మీరు పీఎఫ్ ఖాతాదారులా..? అయితే ఈ కథనం మీకోసమే. ఉద్యోగులందరూ అప్రమత్తంగా ఉండాలని ఈపీఎఫ్ఓ హెచ్చరిస్తోంది. ఎందుకు..? ఏంటి..? అన్నది తెలుసుకోండి.
ప్రభుత్వ ఉద్యోగులైనా.. ప్రైవేట్ ఉద్యోగులైనా పీఎఫ్ ఖాతా అందరికీ ఉంటుంది. కావున పీఎఫ్ ఖాతా గురుంచి ప్రతి ఉద్యోగికి సుపరిచితమే. ఉద్యోగి జీతం నుంచి నెల నెల కొంత మొత్తంలో ఈపీఎఫ్ఓ పొదుపు ఖాతాలో జమ అవుతుంది. అంతే మొత్తాన్ని యజమాని తన వాటాగా చెల్లిస్తాడు. ఈ మొత్తానికి ప్రతి ఏటా వడ్డీ జమ అవుతుంది. అత్యవసర సమయాల్లో ఉద్యోగి.. తన పీఎఫ్ ఖాతా నుంచి పాక్షికంగా కొంత సొమ్మును విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు, ఇంటి అవసరాలు వంటి వాటి కోసం కొంత మొత్తంలో డబ్బును వెనక్కి తీసుకోవచ్చు. అయితే ఇటీవల కాలంలో ఈ డబ్బు దోచేయడానికి సైబర్ నేరగాళ్లు ప్రయత్నిస్తున్నారట. ఈ క్రమంలోనే ఈపీఎఫ్ఓ తమ ఖాతాదారులను హెచ్చరిస్తోంది.
ప్రజల డబ్బును దోచుకునేందుకు సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడూ సరికొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. లాటరీల పేరుతో కొందరిని, లోన్ ఇప్పిస్తామంటూ నమ్మబలికి మరికొందరిని, ప్రభుత్వ ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలు.. ఈ-కేవైసీ పేరు చెప్పి ఇంకొందరిని మోసం చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. వీరి ఉచ్చులో పడి కష్టపడి సంపాదించిన డబ్బును పోగొట్టుకుంటున్నవారు ఎందరో. అయితే, సైబర్ నేరగాళ్లు ఇప్పుడు ఈపీఎఫ్ఓ సబ్‌స్క్రైబర్ల ఖాతాలపై కన్నేశారని.. జాగ్రత్తగా ఉండాలంటూ పీఎఫ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకుఈపీఎఫ్ఓ ఆన్‌లైన్ స్కామ్ హెచ్చరికలను విడుదల చేసింది.
పీఎఫ్ ఖాతాదారులు.. వారి యూఏఎన్ నెంబర్/ పాస్‌వర్డ్/ పాన్/ ఆధార్/ బ్యాంక్ ఖాతా వివరాలు లేదా ఏదైనా ఇతర వ్యక్తిగత లేదా ఆర్థిక వివరాలను ఎవరితోనూ షేర్ చేయొద్దని ఈపీఎఫ్ఓ సూచించింది. అలాగే ఈపీఎఫ్ఓ సిబ్బంది ఈ వివరాలను.. సందేశాలు, కాల్‌లు, ఈ-మెయిల్, వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా ఎవరిని అడగరని సూచించింది. అలాంటి ఫేక్ కాల్స్/మెసేజ్‌ల పట్ల జాగ్రత్తగా ఉండటమే కాకుండా.. మొబైల్స్ కు వచ్చే ఫేక్ లింకులతో కూడా జాగ్రత్తగా ఉండాలని ఈపీఎఫ్ఓ తమ ఖాతాదారులను హెచ్చరించింది. ఈ సమాచారం కోసం ఏదేని కాల్స్ లేదా మెసేజ్ లు వస్తే స్థానిక పోలీసు/సైబర్ క్రైమ్ బ్రాంచ్‌కు ఫిర్యాదు చేయాలని ఈపీఎఫ్ఓ పేర్కొంది. కావున ఫేక్ కాల్స్ లేదా మెసేజ్ ల పట్ల ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనాఉంది.
#Beware of fake calls/messages. #EPFO never asks its members to share their personal details over phone, e-mail or on social media.#amritmahotsav #alert #staysafe #StayAlert @PMOIndia @byadavbjp @Rameswar_Teli @LabourMinistry @AmritMahotsav pic.twitter.com/Ou0jtNIz28
— EPFO (@socialepfo) April 15, 2023