ఇప్పుడున్న పరిస్థితుల్లో హైదరాబాద్ లో ఇల్లు (ఫ్లాట్) కొందామన్నా, స్థలం కొందామన్నా గానీ సామాన్యుడికి చుక్కలు కనబడుతున్నాయి. హైదరాబాద్ ని తలచుకుంటే ఇల్లు కొనాలన్నా ఆశ కాదు, అసలు కొనాలన్న కల కూడా చచ్చిపోతుంది. హైదరాబాద్ లో ఇల్లు అని నిద్రలో కల కనడం కూడా పాపమైపోయింది ఈరోజుల్లో. అయితే సౌత్ హైదరాబాద్ లో ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో స్థలం అపార్ట్మెంట్ ధరలు తక్కువకే వస్తున్నాయి. పైగా రియల్ ఎస్టేట్ వృద్ధి కూడా బాగుంది. రూ. 20 లక్షల బడ్జెట్ లో స్థలం వస్తుంది. ఫ్లాట్ కావాలన్నా కూడా రూ. 20 లక్షల బడ్జెట్ లోపే వస్తుంది. స్థలం కొనాలనుకునేవారికైనా, ఫ్లాట్ కొనాలనుకునేవారికైనా, పెట్టుబడి పెట్టాలనుకునేవారికైనా ఈ ఏరియా అనేది మంచి లాభదాయకం.
దక్షిణ హైదరాబాద్ లోని ఆదిభట్ల, బండ్లగూడ జాగీర్, అత్తాపూర్, శంషాబాద్, తుక్కుగూడ ఏరియాల్లో రియల్ ఎస్టేట్ అనేది బాగుంది. సౌత్ హైదరాబాద్ లో తుక్కుగూడ మినహాయిస్తే మిగతా ఏరియాల్లో స్థలాల ధరలు, ఫ్లాట్ల ధరలు ఎక్కువగా ఉన్నాయి. ఒక్క తుక్కుగూడలోనే రూ. 20 లక్షల బడ్జెట్ లో సామాన్యుడికి అందుబాటులో స్థలం, ఫ్లాట్ వస్తున్నాయి. ఈ ఏరియాలో చదరపు అడుగు స్థలం సగటున రూ. 1950 ఉంది. గత ఏడాదితో పోలిస్తే 2.6 శాతం ధరలు పెరిగాయి. 2018లో చదరపు అడుగు రూ. 1300 ఉంటే ఇప్పుడు అది రూ. 1950కి పెరిగింది. రూ. 650 పెరిగింది. అంటే ఐదేళ్ల క్రితం రూ. 13 లక్షలు పెట్టి 100 గజాల స్థలం కొన్నారనుకుంటే.. ఇప్పుడు దాని విలువ రూ. 19,50,000. అంటే ఈ ఐదేళ్ళలో రూ. 6,50,000 లాభం. ఐదేళ్ళలో 53.8 శాతం పెరిగింది. మూడేళ్ళలో 2.6 శాతం పెరిగింది. ప్రస్తుతం అయితే రియల్ ఎస్టేట్ ఇక్కడ నిదానంగా ఉంది. ఇక్కడ ధరలు కాస్త తక్కువగా ఉన్నాయి. ఇక ఫ్లాట్ల ధరలు కూడా తక్కువే.
ప్రస్తుతం చదరపు అడుగు ఈ ఏరియాలో సగటున రూ. 3,750 పలుకుతోంది. మూడేళ్ళలో ఫ్లాట్ ధరల వృద్ధి రేటు 45.3 శాతం పెరిగింది. ఏడాదిలో 11.6 శాతం పెరిగింది. తుక్కుగూడలో స్థలాల కంటే ఎక్కువగా ఫ్లాట్లు కొంటున్నారు. ఫ్లాట్ల వృద్ధి రేటు అనేది స్థలాలతో పోల్చుకుంటే బాగా ఎక్కువగా ఉంది. 2020లో ఈ ఏరియాలో ఫ్లాట్ ధరలు చదరపు అడుగుకి రూ. 2,650 ఉంటే ప్రస్తుతం రూ. 3,750 ఉంది. అంటే మూడేళ్ళ క్రితం 100 గజాల ఫ్లాట్ 23 లక్షల పైన ఉంటే ఇప్పుడు రూ. 33 లక్షల పైన ఉంది. 100 గజాల్లో అంటే 2బీహెచ్కే ఫ్లాట్ వచ్చేస్తుంది. అదే 1 బీహెచ్కే ఫ్లాట్ కావాలనుకుంటే రూ. 18 లక్షలు అవుతుంది. ఈ స్పేస్ లో రూ. 20 లక్షల లోపే ఫ్లాట్ అనేది వస్తుంది.
అయితే ఈ ఏరియాలో 2 బీహెచ్కే ఫ్లాట్లే ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ శాతం మంది 2 బీహెచ్కే ఫ్లాట్స్ నే కొంటున్నారు. ఒకవేళ 30, 40 లక్షల బడ్జెట్ పెట్టలేకపోతే కనుక స్థలం మీద ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది. ఈ ఏరియాలో ఉన్న సగటు ధర చదరపు అడుగుకు రూ. 1950 చొప్పున 500 చదరపు అడుగుల స్థలం రూ. 20 లక్షల్లో వస్తుంది. స్థలం ధరలు చదరపు అడుగుకి రూ. 650, రూ. 1730 కూడా పలుకుతున్నాయి. రూ. 9 లక్షలకే 1350 చదరపు అడుగుల స్థలం దొరుకుతుంది. అలానే 1440 చదరపు అడుగుల స్థలం రూ. 25 లక్షలకే దొరుకుతుంది. హెచ్ఎండీఏ అప్రూవ్ చేసిన ల్యాండ్స్ ఇవన్నీ.
గమనిక: పలు రియల్ ఎస్టేట్ వెబ్ సైట్లు తెలిపిన సగటు ధరల ఆధారంగా ఇవ్వబడిన సమాచారం మాత్రమే. ఈ ధరల్లో మార్పులు ఉంటాయని గమనించగలరు.