చదువుకున్న వాళ్లందరికీ ఉద్యోగాలు చేయాలి అని ఉండదు. కొందరికి సొంతకాళ్లపై నిలబడాలి అని ఉంటుంది. ఇంకొందరు చిన్నదైనా పర్లేదు సొంతంగా వ్యాపారం చేసుకుని లైఫ్ ఎదగాలని భావిస్తుంటారు. వెనుకటి రోజుల్లో అంటే ఇలాంటి ప్రయత్నాలు అసాధ్యంగా ఉండేవి. కానీ, ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఎంఎస్‌ఎంఈ స్కీమ్లు, రాష్ట్ర ప్రభుత్వాల సాయాలు చాలానే ఉన్నాయి. గతంలో మీరు వ్యాపారం ప్రారంభించిన తర్వాత దానిని షూరిటీగా పెట్టుకుని బ్యాంకులు రుణాలు ఇచ్చేవి. కానీ, ఇప్పుడు మీరు వ్యాపారం ప్రారంభించేందుకే రుణాలు ఇస్తున్నారు. అంతేకాకుండా చాలా వ్యాపారాలకు ప్రభుత్వాలు సబ్సిడీ కూడా ఇస్తున్నాయి. అయితే మీకు వ్యాపారం చేయాలి, సొంతకాళ్లపై నిలబడాలి అనే కోరిక ఉండాలి. అయితే అలా తక్కువ పెట్టుబడితో చేసే బిజినెస్ ఐడియా ఒకటి చూద్దాం.
ఇంట్లో ఉంటూనే తక్కువ పెట్టుబడితో ప్రారంభించే వ్యాపారాల్లో అప్పడా(పాపడ్)ల తయారీని ప్రధమంగా చెప్పుకోవచ్చు. ఈ మాట వినగానే చాలామంది అప్పడాలు అమ్ముకోమంటారా అని హేళన చేయచ్చు. అందుకే అలాంటి వారి కోసం ముందుగా ఒక చిన్న సక్సెస్ స్టోరీ చెప్పుకుందాం. లిజ్జత్ పాపడ్ అనే బ్రాండ్ పేరు అందరూ కాకపోయినా కొంతమంది వినే ఉంటారు. ఇప్పటికీ ఒక్క ఇండియాలోనే కాకుండా అమెరికా, సింగపూర్ వంటి దేశాల్లో పాపులర్ అనే చెప్పాలి. అలాంటి ఒక బ్రాండ్‌ని ఏడుగురు మహిళలు తమ ఇంటి మిద్దె మీద ప్రారంభించారు. ఆ మహిళలు చిన్న మొత్తం పెట్టుబడితో 1959లో ప్రారంభించారు.
మొదటిరోజు 4 ప్యాకెట్లు అమ్మగా.. మొదటి సంవత్సరం రూ.6 వేలకు వ్యాపారం చేశారు. 2019 సంవత్సరంలో లిజ్జత్ బ్రాండ్ టర్నోవర్ రూ.1,600 కోట్లు. ఒక సహకార సంఘంగా ఎదిగిన వారు.. 2021కి ఆ సంఘం కో ఓనర్స్ సంఖ్య 45వేలకు చేరింది. అలాగే డిటర్జెంట్, రోటీలు తయారు చేయడం కూడా ప్రారంభించారు. ఆ సంస్థలో ఆడవాళ్లు వారు తయారు చేసే అప్పడాలను బట్టి, వారి పొజిషన్‌ని బట్టి ఆదాయం పొందుతారు. కొందరు వారి భర్తలకన్నా కూడా ఎక్కువే సంపాదిస్తూ ఉంటారట. లిజ్జత్ పాపడ్‌ని ప్రారంభించిన జశ్వంతీబెన్ జమ్నదాస్ పోపట్‌కు 2021 నవంబర్‌లో పద్మశ్రీని కూడా బహూకరించారు.
