బంగారం ధర గత కొన్ని రోజులుగా దూసుకుపోతుంది. ఈ ఏడాది ఆల్ టైం రికార్డు స్థాయికి చేరుకుంది. పసిడి కొనాలనుకునే వారు పెరుగుతున్న ధర చూసి.. బంగారం కొనే ఆలోచన వాయిదా వేశారు. అయితే నేడు బంగారం ధర భారీగా పతనమైంది. తులం మీద ఎంత తగ్గింది అంటే...
గత 10-15 రోజుల వ్యవధిలో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలకు నేడు బ్రేక్ పడింది. అడ్డు అదుపు లేకుండా దూసుకుపోతున్న పసిడి ధర.. గురువారం దిగి వచ్చింది. ఒక్కరోజే భారీగా పతనం అయ్యింది. నిన్నటి వరకు తులం బంగారం 60 వేలకు చేరగా.. నేడు భారీగా పతనం అవ్వడంతో.. 60 వేల దిగువకు దిగి వచ్చింది. బంగారం దారిలోనే వెండి కూడా భారీగా పతనం అయ్యింది. అయితే మరి పసిడి ధర పతనం ఇలానే కొనసాగుతుందా.. లేక.. మళ్లీ పెరుగుతుందా అంటే.. కొన్ని రోజుల వరకు ఇదే తీరు కొనసాగవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచాన వేస్తున్నారు. కారణం.. అమెరికా వడ్డీ రేట్లను పెంచింది. సాధారణంగా.. ఇలా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచినప్పుడు.. డాలర్ విలువ పుంజుకుంటుంది. దాంతో బాండ్ ఈల్డ్స్‌కు గిరాకీ దారుణంగా పడిపోతుంది. అమెరికాలో ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో సంక్షోభం నెలకొన్నప్పటికీ ఫెడ్ మరోసారి 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచింది. దీంతో ఇక అంతర్జాతీయ మార్కెట్‌తో పాటు దేశంలో కూడా బంగారం ధర భారీగా పడిపోయింది. మరి నేడు బంగారం ధర ఎంత తగ్గింది.. తులం పసిడి ధర ఎంత ఉంది అంటే..
ఇక నేడు బంగారం ధర తులం మీద ఏకంగా 800 రూపాయలు తగ్గి.. పసిడి ప్రియులకు ఊరటనిచ్చింది. ఇక నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్ తులం బంగారం ధర ఒక్కరోజే రూ.800 మేర పతనమై 10 గ్రాముల ధర రూ.54,200 మార్కుకు చేరింది. కొన్ని రోజుల క్రితం 22 క్యారెట్ బంగారం ధర భారీగా పెరిగి.. రూ.55,300 వద్ద జీవనకాల గరిష్టానికి చేరిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ధర దిగి రావడం ఊరటనిస్తోంది. మరోవైపు 24 క్యారెట్ బంగారం ధర కూడా పడిపోయింది. నేడు తాజాగా స్వచ్ఛమైన 24 క్యారెట్ పసిధ ధర రూ.870 పడిపోయి రూ.59,130 వద్ద కొనసాగుతోంది. మూడు రోజుల క్రితం మేలిమి బంగారం తులం ధర రూ.60,320కు చేరి.. రికార్డు స్థాయిలో ఆల్ టైం గరిష్టానికి చేరంది.
హైదరాబాద్‌తో పాటు దేశ రాజాధిన న్యూఢిల్లీలో కూడా బంగారం ధర దిగి వచ్చింది. హస్తినలో నేడు 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.800 పతనమై రూ.54,350కి చేరింది. అలానే 24 క్యారెట్ మేలిమి బంగారం ధర కూడా రూ.870 పతనమై.. రూ.59,280 మార్కుకు చేరింది. బంగారం ధరలు దిగి వస్తుండటంతో.. వెండి కూడా అదే బాటలో పయనించింది. నేడు వెండి ధరలు కూడా తగ్గాయి. ఢిల్లీలో కిలో వెండి ధర తాజాగా రూ.500 పడిపోయి రూ.71,600 మార్కును తాకింది. హైదరాబాద్‌లో మాత్రం కేజీపై రూ.700 తగ్గి ప్రస్తుతం విలువ రూ.74 వేల వద్ద స్థిరంగా ఉంది.
ఇక అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచిన నేపథ్యంలో అంతర్జాతీయంగా కూడా బంగారం, వెండి ధరలు పడిపోయాయి. అక్కడ స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1970.40 డాలర్ల వద్ద కొనసాగుతుంది. అలానే స్పాట్ సిల్వర్ ధర కూడా ఔన్సుకు 22.80 డాలర్లకు పడిపోయింది. ఇదే సమయంలో అక్కడి మార్కెట్లు పడిపోయాయి.