అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఆకాశన్నంటుతున్నా.. భారత్‌లో మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్క పైసా పెరగడం లేదు. దేశంలో ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు ముగిసిన తర్వాత వినియోగదారులకు పెట్రో షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. మార్చిలో లీటర్ పెట్రోల్ ధర 8 రూపాయల మేర పెంచే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందుకు ప్రధాన కారణం రష్యా – ఉక్రెయిన్ మధ్య ఉన్న ప్రస్తుత పరిస్థితులే అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో మార్చి నెలలో పెట్రో పెంపు తప్పదని అభిప్రాయపడుతున్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థకు మూలాధారం పెట్రోల్, డీజిల్ ఉత్పత్తుల విక్రయాలు. వీటి ద్వారా పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరు. అయితే.. సామాన్యుడి బతుకు బండిని నడిపించేవి కూడా ఈ ఉత్పత్తులే. గత ఏడాది నవంబర్ 4కు ముందు భారత్‌లో పెట్రోలియం ఉత్పత్తుల ధరలను రోజుకు ఇంత అని పెంచుతూ వచ్చిన కేంద్రం ఆ తర్వాత ఇప్పటి వరకు పెంచ లేదు. ఒకవేళ పెంచితే.. అయిదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల ఫలితాల్లో వ్యతిరేకత వస్తుందనే భయంతోనే వాటి జోలికే వెళ్లలేదు. అయితే మార్చి 7న ఉత్తర్‌ప్రదేశ్‌లో చివరి విడత ఎన్నికలు ముగియనున్నడంతో మళ్లీ వీటి ధరల మోత మోగనున్నట్లు తెలుస్తోంది. పెట్రోల్‌పై లీటర్‌కు ఏకంగా 8 నుంచి 9 రూపాయలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.గతంలో పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపుర్ రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు వచ్చిన సమయంలో.. 2017 జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఒక్క పైసా కూడా పెంచలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా ధరలను స్థిరంగా ఉంచిన కంపెనీలు.. తుది దశ పోలింగ్ ముగిసిన తరువాత రోజు నుంచే పెంపు ప్రారంభించినట్లు పరిశ్రమ వర్గాల తెలిపాయి. కానీ 2020లో అంతర్జాతీయంగా ధరలు తగ్గిన కారణంగా లాభాలను సొమ్ము చేసుకోవడానికి ఎక్సైజ్ సుంకాన్ని పెట్రోల్‌పై రూ. 10, డీజిల్‌పై రూ. 13 పెంచింది కేంద్రం.
సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలను.. అంతర్జాతీయ ముడి చమురు ధరల ఆధారంగా నిర్ణయిస్తారు. ముడి చమురు ధరలు పెరిగితే భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలను దేశీయ చమురు కంపెనీలు పెంచుతాయి. అలాంటిది నవంబర్ 4 నుంచి ఇప్పటి వరకు భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపు మాటే లేదు. ఈ కాలంలో బ్యారెల్ ముడి చమురు ధర 14 డాలర్లు పెరిగి 94 డాలర్లకు చేరింది. త్వరలో వంద డాలర్లకు చేరుతుందని భావిస్తున్నారు. అంతర్జాతీయ ముడి చమురు ధరల పెంపు ప్రభావం దేశంలో ఎన్నికలు ముగిసిన తరువాత కనిపించనున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం అంతర్జాతీయంగా రష్యా, ఉక్రెయిన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఏ క్షణమైనా యుద్ధం జరిగే పరిస్థితి నెలకొంది. ఈ కారణంగానే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. యుద్ధం అనివార్యమైతే బ్యారెల్ ధర 150 డాలర్లు చేరుకోవచ్చనే అంచనాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో అతిపెద్ద ముడి చమురు ఉత్పత్తి దేశాల్లో రష్యా ఒకటి. ఐరోపాకు 35 శాతం ఇంధనం రష్యా నుంచే సమకూరుతోంది. ఒక వేళ రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరిగితే అంతర్జాతీయంగా ముడి చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి బ్యారెల్ ధర 100 డాలర్లకు పైబడే అంచనాలు కూడా ఉన్నాయి. అలా జరిగితే దేశీయ మార్కెట్‌లో పెట్రోల్ ధర రెట్టింపుకానుంది.