చల్లదనం కోసం ఏసీ వాడుతున్నారా..? కరెంట్ బిల్ ఎక్కువ వస్తుందా..? అయితే ఆందోళన పడకండి. మీకు కొన్ని టిప్స్ తెలియజేస్తున్నాం.. ఇవి పాటించడం ద్వారా మీ కరెంటు బిల్ సగం వరకు ఆదా చేసుకోవచ్చు.
వేసవి కాలం మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలుచోట్ల 42 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో హీట్‌వేవ్ పరిస్థితుల వలన చాలా మంది వడదెబ్బ బారిన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితులలో ఇంటి నుంచి కాలు బయటపెట్టకపోవడం చాలా మంచిది. అలా అని ఇంట్లో కూర్చున్నామా.. ఒకటే ఉక్కపోత. పోనీ కాసేపు సేదదీరుదామని ఏసీ ఆన్ చేశామా..? వేలకువేలు కరెంటు బిల్లు. చూడండి వేసవి కాలం వల్ల ఎన్ని బాధలో! అయితే మీరు కింద చెప్పబడిన కొన్ని టిప్స్ పాటిస్తే కరెంట్ బిల్ బాధలు కొంతమేర తగ్గించుకోవచ్చు. అదెలా అన్నది ఇప్పుడు చూద్దాం..
చాలావరకు అందరూ 24 గంటలు ఏసీని ఆన్‌లోనే ఉంచుతుంటారు. ఇలా ఏసీని ఎక్కువగా ఉపయోగించడం వల్ల కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది. ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. గతంతో పోలిస్తే వేసవి కాలంలో ఏసి వాడడం వల్ల రెట్టింపు కరెంటు బిల్లు వస్తుంది. అయితే కొన్ని కొన్ని సార్లు మనం చేసే తప్పుల వల్ల ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అవేంటో తెలుసుకొని జాగ్రత్త పడండి.
నిజానికి అందరూ 16 లేదా 18 డిగ్రీల వద్ద ఉంచడం ద్వారా ఏసీ మంచి కూలింగ్‌ని చేస్తుందని భావిస్తుంటారు. కానీ 24 డిగ్రీల వద్ద స్థిరంగా ఉంచినా అదే చల్లదనం మీకు అందుతుంది. పైగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రకారం.. మానవ శరీరానికి అనువైన ఉష్ణోగ్రత 24. కావున 24 వద్ద ఉంచండి. ఇలా చేయడం వల్ల చాలా విద్యుత్తు ఆదా అవుతుంది. ఉష్ణోగ్రతను ఒక డిగ్రీ పెంచడం ద్వారా 6 శాతం వరకు విద్యుత్ ఆదా అవుతుందని అనేక అధ్యయనాల్లో కూడా వెల్లడైంది. కావున సరైన ఉష్ణోగ్రతను ఎంచుకోవడం చాలా ముఖ్యం.
శరీరానికి ఎండ తగలడం మంచిదే అయినా వేసవి కాలంలో సూర్యకిరణాలు మీద పడడం వల్ల మరింత వేడి కలుగుతుంది. అలాగే వడ దెబ్బ కూడా తగిలే అవకాశం లేకపోలేదు. అంతేకాదు.. డీహైడ్రేషన్ సమస్యలు మొదలవుతాయి. దీనికి తోడు సూర్యకిరణాలు లోపలకి రావడం వల్ల గది చల్లబడడానికి ఎక్కువ సేపు పడుతుంది. అందుకని మీరు ఏం చేయాలంటే మీ గదిలో ఉండే కిటికీలను కర్టెన్లతో కట్టేయండి. దీనితో గది త్వరగా చల్లగా అవుతుంది.. కరెంట్ బిల్లు ఆదా అవుతుంది.
వేసవి కాలం మొదలైనప్పుడల్లా కొత్తగా ఏసీ కొనుగోలు చేయడమన్నది అసాధ్యం. గతేడాది వాడిన దానినే తిరిగి మరలా వినియోగిస్తుంటాం. అయితే దానిని మనం పక్కన పెట్టేయడం వల్ల ఎయిర్ ఫిల్టర్‌లో దుమ్ము, ధూళి చేరిపోతుంది. ఈ కారణంగా దానిలో నుంచి గాలి సరిగా రాదు. దీని వల్ల గది త్వరగా చల్లబడదు. కావున ఎప్పటికప్పుడు ఏసీ ఫిల్టర్స్‌ని శుభ్రం చేసుకోవడం ఉత్తమం. 60 రోజులకోసారి ఎయిర్ ఫిల్టర్లని శుభ్రం చేసుకోవడం మరీ మంచిది.
ప్రస్తుతం అన్నీ కంపెనీలు స్లీప్ మోడ్ ఫీచర్‌తో ఉన్న ఏసీలనే తీసుకొస్తున్నాయి. ఈ ఆప్షన్ మీకు 36 శాతం విద్యుత్తును ఆదా చేస్తుంది. అవసరం లేని సమయాల్లో, బయటకు వెళ్తున్నప్పుడు, ఉదయం పూట, వాతావరణం చల్లగా ఉన్న సమయాల్లో స్లీప్ మోడ్‌లో ఉంచడం ద్వారా మరింత విద్యుత్ ఆదా చేయవచ్చు.
సాధారణంగా అందరూ ఏసీ, ఫ్యాన్ రెండూ ఆన్‌లో ఉండటం వల్ల ఎక్కువ కరెంటు బిల్ వస్తుందనిభావిస్తుంటారు. అది వాస్తవం కాదు. ఏసిని వేసినప్పుడు సీలింగ్ ఫ్యాన్ వేసుకోవడం వల్ల గది అంతటా చల్లదనం త్వరగా వ్యాపిస్తుంది. ఒకవేళ ఫ్యాన్ వేసుకోకపోతే గాలి స్ప్రెడ్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది. కావున సీలింగ్ ఫ్యాన్ ఆన్‌లో ఉంచండి.. కరెంట్ బిల్ ఆదా చేసుకోండి. ఈ టిప్స్ సరైనవే అనిపిస్తే.. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.