ఆడవాళ్ళని వంటింటి కుందేలు అని అంటారు. ఆమె పని చేసినంత చురుగ్గా మగవాళ్ళు కూడా పని చేయలేరు. అది నిజమే. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకూ ఊపిరి సలపనంతగా పనులతో సతమతమవుతూ ఉంటుంది. ఇంట్లో ఎక్కువ మంద ఉంటే ఇక ఆ తల్లికి వంట గదిలోంచి బయటకొచ్చే పనే లేదు. జీతం లేని జీవితం గడిపే ఏకైక వ్యక్తి మహిళ. మరి అలాంటి మహిళలకు జీతం ఇస్తే? ఎలా ఉంటుంది చెప్పండి. జీతం ఇచ్చే స్థాయిలో ఒక మహిళగా మీరు వ్యాపారం మొదలుపెడితే ఎలా ఉంటుంది చెప్పండి. మీరు వంట రుచిగా వండుతారా? అయితే మీ వంట మీకు డబ్బు, పేరు తెచ్చి పెడుతుంది. మీరు పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్నట్లయితే మీకు ఈ బిజినెస్ బాగా వర్కవుట్ అవుతుంది. దీని కోసం మీరు ఎక్కడికి వెళ్ళిపోనవసరం లేదు. ఉన్న చోటి నుంచే వ్యాపారాన్ని మొదలుపెట్టవచ్చు.
ఎంతోమంది బ్యాచిలర్ ఉద్యోగులు, విద్యార్థులు పక్క ఊర్ల నుంచి వచ్చి అద్దె రూముల్లో ఉంటారు. వండుకోవడం ఇబ్బందిగా ఉంటుందని చాలా మంది బయటే తినేస్తారు. బయట హోటల్ ఫుడ్ బాలేకపోయినా, తమకి పడకపోయినా సర్దుకుపోయి తింటారు. ఇష్టం లేకపోయినా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి మరీ తినాల్సి వస్తుంది. డబ్బుతో పాటు ఆరోగ్యం కూడా వేస్ట్ అయిపోతుంది. ఇక బయట హోటల్ లో తినడం కంటే సొంతంగా వండుకోవడం బెటర్ అని కొంతమంది రూమ్ లోనే వండుకుని తింటారు. వంట రాక పాపం ఇబ్బందులు పడతారు. దీని వల్ల వీరి ఆరోగ్యం కూడా దెబ్బ తింటుంది. ఇలాంటి వారి కోసం చక్కగా వండిన హోమ్లీ ఫుడ్ పెడితే ఎంత బాగుంటుంది చెప్పండి. కోచింగ్ ఇన్స్టిట్యూట్ లు, కంపెనీలు మీరు ఉండే చోట దగ్గరగా ఉంటే గనుక.. వారికి చక్కగా ఇంట్లో భోజనం వండించి పంపించండి.
అప్పుడే చదువు అయ్యి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారిని పార్ట్ టైం డెలివరీ ఏజెంట్ గా పెట్టుకోండి. లేదా మీ ఇంట్లోనే మగవారు ఉంటే వారి ద్వారా కూడా భోజనం డెలివరీ చేయవచ్చు. పండగ సమయాల్లో పులిహోర, బూరెలు, గారెలు, జంతికలు వంటి పిండి వంటలు కూడా చేసి పెట్టవచ్చు. పచ్చళ్ళు చేసి పెట్టవచ్చు. దీనికి ప్రత్యేకమైన రేట్లు ఫిక్స్ చేయవచ్చు. అమ్మ చేతి వంట మిస్ అయిన ప్రతీ ఒక్కరికీ అమ్మ చేతి కమ్మని ఆహారాన్ని అందించవచ్చు. ఉదాహరణకు తెలంగాణలో ఆంధ్రకు చెందిన వారు అనేకమంది ఉంటారు. వారిలో చాలా మంది అమ్మ చేతి భోజనాన్ని మిస్ అవుతారు. ఆంధ్ర వంటల్లో చేయి తిరిగిన మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు.
ఆంధ్ర వంటలు కాకపోతే తెలంగాణ వంటలు.. ఏదైనా ఇంటి భోజనం కాబట్టి ఆరోగ్యానికి మంచిదే. అలానే ఆంధ్రాలో ఉండే తెలంగాణ వారి కోసం కూడా ఆంధ్రాలో సెటిల్ అయిన తెలంగాణ వాళ్ళు చక్కగా ఇంటి భోజనం వండి పంపించవచ్చు. మీరు ఉండే కాలనీలోనో, వీధిలోనో, ఆ పక్క వీధిలోనో బ్యాచిలర్ ఉద్యోగులు, కోచింగ్ తీసుకునే విద్యార్థులు ఉంటారు. వారిని సేకరించగలిగితే మీకు మంచి లాభాలు వస్తాయి. ఎందుకు తలనొప్పి అనుకుంటే.. కస్టమర్ కి ఒక్కో పార్సిల్ కి ఇంత కమిషన్ ఇస్తాను అని మాట్లాడుకుని.. డెలివరీ ఏజెంట్ ని కస్టమర్స్ ని సేకరించమని చెప్పండి. మీ పని ఇంకా సులువు అవుతుంది. ఈ వ్యాపారాన్ని మూడు రకాలుగా చేయచ్చు.
