ఈ మధ్య కాలంలో చిట్టీల పేరుతో జరుగుతున్న మోసాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఊర్లలో కూడా ఈ తరహా ఘటనలు పెరిగిపోతున్నాయి. మరి వీటిల్లో ఎలాంటి మోసాలు చోటు చేసుకుంటున్నాయి వంటి వివరాలు..
ఈమధ్య కాలంలో తరచుగా వినిపిస్తున్న నేరాల్లో.. చిట్టీల పేరుతో జరిగే మోసాల పేరు ఎక్కువగా వినిపిస్తున్నాయి. నమ్మకంగా ఉంటూ.. చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసి.. ఆ తర్వాత బోర్డు తిప్పేసి.. జనాలను నట్టేటా ముంచుతున్న వారి సంఖ్య ఈ మధ్య కాలంలో బాగా పెరుగుతోంది. ఇలా మోసపోతున్న వారిలో సెలబ్రిటీలు కూడా ఉంటున్నారు. మన ఊరే కదా.. మన పక్క ఇల్లే కదా, మన బంధువులే కదా అని నమ్ముతున్నాం. చేతిలో డబ్బులు ఉంటే ఖర్చవుతాయి.. చిట్టీలు కడితే.. పొదుపు అవుతాయి.. పైగా అవసరం అనుకున్నప్పుడు ఒకేసారి భారీ మొత్తంలో డబ్బులు ఎత్తుకోవచ్చు అనే ఉద్దేశంతో.. చాలా మంది చిట్టీలు కడుతుంటారు. ఎన్నో ఏళ్లుగా ఈ చిట్టీల వ్యాపారం మన సమాజంలో కొనసాగుతోంది.
గతంలో కేవలం తెలిసిన వారు, మన దగ్గరి వాళ్లు అయితేనే చిట్టీలు వేసేవారు. కానీ నేటి కాలంలో మాత్రం పలు ప్రైవేట్ కంపెనీలు కూడా చిట్‌ఫండ్ వ్యాపారంలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ముందు భారీగా స్కీమ్‌లు, వడ్డీలు అంటూ ఆశ చూపుతారు. జనాల నమ్మకాన్ని చురుగొనేవరకు నమ్మకంగా వ్యవహరిస్తూ.. వారిని ఆకర్షిస్తారు. జనాలు ఎక్కువ సంఖ్యలో చేరి.. భారీ మొత్తం జమ అయిన తర్వాత.. బోర్డు తిప్పేస్తారు. దాంతో జనాలు నెత్తి నోరు బాదుకోవడం తప్ప లాభం లేదు. పైగా ఇలా బోర్డు తిప్పేసే కంపెనీలు.. ఆర్‌బీఐ, సెబీ అనుమతితో ఏర్పడినవి కావు. కనుక పోలీసులు కూడా ఇలాంటి కేసులను పరిష్కరించడంలో చాలా ఆలస్యం చోటు చేసుకుంటుంది. ఇక ఊర్లో జనాల దగ్గర కట్టే చిట్టీలకు కూడా ఏమాత్రం గ్యారెంటీ లేదు. కేవలం నమ్మకం, మన అదృష్టం మీద ఆధారపడి మాత్రమే.. ఈ వ్యాపారం సాగుతుంది
కంపెనీలు అధిక వడ్డీ ఆశ చూపి జనాలు మోసం చేస్తే.. ఊర్లలో వ్యక్తుల దగ్గర నిర్వహించే చిట్టీల్లో మరో రకం మోసాలు చోటు చేసుకుంటాయి. చిట్టీలు కట్టించుకున్న వ్యక్తి పరారైనా.. చిట్టీ డబ్బులు ఎత్తుకున్న వారిలో ఎవరైనా డబ్బులు తిరిగి కట్టకపోయినా.. ఆ ప్రభావం మిగతా అందరి మీద ఉంటుంది. వరుసగా ఇలాంటి సంఘటనలు రెండు, మూడు చోటు చేసుకుంటే ఇక అంతే సంగతులు. కనుక ఇలాంటి చిట్టీల వ్యాపారాల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం అంటున్నారు పోలీసులు, మార్కెట్ విశ్లేషకులు.
కనుక గ్యారెంటీ లేని ఇలాంటి చిట్టీ పథకాల్లో డబ్బులు పెట్టడం కన్నా.. బ్యాంకులు, ఫిక్స్‌డ్ డిపాజిట్ స్కీమ్‌లలో పొదుపు చేస్తే ఆదాయం పెరగడమే కాక.. మన సొమ్ముకు భద్రత కూడా ఉంటుంది అంటున్నారు. పైగా నేటి కాలంలో చాలా బ్యాంకులు.. సేవింగ్స్ మీద గతంలో పోలిస్తే.. ఎక్కువ వడ్డీలు ఇస్తున్నాయి. వీటిల్లో భారీగా లాభాలు పొందాలంటే.. దీర్ఘ కాలం పెట్టుబడి పెట్టాలి.. ఎదురు చూడాలి. కానీ మీరు ఆశించిన ఫలితం తప్పకుండా లభిస్తుంది అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. కనుక చిట్టీలు కట్టే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని.. నిర్ణయం తీసుకోవాలి అంటున్నారు.