రోజూ రూ. 30 పొదుపు చేయడం ద్వారా మీ చేతికి రూ. 5 లక్షలు వస్తాయి. ఇంకొంచెం ఎక్కువ పొదుపు చేస్తే గనుక రూ. 10 నుంచి రూ. 20 లక్షలు వస్తాయి.
ఒక మనిషి బాడీ పెరగాలంటే నిన్న తిన్న దాని కంటే ఇవాళ రెండు, మూడు ముద్దలు ఎక్కువ తినాలి. అలా కొంచెం కొంచెం తింటూ ఉంటే బక్క పలుచని శరీరం కాస్తా బరువు పెరుగుతుంది. అలానే బక్కగా ఉన్న మన ఆర్థిక వ్యవస్థ పెరగాలంటే.. పెట్టుబడులు, పొదుపు అనేవి ముఖ్యం. ఖర్చులు ఎప్పుడూ ఉండేవే. కానీ ఎంత మిగులుతుందన్నదే ముఖ్యం. కొందరు మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ అని రకరకాల వాటిలో పెట్టుబడులు పెడుతూ డబ్బుని రెట్టింపు చేసుకుంటూ ఉంటారు. అయితే వీటిలో రిస్క్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి చాలా మంది వీటి జోలికి పోరు. రిస్క్ లేకుండా నెలకు కొంత పెట్టుబడి పెడితే మంచి లాభాలు వచ్చే ప్రభుత్వ పథకాల్లో పెట్టుబడి పెడుతుంటారు. అలాంటి వాటిలో పీపీఎఫ్ ఒకటి. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం ఒకటి. ఈ పథకంలో మీరు డబ్బు పొదుపు చేయడం ద్వారా మంచి రాబడి పొందవచ్చు. పైగా రిస్క్ కూడా ఉండదు. పొదుపు చేసినట్టు ఉంటుంది, పెట్టుబడి పెట్టినట్టూ ఉంటుంది.
పోస్టాఫీసులో అందుబాటులో ఉన్న ఈ పీపీఎఫ్ పథకం మెచ్యూరిటీ కాలం 15 ఏళ్ళు ఉంటుంది. మెచ్యూరిటీ కాలం ముగిసిన ప్రతి సారీ ఐదేళ్ల చొప్పున పొడిగించుకుంటూ వెళ్ళచ్చు. ప్రస్తుతం ఈ పథకం కింద 7.1 శాతం వడ్డీ అందిస్తున్నారు. ఈ వడ్డీ అనేది ప్రతీ మూడు నెలలకొకసారి మారుతుంటుంది. స్థిరంగా ఉండచ్చు, పెరగవచ్చు, తగ్గవచ్చు. ఈ పథకంలో పొదుపు చేయడం వల్ల ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. పొదుపు చేసిన డబ్బులపై గానీ, వడ్డీపై గానీ, విత్ డ్రా చేసుకునే డబ్బుపై గానీ ఎలాంటి పన్ను ఉండదు. ప్రతి ఏటా రూ. లక్షన్నర వరకూ పన్ను ప్రయోజనాలు పొందవచ్చు. మీరు ఏడాదికి రూ. 10 వేలు పీపీఎఫ్ పథకంలో పొదుపు చేస్తున్నట్లైతే.. 20 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ ముగిసిన తర్వాత మీ చేతికి రూ. 4.5 లక్షలు వస్తాయి.
7.1 శాతం వడ్డీ రేటు ఉంటే ఈ మొత్తం వస్తుంది. ఏటా రూ. 10 వేల చొప్పున 20 ఏళ్లకు మీరు పొదుపు చేసింది రూ. 2 లక్షలైతే.. మీ చేతికి అదనంగా 2.45 లక్షలు వస్తాయి. ఏటా రూ. 10 వేలు అంటే నెలకు రూ. 833, రోజుకు రూ. 27 అయ్యింది. అదే రోజుకు రూ. 30 అంటే నెలకు రూ. 900 నుంచి రూ. 1000 చొప్పున 20 ఏళ్ల మెచ్యూరిటీ పీరియడ్ పెట్టుకుని.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీంలో పొదుపు చేశారనుకుందాం. మెచ్యూరిటీ పీరియడ్ ముగిసిన తర్వాత మీ చేతికి రూ. 5.3 లక్షల వరకూ వస్తాయి. ఈ మధ్య గ్యాప్ లో వడ్డీ రేటు పెరిగితే మీ డబ్బు పెరుగుతుంది. ఇలా రోజుకు ఒక రూ. 30 పక్కన పెడితే.. 20 ఏళ్లలో అదనంగా రెండున్నర లక్షలు వస్తాయి. రూ. 100 పెట్టుకుంటే సుమారు రూ. 10 లక్షలు వస్తాయి. ఈ పథకంలో ఏడాదిలో కనీసం రూ. 500 నుంచి లక్ష 50 వేల వరకూ పొదుపు చేసుకోవచ్చు.