మొదటిది, ఇంట్లో స్పేస్ ఉంటే డైనింగ్ టేబుల్ సెట్ చేసి.. ఇంటికి వచ్చేలా ఏర్పాటు చేసుకోవచ్చు. రెండోది, ఉదయాన్నే లంచ్ బాక్సులు రెడీ చేసి ఇవ్వచ్చు. మూడవది, లంచ్ సమయానికి వేడి వేడిగా డెలివరీ చేయవచ్చు. ఈ మూడు రకాలు అమలుచేస్తే మంచి లాభాలు ఉంటాయి. దీనికి ఇద్దరు వ్యక్తులు కావాలి. ఒకరు వంట చేసేవారు, మరొకరు డెలివరీ చేసేవారు. దీనికి పెట్టుబడి లక్షలు అవసరం లేదు. 500 రూపాయలతో కూడా ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేయవచ్చు. ఒక్కో మనిషికి భోజనం ఖరీదు రూ. 50 అనుకుంటే.. పది మందికి రూ. 500 అవుతాయి. దీనికి వంట ఖర్చు కేవలం రూ. 250 నుంచి రూ. 300 మాత్రమే. అంటే ఒక్కో మనిషికి వండించినందుకు అయ్యే ఖర్చు రూ. 25 అన్నమాట.
డెలివరీ ఏజెంట్ కి పార్సిల్ కి కమిషన్ గా రూ. 5 నుంచి రూ. 10 ఇచ్చి.. మిగతా డబ్బు మీరు తీసుకోవచ్చు. మీకు ఓపిక ఉంటే 30 నుంచి 50 మందికి వండచ్చు. ఒకవేళ మీరు అంతమందికి వండలేకపోతే మీ పేరు మీద ఫ్రాంచైజీలా మీ చుట్టుపక్కల వారిని మీ బిజినెస్ లో భాగం చేసుకోండి. ఇంతమందికి వండి ఇస్తే ఇంత కమిషన్ ఇస్తా అని చెప్పండి. భోజన ఖర్చులకు డబ్బులు మీరే ఇవ్వండి. అలా మీరు మీ చుట్టుపక్కల ఉండే మహిళలను ఒక 20 మందిని సేకరిస్తే.. ఒక్కొక్కరూ పది మందికి వండగల సామర్థ్యం ఉంటే గనుక 200 మంది కస్టమర్స్ కి వండగలరు. 200 మందికి అంటే రూ. 50 చొప్పున ఒక రోజుకి 10 వేలు వస్తాయి. ఫుడ్ లో ఎప్పుడూ సగానికి సగం మిగులుతుంది. కాబట్టి 5 వేలు పెట్టుబడి పోయినా 5 వేలు మిగులుతాయి.
రోజుకి 5 వేలు అంటే నెలకి లక్షా 50 వేలు ప్రాఫిట్ అన్న మాట. ఇంత కాకపోయినా కనీసం లక్ష అయినా మిగులుతుంది. ఈ బిజినెస్ కోసం ప్రధానంగా కస్టమర్స్ అండ్ హోమ్ మాస్టర్ చెఫ్ లు, డెలివరీ ఏజెంట్ లు ఉండాలి. కస్టమర్స్ ని ఆకర్షించడానికి సోషల్ మీడియా వేదికలను ఉపయోగించుకోండి. అలానే డెలివరీ ఏజెంట్లను, వంట చేసి పెట్టే మహిళలను ఒక గ్రూప్ గా ఫార్మ్ చేయండి. వారి సమీపంలో ఉండే యువకులకే ఫుడ్ డెలివరీ చేసేలా వ్యవస్థను ఏర్పాటు చేయండి. బాగా డబ్బు వచ్చిన తర్వాత ఈ బిజినెస్ నే ఒక యాప్ రూపంలో డెవలప్ చేయండి. మీ ఊరిలో చిన్నగా మొదలైన ఈ హోమ్లీ ఫుడ్ బిజినెస్ ఒక యాప్ ద్వారా దేశమంతా అందుబాటులో ఉంటుంది.
ఈ బిజినెస్ మొదలుపెట్టినప్పుడే కష్టంగా ఉంటుంది. ఆ తర్వాత పని తక్కువ ఉంటుంది. ఈ బిజినెస్ వల్ల అటు బ్యాచిలర్స్ కి హోమ్ ఫుడ్ దొరుకుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. ఇటు ఇంట్లో ఉండే గృహిణులకు పని దొరుకుతుంది. నిరుద్యోగులు కూడా ఈ బిజినెస్ ని ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అయితే చేసే ముందు బాగా ఆలోచించుకుని లోతు ఎంత ఉంటుందో అనేది తెలుసుకుని దిగాలి. అవగాహన లేకుండా దిగితే నష్టపోయే అవకాశం ఉంది. అది శారీరక శ్రమ అయినా, ఆర్ధిక శ్రమ అయినా సరే.