మీరు ఏ ఊర్లో ఉన్నా గానీ, మీ సంపాదన తక్కువైనా గానీ స్థలం ఉన్నా గానీ కొత్తగా స్థలం కొన్నా గానీ ఇల్లు కట్టాలంటే కనీసం రూ. 20 లక్షలు అవుతుంది. కానీ 5 లక్షల్లో మీరు ఒక ఇల్లు సొంతం చేసుకోవచ్చు. అదెలాగో మీరే చూడండి.
హైదరాబాద్ లో హైటెక్ సిటీ, మాదాపూర్ లాంటి ఏరియాలకు 15 నుంచి 20 కి.మీ. దూరంలో ఉన్న ప్రాంతాల్లో స్థలం రేట్లు చాలా తక్కువ ఉంటాయి. ఈ ఏరియాల్లో చదరపు అడుగు 2 వేలు, 3 వేల నుంచి ఉంటాయి. ఒక చిన్న కుటుంబానికి 400 నుంచి 500 చదరపు అడుగుల ఇల్లు అయితే సరిపోతుంది. లేదు విశాలంగా కావాలనుకుంటే కనుక 1000 చదరపు అడుగుల ఇల్లు సరిపోతుంది. చదరపు అడుగు 3 వేల చొప్పున చూసుకుంటే 400 చదరపు అడుగుల్లో ఇల్లు కావాలంటే స్థలానికి ప్రత్యేకంగా 12 లక్షలు అవుతుంది. అదే 500 చదరపు అడుగుల్లో కావాలనుకుంటే 15 లక్షలు అవుతుంది. 1000 చదరపు అడుగుల్లో కావాలనుకుంటే 30 లక్షలు అవుతుంది. మీరు ఎంత పెట్టుకోగలిగితే అంతా పెట్టుకోవచ్చు. కానీ ఇంటికి మాత్రం 5 లక్షల కంటే ఎక్కువ పెట్టకండి.
ఎందుకంటే స్థలానికి 20, 30 లక్షలు పెట్టి మరలా ఇంటికి ఇంకో 20 లక్షలు పెట్టి ఏం తింటారు, ఎలా బతుకుతారు? అదే కంటైనర్ హోమ్ కాన్సెప్ట్ తో 5 లక్షల్లో ఇల్లు అయిపోతుంది. స్థలానికి మాత్రం పెట్టుబడి పెట్టుకుంటే చాలు. ఈ కంటైనర్ హోమ్స్ అనేవి ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అవుతున్నాయి. రైతులు ఈ కంటైనర్ హోమ్స్ ని ఫార్మ్ హౌజ్ లుగా వాడుతున్నారు. కొంతమంది ఆఫీస్ క్యాబిన్స్ గా, కార్యాలయాలుగా వాడుతున్నారు. వీటితో ఉన్న ప్రయోజనం ఏంటంటే.. ఒక చోట నుంచి మరొక చోటికి తీసుకెళ్లవచ్చు. సిమెంట్, ఇసుక, కాంక్రీట్ ధరలు పెరిగిపోయాయి. ఈ ధరలతో ఇల్లు కట్టాలంటే కష్టమే. అదే కంటైనర్ హోమ్స్ ఐతే తక్కువ ధరకే వస్తాయి.
హైదరాబాద్ లో కంటైనర్ హోమ్స్ ని తయారు చేసే కంపెనీలు ఉన్నాయి. కంపెనీలను బట్టి చదరపు అడుగుకి రూ. 800, రూ. 900, రూ. 1000 తీసుకుంటున్నారు. సాధారణ కంటైనర్ వచ్చేసి 40 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పు, 8 అడుగుల పొడవుతో వస్తాయి. దాదాపు మీకు 300 చదరపు అడుగుల ఖాళీ అనేది ఉంటుంది. చదరపు అడుగుకి రూ. 800 చొప్పున 300 చదరపు అడుగుల ఇంటికి మీకు అయ్యే ఖర్చు రూ. 2,40,000. అదే రూ. 900 చొప్పున ఐతే రూ. 2,70,000 అవుతుంది. రూ. 1000 చొప్పున ఐతే రూ. 3 లక్షలు అవుతుంది. 1000 చదరపు అడుగుల్లో విశాలంగా కావాలనుకుంటే కనుక రూ. 4 లక్షల నుంచి రూ. 5 లక్షలు ఖర్చు అవుతుంది.
ఇక్కడ మీరు ఎంత ఖర్చు తగ్గించుకుంటే అంత మంచిది. ఎందుకంటే మీరు ఇంటి నిర్మాణానికి పెట్టే ఖర్చుని వేరే వాటి మీద అంటే స్థలాల మీద పెట్టుబడి పెడితే మీకు ఆల్రెడీ ఉన్న స్థలం, అందులో పోర్టబుల్ హోమ్, అదనంగా స్థలం ఉంటుంది. ఈ స్థలం ధర పెరిగాక అమ్మితే మీకు లాభాలు వస్తాయి కాబట్టి ఆ లాభంతో మీరు కొత్తగా ఇల్లు కట్టుకోవచ్చు. ఈ కంటైనర్ హోమ్ లో నివసిస్తే మీకు అద్దె ఉండదు. ఆ అమౌంట్ ని కూడా వేరే ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయచ్చు. ఇలా మీరు పోగేసిన డబ్బుతో ఐదేళ్ల తర్వాత లేదా పదేళ్ల తర్వాత నచ్చినట్టు ఇల్లు కట్టుకోవచ్చు. అసలు ఈ కంటైనర్ హోమ్స్ వాడితే 25 ఏళ్ల వరకూ మీకు ఇల్లు కట్టుకునే అవసరమే రాదు. ఎందుకంటే ఈ కంటైనర్ హోమ్స్ స్టీల్, మైల్డ్ స్టీల్, జీఐ మెటీరియల్స్ తో చేయబడతాయి. వీటి మన్నిక ఎక్కువ కాలం ఉంటుంది. పైగా పర్యావరణ అనుకూలంగా ఉంటాయి. ఫైర్ ప్రూఫ్, ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్ తో వస్తాయి.
కాబట్టి ఈ కంటైనర్ హోమ్స్ అనేవి సామాన్యులకు చాలా అనుకూలమైనవి. ఫ్యాబ్రికేటెడ్ ఉడెన్ హౌజ్ లు కూడా ఉన్నాయి. వీటికి చదరపు అడుగు రూ. 1500 అవుతుంది. ఫ్లోరింగ్ కి కానీ, పైప్ లైన్ గానీ, కరెంట్ వైరింగ్ కి గానీ ప్రత్యేకించి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. బాత్రూం, కిచెన్, హాల్, బెడ్ రూమ్ వస్తాయి. ఎలాగోలా స్థలం కొనుక్కుని.. కంటైనర్ హోమ్ ని తెచ్చుకుంటే 20 లక్షలు ఆదా చేసుకున్నట్టే. స్థలం ఒకరే కొనలేకపోతే ఇద్దరు భాగస్వాములు కలిసి కొనుక్కోవచ్చు. కింద ఒకరు, పైన ఒకరు రెండు కంటైనర్ హోమ్స్ లో ఉండవచ్చు. అప్పుడు మీకు స్థలానికి, ఇంటికి అయ్యే ఖర్చు 10 లక్షల నుంచి 20 లక్షలు మాత్రమే. సొంతింటి కల ఈ విధంగా నెరవేర్చుకోవచ్చు. కొన్నాళ్ళు ఇష్టంగా రాజీ పడితే భవిష్యత్తులో బాగా సంపాదించుకునే అవకాశం ఉంటుంది.