వ్యాపారంలో ఏదీ చిన్నది కాదు. పెట్టుబడి, ప్రణాళిక, కృషి ఉంటే తప్పకుండా సక్సెస్ అవుతారు. తక్కువ పెట్టుబడితో ప్రారంభించే వ్యాపార్లో అప్పడాల తయారీ చక్కని ఆలోచన. అయితే ముందుగా ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలి అంటే మీకు సరైన రెసిపీ తెలిసుండాలి. అప్పడాలను రుచికరంగా తయారు చేయడం నేర్చుకోవాలి. అలాగే మీకంటూ ఒక ప్రత్యేకమైన రెసిపీ ఉంటే ఇంకా మంచిది. అలాగే మీరు ఈ వ్యాపారాన్ని ఇంట్లోనే ప్రారంభించుకోవచ్చు. ఒకవేళ పెట్టుబడి కాస్త ఎక్కువ ఉంటే ఒక ప్రొడక్షన్ యూనిట్‌ని స్టార్ట్ చేయచ్చు. అలాగే మీకు మార్కెట్‌కు సంబంధించిన పూర్తి సమాచారం తెలిసుండాలి. ముందుగా మార్కెట్‌పై అవగాహన పెంచుకోవాలి. బల్క్, రిటైల్ షాపులకు, స్ట్రైట్ కస్టమర్‌కు కూడా అమ్మేలా ఉండాలి.
ఈ వ్యాపారంలో ముందుగా పాపడ్ తయారీ యంత్రాన్ని కొనుగోలు చేయాలి. అది మీరు పెట్టే పెడ్డుబడిని బట్టి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్‌లో మాన్యువల్, సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ పాపడ్ తయారీ యంత్రాలు అందుబాటులో ఉన్నాయి. సెమీ ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ యంత్రాలతో మీరు ఎక్కువ మొత్తంలో అప్పడాలను తయారు చేసేందుకు వీలుంటుంది. కాకపోతే కాస్త పెట్టుబడి కూడా ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. అయితే ఈ యంత్రాలు రూ.15 వేల నుంచి రూ.4 లక్షల వరకు కూడా మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ వ్యాపారానికి అనుమతులు కూడా పొందాల్సి ఉంటుంది. లైసెన్సులు లేకుండా మీరు ప్రొడక్ట్‌ని విక్రయించలేరు.
మీ వ్యాపారానికి మార్కెట్ కూడా చాలా ప్రధానం. ముందుగా మీ ఉత్పత్తికి ఒక బ్రాండ్‌ని క్రియేట్ చేయాలి. మంచి పేరుని ఎంచుకుని దానిని మార్కెట్‌లో ప్రచారం చేసుకోవాలి. చిన్నగా ప్రారంభిస్తే.. ఫ్రెండ్స్, ఫ్యామిలీ, బంధువులతో వాట్సాప్, సోషల్ మీడియాలో ప్రచారం చేయించుకోవచ్చు. మీరు ఉండే ప్రాంతంలో రిటైల్ షాపులకు మీ ఉత్పత్తిని పరిచయం చేయాలి. ఇ-కామర్స్ సైట్స్ లో కూడా మీ వ్యాపారాన్ని రిజిస్టర్ చేసుకోవాలి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బిగ్ బాస్కెట్ ఇలా చాలానే ఆప్షన్స్ ఉన్నాయి. వాటిలో వ్యాపారం ప్రారంభించడం వల్ల మీ బ్రాండ్ చాలా త్వరగా వినియోగదారులకు చేరుతుంది. వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి దగ్గర మార్గం అది.
ఇలాంటి వ్యాపారాలకు ప్రభుత్వం బాగా సాయం చేస్తుంది. చిన్న వ్యాపారాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక స్కీమ్స్ ప్రారంభించారు. నిజానికి అప్పడాల వ్యాపారాన్ని తక్కువలో తక్కువ రూ.2 లక్షలతో ప్రారంభించవచ్చు. ఒకవేళ మీరు ఫుల్లీ ఆటోమేటిక్ యంత్రాలను కొనుగోలుచేసి పెద్ద ప్రొడక్షన్ యూనిట్ ప్రారంభించాలి అంటే మీకు రూ.8.20 లక్షల వరకు లోన్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి ఎంటర్‌పెన్యూర్ సపోర్ట్ స్కీమ్ కింద దాదాపుగా రూ.2 లక్షల వరకు గ్రాంట్‌ని కూడా పొందేందుకు అవకాశం ఉంది. మీ వ్యాపారం అభివృద్ధి చెందిన తర్వాత దానిని విస్తరించుకునేందుకు మళ్లీ రుణం తీసుకునేందుకు కూడా వెసులుబాటు ఉంటుంది. అయితే మీరు ఏ వ్యాపారం ప్రారంభించాలన్నా.. అందులో ఉండే ఆటుపోట్లు, లాభనష్టాల గురించి అధ్యయనం చేశాకే పెట్టుబడి పెట్టాలి.