సెలబ్రిటీల ఇంట వివాహ వేడుక అంటే ఎంత ఘనంగా, అంగరంగ వైభవంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కోట్లు ఖర్చు చేసి.. అట్టహసంగా వేడుకలు నిర్వహిస్తారు. అయితే ఇందుకు భిన్నంగా అత్యంత నిరాడంబరంగా.. తన కుమారుడి నిశ్చితార్థం వేడుక నిర్వహించారు గౌతమ్ అదానీ. ఆ వివారాలు..
గత కొంత కాలంగా ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ పేరు దేశంలో మారు మోగిపోతుంది. హిండెన్‌బర్గ్ నివేదిక ముందు వరకు.. అదానీ సంపద అమాంతం పెరిగి.. ప్రపంచ మిలియనీర్ల జాబితాలో టాప్ టెన్‌లో నిలిచాడు. కానీ ఎప్పుడైతే అదానీ గ్రూప్ కంపెనీలపై అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్ బర్గ్ నివేదిక తీవ్ర ఆరోపణలు చేసిందో.. నాటి నుంచి అదానీ పేరు పార్లమెంట్‌లో కూడా మారు మోగిపోతుంది. ఇక జనవరి 24న ఈ నివేదిక వెలువడగా.. అప్పటి నుంచి అదానీ గ్రూప్ కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. మార్కెట్లో అదానీ కంపెనీల షేర్ విలువ తగ్గిపోయింది. ఫలితంగా గౌతమ్ అదానీ వ్యక్తిగత సంపద కూడా భారీగా పడిపోయింది. ఈ క్రమంలో ప్రపంచ కుబేరుల జాబితాలో 3 వ స్థానం నుంచి 30వ స్థానానికి పడిపోయారు గౌతమ్ అదానీ. ప్రస్తుతం వ్యాపారపరంగా తీవ్ర విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న అదానీ ఇంటి తాజాగా పెళ్లి బాజాలు మోగాయి. ఆ వివరాలు..
అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. త్వరలోనే వారి ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి. అదానీ చిన్న కుమారుడు జీత్ అదానీకి వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో అతికొద్ది మంది బంధువుల మధ్య మార్చి 12న అహ్మదాబాద్‌లో.. జీత్ అదానీ నిశ్చితార్థం జరిగింది. వధువు పేరు దివా జైమిన్ షా. జీత్-దివాల నిశ్చితార్థం.. అతి కొద్ది మంది బంధువుల సమక్షంలో.. అత్యంత నిరాడంబరంగా జరిగింది. ప్రస్తుతం జీత్ అదానీ నిశ్చితార్థానికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే వివాహ తేదీ ఎప్పుడు అనే వివరాలు తెలియలేదు.
గౌతమ్ అదానీ కాబోయే కోడలు.. దివా జైమిన్ షాది కూడా వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబమే. ఆమె గుజరాత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె. దివా తండ్రికి సీ దినేశ్ అండ్ కో ప్రైవేట్ లిమిటెడ్ అనే డైమండ్ కంపెనీ ఉంది. ప్రస్తుతం అది ముంబై, సూరత్ వెలుపల కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఇక జీత్-దివాల వివాహం ఎప్పుడు అనేది తెలియకపోయినా ఈ ఏడాది చివరి నాటికి వీరి వివాహం జరగనుంది అని సమాచారం.
ఇక జీత్ అదానీ విషయానికి వస్తే.. ఆయన గౌతమ్ అదానీ చిన్న కుమారుడు. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా నుంచి ఇంజినీరింగ్ అండ్ అప్లైడ్ సైన్సెస్‌లో డిగ్రీ పట్టా పొందాడు జీత్ అదానీ. 2019లో అదానీ గ్రూప్‌లో సీఎఫ్ఓగా చేరారు. ప్రస్తుతం జీత్.. అదానీ గ్రూప్ సంస్థల ఉపాధ్యాక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అదానీ ఎయిర్ పోర్ట్ వ్యాపారంతో పాటు, అదానీ డిజిటల్ ల్యాబ్స్, స్ట్రాటజిక్ ఫైనాన్స్, క్యాపిటల్ మార్కెట్, గవర్నమెంట్ పాలసీ వంటి బాధ్యతలను చూస్తున్నారు జీత్ అదానీ.
కుటుంబ వ్యాపారంలో కీలక పాత్ర పోషించడంతో పాటు జీత్ అదానీ మంచి పైలట్ కూడా. ప్రపంచ పైలట్ల దినోత్సవం రోజున ఓ ఛార్టర్డ్ ఫ్లైట్ నడుపుతున్న ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశాడే జీత్. ఇక అదానీ పెద్ద కుమారుడు కరణ్ అదానీ.. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ సీఈఓగా వ్యవహరిస్తున్నాడు.