దేశంలో వెండి ధర పెరుగుతూనే ఉంది. పది రోజుల వ్యవధిలో వెండి ధర కిలో మీద ఏకంగా 4000 రూపాయలు పెరిగింది. ఇక నేడు ఢిల్లీలో కిలో వెండి ధర మీద 600 పెరిగి.. రూ.69,800 ఉంది. ఇక హైదరాబాద్‌లో వారం వ్యవధిలో సిల్వర్ ధర కిలో మీద ఏకంగా రూ.6 వేల వరకు పెరిగింది. నేడు హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.400 పెరిగి రూ.73,100 దగ్గర ఉంది. ఇక యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు పెంచితే డాలర్ పుంజుకొని.. బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు. ఫెడ్ సమావేశం మార్చి 21,22 తేదీల్లో జరగనుంది. నాడు తీసుకునే నిర్ణయాల మీదనే పసిడి ధరలు ఆధారపడి ఉన్నాయి.