ఓలా క్యాబ్ వ్యవస్థాపకుడు, సీఈఓ భవిష్ అగర్వాల్ ఓ కోర్టు ఫైన్ విధించింది. తన కంపెనీకి చెందిన ఓ కారులో ఏసీ సరిగా పనిచేయనందుకు బెంగళూరుకు చెందిన ఓ కస్టమర్ దావా వేయగా.. సదరు వ్యక్తికి అనుకూలంగా తీర్పునిచ్చింది. జరిమానా విధించడంతో పాటు సదరు వ్యక్తి న్యాయపరమైన ఖర్చులు కూడా మీరే చెల్లించాలంటూ భవిష్ అగర్వాల్‌ను ఆదేశించింది.
వివరాల్లోకి వెళితే.. బెంగళూరుకు చెందిన 36 ఏళ్ల వికాస్ భూషణ్ అనే వినియోగదారుడు 2021 అక్టోబర్ లో ఓలాలో ఓ కారును ఎనిమిది గంటల పాటు అద్దెకు తీసుకున్నాడు. ఏసీతో కలిపి ఇస్తామని కంపెనీ చార్జ్ చేసింది. అయితే క్యాబ్ లోని ఏసీ పనిచేయకపోవడంతో నిరాశకు గురయ్యాడు. రైడ్ ముగిశాక క్యాబ్ ఫీజుగా రూ. 1,837 చెల్లించాలని కంపెనీ అడగ్గా.. కట్టేశాడు. అయితే అందులో ఏసీ చార్జ్ చేశారా అని కస్టమర్ సపోర్ట్ను సంప్రదించగా.. చార్జ్ చేసినట్లు తేలింది. అయితే ఎనిమది గంటల పాటు ఏసీ పనిచేయలేదని తన డబ్బులు వాపసు ఇవ్వాలని అడగ్గా.. ఇవ్వలేదు. దీంతో ఆయన ఓలా సీఈఓ భవిష్ ను ట్విట్టర్ ద్వారా సంప్రదించాడు. స్పందన రాకపోవడంతో .. మెయిల్ కూడా చేశాడు.
వికాస్ తర్వాత నేషనల్ కన్స్యూమర్ హెల్ప్‌లైన్‌ని సంప్రదించి, రీ ఫండ్ కోసం అభ్యర్థించాడు. ఓలా ఆ మెయిల్ స్పీకరించి, మనీ రీఫండ్ చేసేందుకు నిరాకరిస్తూ..ప్రత్యామ్నాయంగా రూ. 100 కూపన్ ఇచ్చింది. దీంతో అతడు మార్చి 2022లో తాను ప్రయాణించిన కారులో ఏసీ పనిచేయలేదంటూ ఓలా సీఈఓకి వ్యతిరేకంగా బెంగళూరు అర్బన్ డిస్ట్రిక్ట్ కన్య్సూమర్ డిస్ప్యుట్ రిడ్రెసల్ కమిషనల్ లో ఫిర్యాదు చేశాడు. విచారించిన కోర్టు.. ఏసీ పనిచేయకపోయినా అతడి నుండి బిల్లు వసూలు చేసిందని గుర్తించింది. అంతేకాకుండా అతడికి కలిగిన అసౌకర్యం కారణంగా మానసిక వేధన అనుభవించాడంటూ వికాస్ కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఖాతాదారుడి అసౌకర్యానికి రూ. 10 వేలు చెల్లించడంతో పాటు.. అతడి న్యాయపరమైన ఖర్చులకు రూ. 10వేలు చెల్లించాలని ఆదేశించింది.