ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్ఓ) ప్రయోజనాలు ప్రతి ఉద్యోగికి సుపరిచితమే. ఉద్యోగి జీతం నుంచి నెల నెల కొంత మొత్తంలో ఈపీఎఫ్ఓ పొదుపు ఖాతాలో జమ అవుతుంది. అంతే మొత్తాన్ని యజమాని తన వాటాగా చెల్లిస్తాడు. ఈ మొత్తానికి ప్రతి ఏటా వడ్డీ జమ అవుతుంది. ఉద్యోగి అత్యవసర సమయాల్లో పీఎఫ్ ఖాతా నుంచి పాక్షికంగా లేదా ముందస్తుగా కొంత సొమ్మును విత్డ్రా చేసుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు, ఇంటి అవసరాలు, హోం లోన్ వంటి వాటికోసం కొంత మొత్తంలో డబ్బును వెనక్కి తీసుకోవచ్చు. ఈ సదుపాయం కారణంగా కొంత మొత్తంలో డబ్బులు విత్ డ్రా చేసుకొని హోంలోన్ వంటి వాటికి చెల్లించవచ్చు.
ఈ మధ్యకాలంలో ఆర్‌బీఐ రెపో రేటును పలుమార్లు పెంచిన సంగతి తెలిసందే. దీంతో వడ్డీ రేట్లు భారీగా పెరిగాయి. ఈ కారణంగా హోంలోన్లపై నెలవారీగా చెల్లించే ఈఎంఐ మొత్తం పెరిగింది. పెరుగుతున్న వడ్డీ రేట్లను తట్టుకోవడానికి బారోవర్లు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) నుండి వచ్చిన డబ్బుతో హోంలోన్లను పూర్తిగా లేదా పాక్షికంగా చెల్లించవచ్చు. కాకుంటే అందుకు కొన్ని షరతులు ఉన్నాయి. వాటికి లోబడి విత్డ్రా చేసుకోవాలి.
ఈపీఎఫ్ పథకంలోని సెక్షన్ 68-BB ప్రకారం హోంలోన్ రీపేమెంట్ కోసం ఈపీఎఫ్ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే సంబంధిత ఇల్లు వ్యక్తిగతంగా లేదా ఉమ్మడిగా గానీ పీఎఫ్ ఖాతాదారుని పేరుపై ఉండాలి. అలాంటి సమయంలో మాత్రమే గృహ రుణం చెల్లింపు కోసం మొత్తంలో 90 శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ సౌకర్యాన్ని జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే పొందవచ్చు. అలాగే.. అభ్యర్థి తప్పనిసరిగా కనీసం పదేళ్ల పాటు పీఎఫ్ మొత్తాన్ని చెల్లించి ఉండాలి. ఐదు సంవత్సరాలపాటు నిరంతరాయంగా డబ్బు కడితేనే, తీసుకున్న పీఎఫ్ మొత్తానికి పన్ను ఉండదు. లేనియెడల ఈపీఎఫ్ బ్యాలెన్స్‌పై 10 శాతం చొప్పున టీడీఎస్(మూలం వద్ద పన్ను) తీసివేయబడుతుంది. ఒకవేళ మీ ఈపీఎఫ్‌పై వచ్చే వడ్డీ మీ హోంలోన్ వడ్డీ కంటే ఎక్కువ లేదా సమానమైనట్లయితే మీరు మీ ఈపీఎఫ్ కార్పస్‌ను అలాగే ఉంచుకోవచ్చు.