రిటైర్మెంట్ సమయంలో అధిక పెన్షన్ కావాలనుకునేవారికి ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అధిక పెన్షన్ కి దరఖాస్తు చేసుకునే గడువు తేదీని పెంచడమే కాకుండా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే ప్రక్రియను అద్నుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది.
ఉద్యోగులు రిటైర్మెంట్ అయ్యాక పెన్షన్ పొందడం కోసం ఈపీఎఫ్ఓలో చందాదారులుగా ఉంటారు. ఈపీఎఫ్ఓ ఖాతాలు తీసుకుంటారు. దీని కోసం ఉద్యోగి జీతం నుంచి కొంత సొమ్ము, ఉద్యోగి పని చేసే కంపెనీ నుంచి కొంత సొమ్ము తీసుకుని.. దానికి ప్రభుత్వం కొంత సొమ్ము కలిపి రిటైర్మెంట్ సమయంలో ఇస్తుంది. అయితే ఈ పెన్షన్ ఇంకా అదనంగా రావాలని కోరుకునేవారికి ఈపీఎఫ్ఓ గుడ్ న్యూస్ చెప్పింది. అధిక పెన్షన్ కోసం యజమానితో కలిసి దరఖాస్తు చేసుకునేలా ఉమ్మడి అప్లికేషన్ లింక్ ని ఆన్ లైన్ లో ఉంచుతున్నట్లు ప్రకటించింది. ఈ అధిక పెన్షన్ కి ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి వివరాలు మీ కోసం.
ఈపీఎఫ్ఓ శుభవార్త చెప్పింది. అధిక పెన్షన్ కావాలనుకునేవారు, అధిక పెన్షన్ కి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించింది. ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పెన్షన్ దారులు అధిక పెన్షన్ పొందేందుకు వీలుగా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే తేదీని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మార్చి 3 వరకూ ఉన్న గడువు తేదీని మే 3 వరకూ పొడిగించింది. అధిక పెన్షన్ కోసం యజమానితో కలిసి జాయింట్ ఆప్షన్ ఇచ్చేందుకు ఈపీఎఫ్ఓ ఆన్ లైన్ లో దరఖాస్తు ప్రక్రియను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకష్టించింది.
ఉద్యోగుల పెన్షన్ స్కీం 1995 చట్ట సవరణకు ముందుగా అంటే 2014 సెప్టెంబర్ 1వ తేదీ ముందు ఈపీఎఫ్ చందాదారుగా చేరిన వారు సర్వీస్ లో కొనసాగుతూ అధిక వేతనంతో ఈపీఎఫ్ చందా చెల్లిస్తూ.. ఈపీఎస్ చట్టంలోని పేరా నంబర్ 11(3) కింద ఉమ్మడి ఆప్షన్ ఇవ్వలేకపోయిన వేతన జీవులను అర్హులుగా పేర్కొంది. అధిక పెన్షన్ పొందేందుకు యజమానితో కలిసి ఉమ్మడి ఆప్షన్ ఇచ్చేందుకు గడువు తేదీని మే 3 వరకూ ఇచ్చింది. ఈ తేదీలోగా అర్హులైన ఉద్యోగులు, కార్మికులు, వేతన జీవులు ఆన్ లైన్ లో ఉమ్మడి ఆప్షన్ నమోదు చేసుకోవాలని స్పష్టం చేసింది. త్వరలోనే దీనికి సంబంధించిన ఆన్ లైన్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని ఈపీఎఫ్ఓ ప్రకటించింది.